కరోనా బారిన పడి హాస్పిటల్ లో జాయిన్ అయిన కొన్ని గంటలకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పుకార్లు ఊపందుకున్నాయి. హాస్పిటల్ లో జాయిన్ చేయడానికి ముందే ట్రంప్ కు కృత్రిమ శ్వాస ద్వారా ఆక్సిజన్ అందించారని, హాస్పిటల్ లో కూడా అదే ప్రక్రియ కొనసాగుతోందని ఊహాగానాలు చెలరేగాయి. మరోవైపు ట్రంప్ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారని కూడా కథనాలు వచ్చాయి. వీటన్నింటినీ సింపుల్ గా కొట్టిపారేశారు అధ్యక్షుడు.
తనపై వస్తున్న ఊహాగానాలు, పుకార్లకు స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ వివరణ ఇచ్చారు. తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఏకంగా 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశారు.
“నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వాల్టర్ రీడ్ మెడికల్ సెంటర్ లోనే ఉన్నాను. ఇక్కడ్నుంచే విధులు నిర్వర్తిస్తున్నాను. త్వరలోనే నేను కోలుకొని మళ్లీ ప్రచారం ప్రారంభిస్తాను. రాబోయే 2-3 రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కీలకమైన పరీక్షలు అప్పుడే ఉన్నాయి. నేను ఇక్కడకు రాకముందు నా ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. కానీ ఇప్పుడు ఎంతో మెరుగైంది.”
ఇలా తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా స్పష్టత ఇచ్చారు ట్రంప్. తను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రపంచ నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్.. వీలైనంత త్వరగా తిరిగి ప్రచారంలోకి వస్తానని అంటున్నారు.
ట్రంప్ కు వైద్యులు మొదటి రోజు నుంచే మెరుగైన చికిత్స ప్రారంభించారు. యాంటీవైరల్ ఇంజెక్షన్లతో పాటు.. శరీరానికి బలాన్నిచ్చే ఇంజెక్షన్లను కూడా ఇస్తున్నారు. అటు ట్రంప్ భార్య మెలానియా ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్టు వైజ్ హౌజ్ వర్గాలు తెలిపాయి. ఆమె వైట్ హౌజ్ వద్ద నుంచే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.