Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: గుడ్ లక్ సఖి

మూవీ రివ్యూ: గుడ్ లక్ సఖి

టైటిల్: గుడ్ లక్ సఖి
రేటింగ్: 1/5
తారగణం: కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, శ్వేతావర్మ తదితరులు
కెమెరా: చిరంతన్ దాస్ 
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ 
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ 
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
దర్శకత్వం: నాగేష్ కుకునూర్ 
విడుదల తేదీ: 28 జనవరి 2022

తెలుగువాడైనప్పటికీ దర్శకుడు నాగేష్ కుకునూర్ ఇంతవరకూ తెలుగు సినిమా తీయలేదు. తనవన్నీ అంతర్జాతీయ చిత్రోత్సవాలని టార్గెట్ చేసుకుని తీసినలాంటి అవార్డు సినిమాల్లాంటివే. అయితే అతని పేరుకి మాత్రం గౌరవప్రదమైన బ్రాండ్ వేల్యూ ఉంది. దర్శకుడైన 24 ఏళ్లకి తొలిసారిగా ఈ డైరెక్ట్ తెలుగు సినిమాతో అరంగేట్రం చేసాడు. 

ఆ పేరుకి తోడు కీర్తి సురేష్, సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ పేర్లు కూడా తోడయ్యే సరికి సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. 

విడుదలైన ట్రైలరు, పాట సినిమా అద్యంతం సరదాగా ఉంటుందనే సంకేతాలిచ్చాయి. 

ఇంతకీ సినిమాలో ఏముంది? తీసిన వాళ్లకి, చూసినవాళ్లకి గుడ్ లక్కా కాదా అనేది చూద్దాం. 

ఏ సినిమా కథని తీసుకున్నా బలమైన సంఘర్షణ ఉండాలి. ఆ సంఘర్షణని ఎదుర్కొనే ప్రధానపాత్రతో ప్రేక్షకులు మమేకం కావాలి. అది లేనప్పుడు ఏదో చిన్నపిల్లలు చెప్పే కథలా ఉంటుంది తప్ప చేయితిరిగిన దర్శకుడు చెప్పినట్టుండదు. 

ఇక్కడ అదే జరిగింది. జీవితంలో గెలవాలంటే లక్కుని నమ్ముకోవాలా? లేక ప్రతిభనా? ఈ ప్రశ్న చుట్టూ సినిమాని నడిపి సమాధానం మాత్రం బలంగా చెప్పలేకపోయాడు దర్శకుడు. 

ఇందులో ప్రధాన పాత్రలన్నీ కన్ ఫ్యూజింగానే ఉంటాయి. 

సఖి పాత్రగానీ, రాజు క్యారెక్టర్ గానీ బలంగా లేవు. 

పల్లెటూరులో నాటకాలాడే యువకులు, ఆ నాటాకాల్లో రాజు ప్రతిభ గురించి విని మాయాబజార్ మళ్లీ తీద్దామని వచ్చే ఒక వ్యక్తి...ఏ కాలంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితిలోకి నెడుతుంది ప్రేక్షకుల్ని. పైగా ఘటోత్కచుని పాత్ర వేసే రాజుకి పదాల ఉచ్చారణ కూడా సరిగా లేదు. ఘటోత్కచ ని ఘటోద్గజ అంటుంటాడు. 

గోళీలాటలో సత్తా చూపించే అమ్మాయి రాష్ట్రస్థాయి షూటింగ్ క్రీడాకారిణి అవడం ప్రధాన కథ అనుకుంటే అసలిది ఎప్పటిది అనిపిస్తుంది. ఇంతకన్నా పెద్ద కాన్వాసులో 20 ఏళ్ల క్రితం లగాన్ వచ్చింది. పల్లెటూరిలో రకరకాల పనులు చేసుకునే వాళ్ల చేతుల్లో ఒక్కొక్కరికి ఒక్కోరకమైన మెళకువ ఉంటుంది. దానిని కథానాయకుడు క్రికెట్ కి ఎలా వాడుకున్నాడు అనేది పెద్ద ఎమోషనల్ పాయింట్. అందుకే ఆ సినిమాలో హీరో పక్షం వాళ్లు గెలిచినా ఓడినా ప్రేక్షకుడు ఉత్కంఠకి గురయ్యాడు. 

