మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పీడ్ పెంచారు. ఈ రోజు విందు రాజకీయానికి తెర లేపారు. ఈటల రాజేందర్‌పై ఫిర్యాదు మొదలుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించడం, ఆ తర్వాత కేబినెట్ నుంచి బర్తరఫ్ తదితర పరిణామాలు శరవేగంగా జరిగాయి.
తన విషయంలో కేసీఆర్ ఇలా వ్యవహరిస్తారని ఈటల కలలో కూడా ఊహించి ఉండరు. జీవితమైనా, రాజకీయమైనా వేర్వేరు కాదు. ఊహించనవి చోటు చేసుకోవడమే రాజకీయ లక్షణం.
రాజకీయ సంక్షోభంలో పడిన ఈటల భవిష్యత్ పంథాపై ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులతో చర్చోపచర్చలు జరిపారు. అనేక తర్జనభర్జనల అనంతరం ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 14న బీజేపీ కండువా కప్పుకోవాలని ఈటల డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈటల విందు రాజకీయానికి తెరలేపారు. శామీర్‌పేటలోని నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం విందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ , లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందనరావు, రాజాసింగ్, ఎంపీ సోయం బాపురావు, రామ చంద్రరావు, ఎ.చంద్రశేఖర్, వివేక్ తదితరులు వెళ్లారు.
ఈ సందర్భంగా ఈటల రాజీనామా అనంతరం జరిగే ఉప ఎన్నిక, బీజేపీ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై కూడా చర్చించినట్టు సమాచారం.
ఎలాగైనా గెలిచి తీరాలని బీజేపీ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే బీజేపీలో ఈటలకు ఇవ్వనున్న ప్రాధాన్యం గురించి చర్చించినట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా తన గన్‌మెన్ కరోనా బారిన పడడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఈ కారణంగా ఆయన ఈటల విందుకు హాజరు కాలేదు.