మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్ళీ అదే పాట పాడుతున్నారు. విశాఖ జిల్లా వాసులెవరూ రాజధానిని కోరుకోవడంలేదని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. పోనీ అలాగే అనుకున్నా దానికి ఒక ప్రాతిపదిక కావాలిగా. టీడీపీ దీనిమీద ఓటింగ్ ఏమైనా నిర్వహించిందా. లేక ప్రజా సంఘాలు ఎక్కడైనా జనాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారా అన్న అన్న ప్రశ్నలు వస్తున్నాయిపుడు.
ఏమీ లేకుండానే అయ్యన్న దబాయింపు ధోరణిలో మాకు రాజధాని వద్దు అని జనం మాటగా తానే అన్నీ చెప్పేస్తూండడం విడ్డూరమే మరి. నిజానికి అభివ్రుద్ధి ఎవరూ కాదనుకోరు. పైగా విశాఖ రాజధాని కావాలని 2014కి ముందు తరువాత కూడా సంతకాల సేకరణ జరిగింది. ప్రజా సంఘాలు, మేధావులు కూడా విశాఖను రాజధానిగా చేయమని నాడు ఎన్నో రకాలుగా విన్నపాలు చేశారు.
ఇక తాజాగా కూడా నగరంలో దీక్షలు కూడా విశాఖ రాజధాని కోసం జరుగుతున్నాయి. వీటిని మించి టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఒక మాట చెప్పారు. రాజధాని కోసం టీడీపీ నాడు నిర్వహించిన ఓటింగులో ఎక్కువమంది విశాఖను రాజధానిగా కోరుకున్నారని. అనాడు అయ్యన్నపాత్రుడు మంత్రిగా కూడా ఉన్నారు.
ఇవన్నీ మరచిపోయి విశాఖవాసులకు రాజధాని వద్దు అని మొత్తం నలభై లక్షల ప్రజల తరఫున వకాల్తా పుచ్చుకుని చెప్పడానికి ఆయనెవరు అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
టీడీపీకి, చంద్రబాబుకు నచ్చనిది జనం నెత్తిన రుద్దితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూడబోతే విశాఖ లో వైసీపీ పోటీ చేయరాదు అన్నది కూడా జనాభిప్రాయమని తమ్ముళ్ళు చెప్పేలా ఉన్నారని సెటైర్లు పడుతున్నాయి.