అయ్య‌య్యో…కేసీఆర్ ద‌గ్గ‌ర ప‌నిచేయ‌ని ఆర్‌కే ‘చాణక్యం’

2019, డిసెంబ‌ర్ 8న  ఆంధ్ర‌జ్యోతిలో ‘కేసీఆర్‌ చాణక్య నీతి!’ శీర్షిక‌తో ఆ ప‌త్రిక ఎండీ ఆర్‌కే రాసిన ‘కొత్త‌పలుకు’ కేసీఆర్ మ‌న‌సును రంజింప చేయ‌లేక‌పోయింది. ఆర్‌కే వ్ర‌తం చెడినా ప్ర‌యోజ‌నం మాత్రం సిద్ధించ‌లేదు. కేసీఆర్…

2019, డిసెంబ‌ర్ 8న  ఆంధ్ర‌జ్యోతిలో ‘కేసీఆర్‌ చాణక్య నీతి!’ శీర్షిక‌తో ఆ ప‌త్రిక ఎండీ ఆర్‌కే రాసిన ‘కొత్త‌పలుకు’ కేసీఆర్ మ‌న‌సును రంజింప చేయ‌లేక‌పోయింది. ఆర్‌కే వ్ర‌తం చెడినా ప్ర‌యోజ‌నం మాత్రం సిద్ధించ‌లేదు. కేసీఆర్ చాణ‌క్య నీతి వ్యాసం చ‌దివిన‌ప్పుడే అంద‌రికీ అనుమానం…కేసీఆర్‌తో ఏదో పెద్ద ప‌నే ఉందని. లేక‌పోతే నిన్న‌టి వ‌ర‌కు ‘నియంత’ అని రాసిన ఈ కాల‌పు మ‌హా జ‌ర్న‌లిస్ట్ ఆర్‌కే క‌లం నుంచి ఇలాంటి ‘చాణ‌క్య’ రాత‌లు రావ‌డం ఏంట‌బ్బా అని సందేహించిన వాళ్లే ఎక్కువ‌.

తాజాగా ‘ఆంధ్రజ్యోతి’పై వివక్ష అంటూ ఓ వార్త‌. ఇంత‌కూ ఈ వార్త సారాంశం ఏంటంటే…
 
‘ఏబీసీ సర్టిఫికెట్‌ కూడా లేని ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ వంటి పత్రికలకు పెద్ద ఎత్తున ప్రకటనలు జారీ చేస్తూ, ఏబీసీ ప్రకారం మూడో స్థానంలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 2019 జనవరి నుంచి సెప్టెంబరు వరకు ‘ఆంధ్రజ్యోతి’కి రూ.2.14 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేయగా, ముఖ్యమంత్రి బంధువుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పత్రికలకు రూ.16.92 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. ఇది పత్రికను ఆర్థికంగా ఇబ్బంది పెట్టడమే. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడమే. ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదులో ‘ఆంధ్రజ్యోతి’…ఇదీ అస‌లు సంగ‌త‌న్న మాట‌'.

కేసీఆర్ చాణక్య నీతి వ్యాసంలో ఆర్‌కే తెలంగాణ సీఎంను ఆకాశానికి ఎలా ఎత్తాడో ఒక సారి చూద్దాం…

‘అప్పుడప్పుడు ప్రజల భావోద్వేగాలను సంతృప్తిపరుస్తుండటం ప్రజలకు ప్రభుత్వాల పట్ల భక్తిని పెంచుతుంది.. ఇది చాణుక్యుడి రాజనీతి! తనను అవమానించిన ధననందుడు అనే రాజును ధిక్కరించి ఆయన సామ్రాజ్యాన్ని కూల్చివేసి చంద్రగుప్తుణ్ని రాజుగా చేసిన మహా మేధావి చాణక్యుడు. చాణక్యుడికే రాజనీతిని బోధించే సత్తా ఉన్న నేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!’ …అయ్య బాబోయ్‌, ,చాణ‌క్యుడికే రాజ‌నీతి బోధించే గొప్ప నేత కేసీఆర్ అట‌!

ఇంకా ఏమ‌న్నారో చూడండి…

 ‘కేసీఆర్‌ చర్యలన్నీ ప్రారంభంలో అరాచకంగా కనిపిస్తాయి. చివరకు ప్రత్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తాయి. వేలాది పుస్తకాలను పఠించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్ని ఔపోసన పట్టకుండా ఎందుకుంటారు? తెలంగాణ సమాజం గురించి పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌కు చాణక్య నీతిని ఎప్పుడు ప్రదర్శించాలో కూడా బాగా తెలుసు!’

చంద్ర‌బాబు స‌ర్కార్ కేవ‌లం ఒక్క ఆంధ్ర‌జ్యోతికే గ‌త ఐదేళ్ల‌లో సుమారు రూ.750 కోట్ల‌ను ప్ర‌క‌ట‌న‌లు, ప్ర‌చారం కోసం దోచిపెట్టింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇంత వ‌ర‌కు బాబు స‌ర్కార్ నుంచి ఎంత వ‌చ్చింద‌నే విష‌య‌మై ఆర్‌కే నోరు మెద‌ప‌లేదు. తెలంగాణ స‌ర్కార్ కూడా త‌న బాస్ చంద్ర‌బాబులాగా దోచి పెట్టాల‌ని ఆర్‌కే ఆశిస్తున్న‌ట్టుంది.

పొగ‌డ్త‌ల‌కు ఒక రేటు, తెగ‌డ్త‌ల‌కు మ‌రో రేటు ఉంటుంది మేస్టారూ. ఆ మాత్రం తెలియ‌కుండానే మీడియా సంస్థ‌ను న‌డుపుతున్నారా?  కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ఎన్నిర‌కాలుగా వ్య‌తిరేక వార్త‌లు వండివార్చారో మీరు (ఆర్‌కే) మ‌రిచిపోయి ఉండొచ్చేమో…కానీ కేసీఆర్ ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకునే ఉంటాడు. ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండ‌దు. ఎందుకంటే  కేసీఆర్‌కు చాణక్య నీతిని ఎప్పుడు ప్రదర్శించాలో కూడా బాగా తెలుసని త‌మ‌రే క‌దా సెల‌విచ్చింది.

బాలయ్య గుండు సీక్రెట్ అదేనా?

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది