హీరో బాలాదిత్య తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినితో అనుబంధంపై మనసులో మాట చెప్పాడు. వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నట్టు వచ్చిన వార్తల్లోని నిజానిజాల గురించి చెప్పుకొచ్చాడు.
బాలాదిత్య బాల నటుడిగా టాలీవుడ్‌కి సుపరిచితుడు. లిటిల్ సోల్జర్స్, జంబలకిడి పంబ, హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన ఘనత బాలాదిత్యది.
చంటిగాడు సినిమాతో హీరోగా అవతరించాడు. ఇటీవల బాలాదిత్య నటించిన అన్నపూర్ణమ్మగారి మనవడు సినిమా విడుదలైంది. బాలాదిత్య వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సరసన నటించిన హీరోయిన్ సుహాసినితో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
సుహాసిని, తాను మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ఆమెతో తన పెళ్లి వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాడు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో ప్రయాణించేవాళ్లమన్నాడు. అది చూసి కొందరు తప్పుగా ఊహించుకున్నారని అతను తెలిపాడు.
తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. తామిద్దరూ రెండు సినిమాల్లో కలిసి నటించే సరికి పెళ్లి చేసుకుంటున్నామంటూ వార్తలు రాసేశారన్నాడు. కానీ తమకు అలాంటి అభిప్రాయమే లేదని అతను తేల్చి చెప్పాడు.