సిల్క్ స్మిత …సౌత్ ఇండియా గ్లామర్ క్వీన్. మత్తెక్కించే ఆమె కళ్లు, మాయ చేసే ఆమె మాటలు, హిప్నటైజ్ చేసేలా ఆమె అభినయం… ఇలా సిల్క్ స్మిత గురించి ఎన్ని విశేషాలైనా చెప్పుకోవచ్చు.
బావలు సయ్యా అని ఆమె అంటే సైసై … అంటూ మీదికి దూసుకుపోయేంతగా తన నటనతో ఒక వర్గం ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారామె. సిల్క్ స్మిత అంటే కుర్రకారే కాదు, వెంట్రుకలు నెరసిన పెద్దల గుండెల్లో గుబులు రేపే నటిగా గుర్తింపు పొందారు.
చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపిన గ్లామర్ క్వీన్ అకస్మాత్తుగా ఈ లోకం వీడిన విషయం తెలిసిందే. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజాగా ఆమె జీవితం ఆధారంగా తమిళంలో సినిమాను తెరకెక్కించ నున్నారు. ఈ సినిమాకు ‘అవళ్ అప్పడిదాన్’ (ఆమె అంతే అని అర్థం) అనే టైటిల్ ఖరారు చేశారు. లక్ష్మణ్, హెచ్.మురళి నిర్మించనున్న ఈ సినిమాకు కేఎస్ మణికందన్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాను నవంబర్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు సమాచారం. అయితే సిల్క్‌స్మిత పాత్రధారి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. ఆలోచనైతే బాగుంది కానీ, ఆమె పోలికలకు దగ్గరగా ఉండే నటి అయితే మాత్రం తప్పక హిట్ సాధిస్తుంది.
ఎందుకంటే సిల్క్ స్మితను తెరపై చూడగానే ఒక రకమైన హృదయగతమైన ఫీల్ కలిగించేలా ఉండాలి. కళ్లతో పాటు మాటలతో మత్తెక్కించేలా ప్రేక్షకుల్ని హిప్నటైజ్ చేయగలిగే నటిని ఎంపిక చేయాల్సి వుంటుంది. అలాంటి నటి కోసం ఎదురు చూస్తున్నట్టు దర్శకుడు మణికందన్ తెలిపారు.