పవన్ కల్యాణ్ బాటలో ఎన్టీఆర్.. ఏం జరుగుతోంది..!

సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ వేరు. ఎవరి పంథాలో వారు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. ఈ ఇద్దరికీ మరో విషయంలో కూడా పోలిక ఉంది. తాత స్థాపించిన తెలుగుదేశం…

సినిమాల్లో పవన్ కల్యాణ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ వేరు. ఎవరి పంథాలో వారు ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగారు. ఈ ఇద్దరికీ మరో విషయంలో కూడా పోలిక ఉంది. తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ రాష్ట్రమంతా పర్యటించారు, కష్టపడ్డారు కానీ ఫలితం రాలేదు. 

అన్నయ్య చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కల్యాణ్ కూడా రాష్ట్రమంతా పర్యటన చేసొచ్చారు కానీ ఫలితం లేదు. ఇప్పుడు సొంతగా పార్టీ పెట్టి కష్టపడుతున్నారు కానీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. అన్న పెట్టిన పార్టీ ముద్ర నుంచి బయటపడి పవన్ కల్యాణ్ సొంతగా తన ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ పార్టీ పెట్టే ముందు జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా రిపీట్ అవడం యాదృచ్ఛికమే కాదు, విశేషం కూడా.

పార్టీ పెట్టడానికి ముందు పవన్ వ్యవహారశైలిని ఓసారి గుర్తుచేసుకుందాం. అభిమానులతో సమావేశాలంటూ రోజుకో జిల్లా వారితో సెట్స్ లోనే సమావేశమయ్యేవారు పవన్. ఆ సినిమా సెట్స్ లోనే వాళ్లకు భోజనాలు, వాళ్లతో కలిసి ఫొటోలు దిగడాలు, స్థానికంగా చేయాల్సిన పనులపై ఉపదేశాలు జరిగేవి. 

ఇలా పవన్ కల్యాణ్ సినిమా సెట్స్ నిత్యం అభిమానులతో కోలాహలంగా ఉండేవి. ఆ తర్వాత కొన్నాళ్లకు జనసేన పార్టీని ప్రకటించారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా అవే సీన్లు రిపీట్ అవుతున్నాయి. 

అభిమాన వర్గాల పేరిట రకరకాల వ్యక్తుల్ని కలుస్తున్నాడు తారక్. అందరితో మాట్లాడుతున్నాడు. వాళ్లతో ఫొటోలు దిగుతున్నాడు. కొంతమందికి సాయం చేస్తున్నాడు. మరికొంతమందికి మళ్లీ అపాయింట్ మెంట్ ఇస్తున్నాడు. గతంలో తారక్ ఇంత సందడి ఎప్పుడూ చేయలేదు. మరి ఇప్పుడే ఎందుకు?

ఎన్టీఆర్ మనసులో ఏముంది? పవన్ కల్యాణ్ లాగా ఎన్టీఆర్ కూడా సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడా? లేక టీడీపీ బలోపేతం కోసం తెరవెనక ప్రయత్నిస్తున్నాడా? లేక వచ్చే ఎన్నికల నాటికి తనకంటూ ఓ వర్గాన్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నాడా? వీటిలో ఏదో ఒకటి మాత్రం చేస్తున్నట్టు స్పష్టవుతున్నా అదేంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మిగిలింది.  

అప్పుడు పవన్ కల్యాణ్ అయినా, ఇప్పుడు ఎన్టీఆర్ అయినా.. ఇద్దరూ అభిమానులకు ఆరాధ్య దైవాలే. సినిమాల విషయంలో, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఇద్దరూ ఇద్దరే. కానీ ఆ అభిమాన గణాన్ని రాజకీయాల్లో కూడా తమవెనకే రప్పించుకోవడంలో పవన్ కల్యాణ్ విఫలం అయ్యారు. సీఎం సీఎం అనేవారే కానీ, కనీసం పోటీ చేసిన రెండు సీట్లలో ఒక్క చోట కూడా ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయారు పవన్ అభిమానులు.

ఎన్టీఆర్ కూడా ఆ అభిమానాన్ని రాజకీయకీయ కోణంలో విజయవంతంగా మార్చుకుంటేనే ఫలితం ఉంటుంది. టీడీపీలో ఉన్నా, వేరు కుంపటి పెట్టుకున్నా అప్పుడే రాజకీయాల్లో తారక్ రాణించగలరు. సొంత పార్టీతో ఎన్టీఆర్ జనంలోకి రావాలనుకుంటే మాత్రం పవన్ అనుభవాలన్నీ జూనియర్ కి పాఠాలే.