తెలుగుదేశం పార్టీకి ఓటమి దక్కి మూడేళ్ళు గడుస్తున్న కొన్ని ఏరియాల్లో ఇంకా పూర్వపు పరిస్థితే కొనసాగుతోంది. గత వైభవం అన్నది కూడా చూస్తే దరిదాపుల్లో సైతం కనిపించడంలేదు. అలాంటి వాటిలో విజయనగరం జిల్లా ముందు వరసలో ఉంది.
విజయనగరం జిల్లాలో ఒకేసారి ఇద్దరు టీడీపీ నేతలు వైసీపీలో చేరిపోయారు. వారిలో ఒకరు కీలకమైన మహిళా నేత. అంతే కాదు, ఆమె టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎస్ కోట ఎమ్మెల్యేగా చేశారు. అలాంటి శోభా హైమావతి జగన్ సమక్షంలో పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.
మంచి మాటకారి, ఎస్టీల్లో బలం ఉన్న శోభా హైమావతి ఈ సందర్భంగా అన్న మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని, ప్రత్యేకించి గిరిజనులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో బాబు ఒక్క గిరిజన మంత్రి కూడా లేరని, అదే జగన్ సీఎం అవుతూనే ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళను చేశారని అన్నారు.
ఇంకో వైపు చూస్తే పార్వతీపురం మాజీ ఎంపీ, గిరిజన మేధావి అయిన డాక్టర్ డీవీజీ శంకరరావు జగన్ పార్టీలో చేరారు. సామాన్యుడిని భరోసా ఇచ్చిన ప్రభుత్వం వైసీపీది అని ఆయన అన్నారు. మళ్ళీ జగనే సీఎం కావాలని ఆయన కోరుకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తప్పక తీసుకువస్తామని శోభా హైమావతి ఒట్టేసి మరీ చెప్పారు.
మొత్తానికి గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తానికి మొత్తం తొమ్మిది ఎమ్మెల్యే సీట్లూ, ఒక ఎంపీ సీటూ కూడా వైసీపీ పరం అయ్యాయి. అలా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో మరో మారు అదే రిజల్ట్ రిపీట్ అయ్యేలా ఈ చేరికలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ తాజా పరిణామాల మీద టీడీపీ ఎలా రియాక్ అవుతుందో, ఎలా సర్దుబాటు చేసుకుంటుందో చూడాలి.