ఉద్యోగుల జీతాలు పెంచాలని ఆందోళన చేస్తున్నారు. కొత్త పీఆర్సీతో జీతాలు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా వారు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో జిల్లాలు పెంచుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీన్ని పొలిటికల్ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు కొంతమంది.
డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేరిస్తే పొలిటికల్ డ్రామా ఎందుకవుతుంది. అసలు జిల్లాల పెంపుకి, జీతాల విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఏంటి సంబంధం..?
జిల్లాల పెంపు మేనిఫెస్టో హామీ..
నవరత్నాలు సహా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే గతంలో జిల్లాల పెంపుకి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కరోనా వల్ల జనగణన పూర్తి కాకపోవడంతో కాస్త వెనకడుగు పడింది.
అయితే కరోనా కష్టాలు ఇప్పుడల్లా తొలగిపోయే అవకాశం లేకపోవడంతో.. ధైర్యంగా జిల్లాల పెంపుకి ముందడుగు వేసింది, నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పెంపుతో పాలనా సౌలభ్యం పెరుగుతుందనేది ప్రభుత్వం వాదన.
జీతాల డిమాండ్లతో పోలికా..?
ఓవైపు ఉద్యోగులు పీఆర్సీ విషయంలో గొడవలు చేస్తున్నారు. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలంటున్నారు. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. కొత్త పీఆర్సీ అమలు చేయాల్సిందేనంటూ అల్టిమేట్టం ఇచ్చింది. దీంతో ఉద్యోగస్తులు ఇరుకునపడ్డారు.
అదే సమయంలో జిల్లాల ప్రస్తావన రావడంతో దానిపై కూడా విమర్శలు చేస్తున్నారు. జిల్లాల ప్రకటనతో ఊరూవాడా జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరుగుతున్నాయి. నాయకులు, ప్రజలు జగన్ ఆలోచనను మెచ్చుకుంటున్నారు.
అదే సమయంలో ఉద్యోగుల్లో మాత్రం కోపం రగిలిపోతోంది. ఓవైపు ప్రభుత్వంపై తమ పోరాటం జరుగుతుంటే, మరోవైపు జగన్ జిందాబాద్ అనే నినాదాలు వారికి రుచించడం లేదు. అందుకే జిల్లాల విభజనను కూడా వారు భూతద్దంలో చూస్తున్నారు. తమ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికే ఆ నోటిఫికేషన్ విడుదలైనట్టు అపోహ పడుతున్నారు.
ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ఉద్యోగుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. జిల్లాల ప్రకటనతో ప్రభుత్వం మీ ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తోందంటూ ఉద్యోగుల్ని ఎగదోస్తున్నారు ప్రతిపక్ష నేతలు. పనిలో పనిగా జిల్లాల పేర్ల విషయంలో రచ్చ మొదలు పెట్టారు. సంబంధం లేని విషయాలను సాగదీస్తున్నారు.