నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేసేందుకు ఏపీ అధికార పార్టీ వైసీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. తమ పార్టీ టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, కావున రఘురామకృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసీపీ ఇప్పటికే అనేకమార్లు స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఇదే కారణంతో నేడు మరోసారి వైసీపీ చీఫ్‌విప్ మార్గాని భరత్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం విశేషం. ఈ సందర్భంగా మార్గాని భరత్ మీడియా మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంపై గతంలోనే ఆధారాలతో సహా లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాల్సిందిగా ఈరోజు మరోసారి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశామని భరత్ తెలిపారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రఘురామకృష్ణంరాజు ఓ పథకం ప్రకారం సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రోజురోజుకూ ఆయన విమర్శలు కాస్త తిట్ల పురాణానికి దిగాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై అవాంఛనీయ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయడం, అనంతరం అరెస్ట్‌కు దారి తీసిన పరిస్థితులన్నీ తెలిసినవే.
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఢిల్లీ వేదికగా కేంద్ర పెద్దలకు ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంపై దేశంలోని ముఖ్యమంత్రులందరికీ లేఖలు రాశారు.
రాజద్రోహం చట్టంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రులందరినీ ఆయన కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పట్టువదలని విక్రమార్కుడిలా వైసీపీ ప్రభుత్వం తనపై వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం.