ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయి. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. ఆ పాఠశాలలో నిర్వహించే ‘ హ్యాపీనెస్ క్లాస్’ గురించి అడిగి తెలుసుకుంటారు. అమెరికా మొదటి మహిళ దృష్టిని ఆకర్షించిన ప్రభుత్వ పాఠశాలల రూపకర్త మాత్రం కేజ్రీవాల్ సర్కార్ అని చెప్పక తప్పదు.
కేజ్రీ సర్కార్ తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలను సందర్శించేందుకు వస్తున్న మెలానియా కార్యక్రమానికి మాత్రం…ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేకపోవడం గమనార్హం. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ చేతిలో బీజేపీ ఘోర ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. దాన్ని మనసులో పెట్టుకుని కేజ్రీవాల్‌ను ఉద్దేశపూర్వకంగా ఆహ్వానించలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
భారత్ గొప్పదనం చాటేందుకు మాత్రం…కేజ్రీవాల్ సర్కార్ గొప్పగా ఆవిష్కరించిన ప్రభుత్వ పాఠశాలలు పనికొస్తున్నాయని, అందుకు కారకులైన పాలకులకు ఆహ్వానం పలికేందుకు మోడీ సర్కార్‌కు మనసు రావడం లేదని ఆప్ విమర్శిస్తోంది. దురుద్దేశంతోనే సీఎం కేజ్రీవాల్ పేరును జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆప్ మండిపడింది. మెలానియా ట్రంప్ కార్యక్రమానికి తమ సీఎంను ఆహ్వానించనప్పటికీ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కేజ్రీవాల్ గురించి చెబుతాయని ఆప్ నేత ప్రీతిశర్మ మీనన్ ట్వీట్ చేశారు.
కాగా కేజ్రీవాల్‌ను అవమానించడం అంటే భారత్‌ను అవమానించడమే అని పలువురు నెటిజన్లు, ప్రజాసంఘాల నేతలు, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విలువలు, దేశ భక్తి అని గొప్పలు చెప్పుకునే మోడీ సర్కార్…కేజ్రీవాల్ విషయంలో అనుసరిస్తున్న వైఖరికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.