ఆయన పెద్ద మనిషి. వయసు రిత్యాగానే కాదు, పదవి రిత్యా, రాజకీయ అనుభవం రిత్యా కూడా ఆయన గౌరవనీయ వ్యక్తి. అటువంటి వ్యక్తి నోట కౌగిలింతల మాట రావడం షాకింగ్ ఇవ్వలేదు, కాస్త గిలిగింతలు పెట్టిందంతే.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కౌగిలింతల గురించి యువతకు పాఠాలే చెప్పారు. నిజానికి యువతకు ఈ పాఠాలు చెప్పాలా అని అనుకోవచ్చు. కానీ తమ్మినేని చెప్పిన పాఠాలు రివర్స్ లో ఉన్నాయి. కౌగిలింతలు వద్దు. హద్దు దాటవద్దు అంటున్నారు స్పీకర్ మహాశయులు.
నిజంగా ఆయన చెప్పింది. కౌగిలింతలు, షేక్ హ్యాండులూ మన కల్చర్ కాదని, వాటి వల్లనే కరోనా లాంటి మహమ్మారి ఎంచక్కా ఇంట్లోనే వచ్చేస్తోందని పెద్దాయనగా సుద్దులే చెప్పారు. కరోనా మహమ్మారిని తయారు చేసింది ఇలాంటి కల్చరేనని కూడా మండిపడ్డారు.
యువత మన భారతీయ కల్చర్ ని అలవాటు చేసుకోవాలని, చక్కగా నమస్కారం చేయడం మన సంస్కారం అని గుర్తించాలని కూడా తమ్మినేని హితవు చెప్పారు. హగ్గులు, పెగ్గులకు దూరంగా ఉండండి ఆరోగ్యం కాపాడుకోండి అని తన వయసుకు, హోదాకు, అనుభవానికి తగిన పలుకులే పలికారు. మరి యువతరం వినాలి. ఆచరించాలి. అపుడే అందరికీ సౌభాగ్యం.