కేవలం తమ రాష్ట్ర ప్రజలకే కాకుండా రాష్ట్రేతరులకు కూడా పథకాన్ని అమలు చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. ఈ పథకం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఆరోగ్యానికి సంబంధించిన స్కీమ్ కావడంతో …ఇలాంటిది మన రాష్ట్రంలో కూడా ఉంటుందనే ఆలోచన కలుగుతోంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించేందుకు ‘నమ్మై కాక్కుం 48’ (48 గంటల్లో ప్రాణాలు కాపాడుదాం) పథకాన్ని తమిళనాడులో ప్రవేశ పెట్టారు. ఈ పథకాన్ని సీఎం స్టాలిన్ శనివారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి తక్షణం సాయం అందించడమే కీలకం.
ఎందుకంటే వెంటనే వైద్యం అందిస్తే ప్రాణాలు నిలుస్తాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం క్షతగాత్రులకు ప్రమాదానికి గురైన వెంటనే 48 గంటల పాటు అందించే చికిత్సకు ఉచిత వైద్యం అందించేందుకు నిర్ణయించింది.
ఈ పథకం కింద కేవలం తమిళనాడు వాసులకే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా అర్హులేనని సీఎం స్టాలిన్ చెప్పారు. దీంతో తమిళనాడులో ప్రమాదానికి గురైన వారు వెంటనే ఆస్పత్రిలో చేరి ఆ రాష్ట్ర ప్రభుత్వం పథకం కింద ఉచితంగా 48 గంటల పాటు ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉంది.