టీడీపీ అధినేత చంద్రబాబుకు దక్కాల్సిన ప్రశంసలు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దక్కుతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే జగన్ ను ప్రశంసిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు అవశేష ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి కాగానే ఆ పని చేసుంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు చంద్రబాబును ఆకాశానికి ఎత్తేవాళ్లు. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించేవారు.
కానీ బాబు ఆ అవకాశం పోగొట్టుకున్నారు. రాజకీయ ప్రయోజనాలకోసమైనా జగన్ ఆ పని చేసి ప్రశంసలు పొందుతున్నారు. ఇంతకూ బాబు చేయని పని, జగన్ చేసిన పని ఏమిటి ? టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ ఎన్టీఆర్ పేరు కొత్తగా ఏర్పాటు చేయబోయే విజయవాడ జిల్లాకు పెట్టాలని నిర్ణయించడం. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే మేమెందుకు వ్యతిరేకిస్తాం అంటున్నారు టీడీపీ వ్యూహ కమిటీ సభ్యులు.
అయితే ఆయన కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదు. ఆయనకు భారత రత్న ఇవ్వాలని మేం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్ఠీఆర్ పేరును వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలగించినా, ఆ తరువాత కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టినా తాము వ్యతిరేకించలేదన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మీద ప్రేమ ఉందని జగన్ చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. దీన్నిబట్టి ఏం అర్ధమవుతోంది? బాబుకు దక్కాల్సిన పేరు జగన్ కు దక్కిందని ఆక్రోశం కనబడుతోంది. బాబు చేయని పని జగన్ చేస్తే అది ఆయన తప్పవుతుందా?
కృష్ణా జిల్లాను విభజించి ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే పురంధరేశ్వరి, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు స్పందించి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. తన తండ్రి నందమూరి తారకరామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లా ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు వారందరూ గర్వ పడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై ప్రముఖ నిర్మాత దర్శకుడు వైవీఎస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రం గా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఏపీ జిల్లాల పునర్విభజనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2019నుంచి జగన్ పాలనలో వంద పనులు చేస్తే అందులో 99 శుద్ధ తప్పులు ఉన్నాయని, ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రశ్నిస్తే ఒక సమాధానం లేదని, రాష్ట్ర అప్పుల గురించి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక హోదా పైన కూడా సమాధానం లేదని, ఉద్యోగుల సమస్యలపై కూడా సమాధానం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగుతోందని ఆరోపణలు గుప్పించారు.
ఏది ఏమైనా జగన్ 99 తప్పులు చేసినా ఒక్క మంచి పని చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాల పునర్విభజనలో కృష్ణా జిల్లాను పునర్విభజన చేసి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం ఒక్కటే మంచి పని అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇటు వైసీపీ మంత్రి కొడాలి నాని సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ అభిమానుల ఓట్లు వైసీపీకి పడతాయా?