ఆ పరిస్థితి ఆవగింజంతైనా లేదు ఈ "గుడ్లక్ సఖి" లో. ఇంటర్వల్ వరకు చూపించి తర్వాతేమౌతుందని అడిగితే స్కూలు పిల్లలు కూడా ప్రెడిక్ట్ చేసేసేలాగుంది కథ, కథనం. చాలా సినిమాలు ప్రెడిక్టిబుల్ గా ఉన్నా డయలాగో, చిన్న చిన్న మలుపులో ఆసక్తి కలిగించి కూర్చోపెడతాయి. అలాంటివి కూడా లేవిందులో. 

ఎవరికి తానెదురైనా బ్యాడ్లక్ అనిపించుకునే హీరోయిన్ గుడ్లక్ గోళీలనే కాకుండా తన ప్రతిభని కూడా నమ్ముకుని ఆ ఊరికి ఎలా గుడ్లక్ తీసుకొస్తుందనేది సింగిల్ లైన్ కథ. ఇలా చెప్పడం వల్ల ఏ సస్పెన్సూ రివీల్ చేసినట్టు కాదు. కథంతా పూసగుచ్చినట్టు చెప్పేసినా కూడా స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవ్వదు. ఎందుకంటే సినిమా మొదలైన ముప్పావుగంటకి కథేంటనేది పూర్తిగా అర్థమైపోతుంది. 

కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా ఉన్నంతలో బాగున్నాయి. ఎడిటింగ్ పదునుగా ఉంది. 

ఎటువంటి బలమైన భావోద్వేగాలూ లేని ఈ సినిమాని కీర్తి సురేష్ ఎలా ఒప్పుకుందో తెలియదు. బహుశా కథ విని ఆమె వేరేలా ఊహించుకుని ఉండొచ్చు. ఆమె నటన గురించి వంకపెట్టలేం. కానీ ఆమె నటనాప్రతిభని చాటుకోవడానికి అవకాశమే లేదిందులో. 

ఆది పినిశెట్టిలో ఎటువంటి మెరుపులూ లేవు. బాగా తెలిసిన మొహం కాబట్టి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందంతే. 

జగపతిబాబుకి బ్యాక్ స్టోరీ ఏమీ లేదు. అసలతను మిలిటరీ నుంచి పల్లెటూరికొచ్చి ఊళ్లో వాళ్లకి గన్ షూటింగ్ లో ట్రైనింగ్ ఇవ్వాలని ఎందుకనుకుంటాడో నేపథ్యం లేదు. 

రాహుల్ రామకృష్ణ పాత్రకూడా సగం ఉడికిన పదార్థంలా ఉంది. బస్సుల్ని ఆపి దారి దోపిడీ చేసిన వాడు దొరికిపోతే, ఏదో స్కూల్లో పెన్సిల్ దొంగని ట్రీట్ చేసినట్టుగా డయలాగులు కొడతాడు జగపతిబాబు. ఆ మాటలకి అతను మారిపోతాడు కూడా. అసలీ పాత్ర మీద ఊళ్లో జనానికి, ప్రేక్షకులకి కూడా అసహ్యం కలిగేలా మలిచుండొచ్చు. అప్పుడు మరింత రక్తి కట్టేది.  

ఓటీటీలో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ చూసేసేలాంటి సినిమా ఇది. కాసేపు మిస్సయి మళ్లీ వచ్చినా ఎక్కడ వేసిన కథ అక్కడే ఉన్నట్టుంటుంది. 

సినిమాలో చెప్పిన గుడ్ లక్- బ్యాడ్ లక్ సెంటిమెంటు సంగతి ఏమో గానీ ఈ చిత్ర నిర్మాత ఈ కథని ఎంచుకోవడం మాత్రం బ్యాడ్లక్కే. విన్నప్పుడే చెప్పేయాల్సింది ..ఇది పాతికేళ్ల క్రితమైతే చేసుండేవాళ్ళమని. కానీ ఏం చెస్తారు పాపం జడ్జ్మెంట్ చేయగలిగే ప్రతిభ కలిసిరాలేదు. ఫలితం బ్యాడ్లక్ గా మిగిలింది. 

బాటం లైన్: బ్యాడ్ లక్కే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?