ప్రజలకు సమస్యలేవీ లేకపోవడంతో ఇన్నాళ్లూ మందుబాబుల సమస్యలపై పోరాటం చేశారు ప్రతిపక్షనేత చంద్రబాబు. అమ్మఒడి-నాన్న బుడ్డి అంటూ లేనిపోని పొంతనలు పెట్టి వెటకారమాడారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్యం అమ్మకాలతో వచ్చిన డబ్బుని ఉపయోగించుకుంటున్నారని అన్నారు.
బ్రాండ్లు తగ్గాయని, రేట్లు పెరిగాయని నిస్సిగ్గుగా అసెంబ్లీలోనే చర్చ పెట్టారు. వరద బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు కూడా మద్యం రేట్లు, బ్రాండ్లతో బురద రాజకీయం చేయాలని చూశారు. ఇప్పుడు బాబుకి ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. మద్యం రేట్లు తగ్గించేస్తున్నారు. అన్నిరకాల బ్రాండ్లు అందుబాటులోకి తెస్తున్నారు.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఏపీలో మద్యం వినియోగం 37 శాతం తగ్గింది. అదే సమయంలో మద్యం రేట్లు పెరగడం వల్ల ఆదాయం కూడా ప్రభుత్వానికి పెరిగింది. కానీ ఏపీలో రేట్లు ఎక్కువగా ఉండటంతో పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమంగా ఏపీలో అమ్ముతున్నారు. నాటు సారా తయారీ కూడా పెరిగింది. దీంతో ప్రభుత్వం వీటికి చెక్ పెట్టేందుకు కొత్త నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యంపై వ్యాట్, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తోంది. దీని ద్వారా 20శాతం మేర రేట్లు తగ్గుతాయి. ఒకరకంగా మందుబాబులకు ఇది గుడ్ న్యూసే.
ఇకపై అన్ని బ్రాండ్లూ..
స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, ప్రెసిడెంట్ మెడల్ వంటి కామెడీ బ్రాండ్లే కాకుండా.. గతంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రీమియం బ్రాండ్లు ఏపీలోని వైన్ షాపుల్లో ఇకపై కనిపిస్తాయి.
మద్యం అమ్మకాలు తగ్గించి మద్యపాన నిషేధం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని పొందాలని ప్రభుత్వం భావించింది. అయితే కల్తీ మద్యం, పొరుగు రాష్ట్రాల మద్యం వల్ల సత్ఫలితాలు రాకపోవడంతో పంథా మార్చింది. మద్యం రేట్లు తగ్గిస్తోంది.
నాన్న బుడ్డి డైలాగ్ పోయినట్టేనా..?
అమ్మఒడికి, నాన్న బుడ్డికి లింక్ పెట్టేవారు చంద్రబాబు. కేవలం మద్యం వల్ల వచ్చే ఆదాయంతోనే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నట్టు బిల్డప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మద్యం రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక చంద్రబాబుకి ఆ పాయింట్ కూడా మిస్ అయినట్టే లెక్క.
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సమయంలో కూడా మద్యం రేట్లను తగ్గించడం సాహసోపేత నిర్ణయమే, చంద్రబాబు లాంటి వారు ఊహించని పరిణామమే. అయితే ఈ చర్యతో మద్యపాన నిషేధం సాధ్యమా అనేది ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.