అపెక్స్ మీటింగ్ పై తేల్చేసిన కేంద్ర మంత్రి

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మీటింగ్ కోసం…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఈనెల 6న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ మీటింగ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. కొన్నాళ్లుగా ఈ మీటింగ్ వాయిదా పడుతూ వస్తోంది, ఇటు జల జగడాలకు పరిష్కారాలు దొరకడం లేదు. 

అనుమతులు లేకుండానే ప్రాజెక్ట్ లు పట్టాలెక్కిస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో ఎలాగైనా ఈ మీటింగ్ లో పరిష్కారం దొరుకుతుందని, కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఓ దారి చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే జల జగడాలపై మేం చేసేదేమీ లేదంటూ తేల్చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.

ఏపీ, తెలంగాణ రెండుచోట్లా.. బీజేపీ ఎదగాలని చూస్తోంది, సో.. ఏ రాష్ట్రానికైనా అన్యాయం చేసిందన్న పేరు తెచ్చుకోవడం ఆ పార్టీకి ఇష్టంలేదు. అందులోనూ తెలంగాణలో వస్తున్న మండలి ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల కారణంగా కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యం బీజేపీ చేయదు కాక చేయదు. ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టారు కిషన్ రెడ్డి.

మీరూ మీరూ పార్టీలు చేసుకుంటారు, పండగలకి వెళ్తారు, దావత్ లు ఇచ్చిపుచ్చుకుంటారు.. అంత స్నేహం మీ మధ్య ఉంది కాబట్టి మీరే సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకోండి అంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఉచిత సలహా పడేశారు కిషన్ రెడ్డి. జలవివాదాలు ఏళ్ల తరబడి కొనసాగడంలో కేంద్రం తప్పేమీ లేదని, రెండు తెలుగు రాష్ట్రాలు కలసి చర్చించుకోవాలని సూచించారు.

మహారాష్ట్ర, తెలంగాణ ఓ అంగీకారానికి వచ్చినట్టే.. ఏపీ, తెలంగాణ మధ్య కూడా సయోధ్య కుదుర్చుకోవాలని చెప్పారు. ఇద్దరూ ఓ ఒప్పందానికి వస్తే కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తుందని అన్నారు కిషన్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా అబివృద్ధి చెందాలని కేంద్రం భావిస్తోందని, ఏ ఒక్కరికీ అన్యాయం చేయబోమని స్పష్టం చేశారాయన. పరోక్షంగా సమస్య పరిష్కారం తమ చేతిలో లేదని, ఉన్నా తామేమీ చేయలేమని తేల్చేసారు.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్న స్నేహం కూడా బీజేపీకి కంటగింపుగా మారిందనే విషయం ఆయన మాటల్లో అర్థమవుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం అన్నట్టు తయారైంది పరిస్థితి. అపెక్స్ మీటింగ్ పై ఆశలు పెట్టుకున్నవారికి.. అక్కడ జరిగేదేమీ లేదని మరోసారి క్లారిటీ వచ్చేసింది.

బీసీలు ముద్దు..కాపులు వ‌ద్దు