సామూహిక ప్రార్థనలకు సంకటమైన లాక్ డౌన్

ఏప్రిల్ 24 నుంచి ప్రపంచంలోని ముస్లిములందరికి ఎంతో పవిత్రమైన రంజాన్ (రమదాన్) మాసం ప్రారంభమవుతోంది. ప్రధానంగా అరబ్ దేశాలు, ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలు ఏప్రిల్ 24 నుంచే రంజాన్ నెల ప్రారంభిస్తున్నాయి. Advertisement…

ఏప్రిల్ 24 నుంచి ప్రపంచంలోని ముస్లిములందరికి ఎంతో పవిత్రమైన రంజాన్ (రమదాన్) మాసం ప్రారంభమవుతోంది. ప్రధానంగా అరబ్ దేశాలు, ముస్లిములు మెజారిటీగా ఉన్న దేశాలు ఏప్రిల్ 24 నుంచే రంజాన్ నెల ప్రారంభిస్తున్నాయి.

కతార్, ఈజిప్టు, ఇండోనేషియా, లెబనాన్, మొరాకో, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మరికొన్ని అరబ్ దేశాలు 24 వ తేదీని రంజాన్ నెల ప్రారంభంగా పరిగణిస్తున్నాయి.  కొన్ని దేశాలు 23 వ తేదీ రాత్రి నుంచి, అంటే ఈ రోజు నుంచి రంజాన్ మాసాన్ని ప్రారంభిస్తున్నాయి.

ప్రతి ఏడాది ఇలాంటి తేడాలు రావడం సాధారణమే. ఈ ఏడాది ఇది కాదు అసలు సమస్య. రంజాన్ అంటేనే మనకు కనబడే దృశ్యం సామూహిక ప్రార్థనలు. దాంతోపాటు సాయంత్రం వేళ ఇఫ్తార్ విందులు. రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం.

రంజాన్ మాసంలో రాత్రంతా వివిధ రకాల షాపులు తెరిచే ఉంటాయి. అయితే ఈ ఏడాది ఇలాంటి దృశ్యాలు కనబడవు. ఇందుకు కారణం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో విధించిన లాక్ డౌన్. అరబ్ దేశాలు కూడా లాక్ డౌన్ కు మినహాయింపు కాదు కదా. చాలా అరబ్ దేశాలు కరోనా బారిన పడ్డాయి. ఇరాన్ వంటి దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. 

ముస్లిం సమాజానికి లాక్ డౌన్ అశనిపాతమైంది. సామూహిక ప్రార్థనలు అనుమతించేది లేదని ముస్లిం దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. కొన్ని దేశాల్లో మసీదులను మూసేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని పలు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. దాన ధర్మాలు ఆన్ లైన్లో చేయాలని కోరాయి.

రంజాన్ మాసంలో మనం ఎక్కువగా చూసే దృశ్యం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకోవడం. రంజాన్ ముబారక్, రంజాన్ కరీం అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

కానీ ఇప్పుడు కరోనా కారణంగా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఆలింగనం చేసుకోవద్దని ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. రంజాన్ మాసంలో కనబడే మరో దృశ్యం హలీం విక్రయం. భారత్ లో, ఇంకా చెప్పాలంటే మన హైదరాబాదులో హలీం విక్రయాలు జోరుగా సాగుతాయి. ఎక్కడ చూసినా హలీం అమ్మే దుకాణాలే కనబడతాయి. ముస్లిములు సహజంగానే నాన్ వెజ్ హలీం సేవిస్తారు. అయితే హిందువులకు కూడా హలీం  అంటే  ఎంతో ఇష్టం.

అందుకే  శాకాహారులైన హిందువుల కోసం వెజ్ హలీం తయారు చేస్తారు. లాక్ డౌన్ కారణంగా ఈ ఎంజాయిమెంట్ కూడా ఉండదు. హలీం తయారు చేసే కొన్ని ప్రసిద్ధ సంస్థలు హైదరాబాదులో ఉన్నాయి కూడా. రంజాన్ చివర్లో ముస్లిములు ఈద్ అల్ ఫితర్ జరుపుకుంటారు. అరబిక్ లో దీని అర్థం ఉపవాసాన్ని ముగించే ఉత్సవం అని. కరోనా కారణంగా ఈ ఏడాది రంజాన్ వైభవం కనబడకుండా పోతోంది. ఆనందంగా జరుపుకునే రంజాన్ మాసాన్ని లాక్ డౌన్ నేపథ్యంలో జరుపుకోవలసి వస్తోంది. 

మీరు ఎంత గొప్పవాళ్ళో ఇప్పుడు తెలిసింది