“నమ్మిన విశ్వాసం నట్టేట ముంచింది. అన్నం పెట్టిన చెయ్యినే నరికింది. అయినవారే పరాయివారిగా మారి గుండె లోతుల్లో గునపాలు గుచ్చితే తట్టుకోలేని రోషం, అభిమానం, ఆ మంట్లో ఆహుతి అయ్యింది. తట్టుకోలేని ఆ అవమానం ఆ గుండెను ఆపేసింది. 1996, జనవరి 18న తెల్లారుజామున ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తన అధికారం కోసం మామ చావుకు కారకుడైన ఆ వ్యక్తి మీద ఆయన ఆత్మ ప్రతీకారంతో రగులుతూనే ఉంది” …మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మామ ఎన్టీఆర్ ఆత్మ ప్రతీకారంతో తిరుగుతూ ఉంటుందని ఆయన భార్య లక్ష్మీపార్వతి అశ్రునయనాలతో రాసిన మాటలివి.
నేటికి ఎన్టీఆర్ చనిపోయి 24 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా లక్ష్మిపార్వతి ఎన్టీఆర్ భార్యగా, ఆయన మరణానికి దారి తీసిన పరిస్థితులను కళ్లకు కట్టేలా సాక్షి సంపాదకీయ పేజీలో చక్కటి వ్యాసం రాశారు. ఆమె రాసిన ప్రతి అక్షరం, పదం, వాక్యం చంద్రబాబు చేసిన దుర్మార్గాలను , కుట్రలను బహిర్గతం చేశాయి.
“అవమానంతో కుంగిపోయిన ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటూ అల్లుడని గౌరవించినందుకు నాకింత ద్రోహం చేశాడు. దేశమంతా గౌరవించిన వ్యక్తిని చెప్పులతో అవమానించాడు. ఇదంతా వాడికి పట్టిన అధికార దాహం- తెలుగు పౌరుషాన్ని చాటిన మీ అన్న దుస్థితి చూడండి. ఎన్టీఆర్ ఎప్పుడో చావడం కాదు. చంద్రబాబు దుర్మార్గానికి ఇప్పుడే మరణించాడు” అని విలపించడంతో అక్కడికి వచ్చిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారనే వాక్యాలను చదివితే ఎన్టీఆర్ చావుకు కారకులైన హంతకులెవరో ఈ తరం వారికి తెలుస్తుంది. అంతే కాదు మానసికంగా తాను మరణించానని ఎన్టీఆర్ ప్రకటించడం కంటే విషాదం ఏమి ఉంటుంది?
“ఈ రోజు జగన్ మీదు, ఆయన ప్రభుత్వం మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో ఆ రోజూ అలాగే జరిగింది. అందుకే ఎన్టీఆర్ ఈనాడు పత్రికను చెత్తబుట్టగా వర్ణించారు. 1994 ఎన్నికల్లో వాళ్ల అంచనాలకు మించి ఎన్టీఆర్‌కు 222 సీట్లు, మిత్ర పక్షాలకు 36 సీట్లు రావడంతో అయోమయంలో పడ్డ గురుశిష్యులిద్దరూ ప్లాన్-2కు పన్నాగం పన్నారు. దానిలో భాగంగానే ఎన్టీఆర్ మీద, ఎన్టీఆర్ భార్య మీద విమర్శల దాడి మొదలైంది. ఆమెనొక రాజ్యాంగేతర శక్తిగా , ఎన్టీఆర్ భార్యా లోలుడిగా , అసమర్థుడిగా ఈనాడు పేపర్లో రాయించి , అసహ్యమైన కార్టూన్లు వేయించి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు”
పైన పేర్కొన్న వాక్యాలు చదువుతుంటే భయం వేస్తుంది. అధికారం కోసం తన, మన అనే భేదభావం లేకుండా చంద్రబాబు ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడుతాడనే లక్ష్మీపార్వతి హెచ్చరికలు చాలా విలువైనవి. అలాగే అతనికి వంత పాడే ఈనాడు జర్నలిజం ముసుగులో చేస్తున్న దాష్టీకాలకు అంతమెన్నడు అనే ప్రశ్న కూడా వెంటాడుతుంది.
“1994 పరిస్థితి పునరావృతమవుతున్నది. అదే సామాజికవర్గం, అదే పెత్తందారీ వ్యవస్థ. అదే మీడియా. అదే గురుశిష్యులు. సామాజిక అభివృద్ధితో వీళ్లకు పనిలేదు. పేద వర్గాలంటే జాలి లేదు. మంచిపనులు చేసే నాయకులంటే అసలు పడదు. విస్తరించుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అల్లర్లయినా సృష్టిస్తారు. ఎన్ని హత్యలయినా చేస్తారు. వీళ్లను ఈ మీడియా కాపాడుతూనే ఉంటుంది. చెప్పాలంటే అష్టగ్రహ కూటమి అనే పదం సరిపోతుంది”
తన అనుభవాన్నంతా రంగరించిన రాసిన ఈ వాక్యాలు ప్రస్తుతం రాజధాని విషయంలో చంద్రబాబు అండ్ కో, ఆ వర్గం మీడియా సృష్టిస్తున్న గందరగోళాన్ని, కృత్రిమ ఉద్యమ స్వరూపం గురించి చెప్పకనే చెబుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే ఆందోళనలకు రైతు ఉద్యమంగా కలరింగ్ ఇవ్వడాన్ని లక్ష్మిపార్వతి వైపు నుంచి ఆలోచిస్తే సరైన అవగాహన ఏర్పడుతుంది.
“ఎన్టీఆర్ చివరి దశను అత్యంత అవమానంగా , పెను విషాదంగా మార్చి ఒక రకంగా హత్యకు సమాన స్థితిని కల్పించిన ఈ ఘట్టాన్ని తెలుగు వాళ్లు ఎప్పటికీ మర్చిపోకూడదనే గుర్తు చేయడానికి వ్యాసం “ అని లక్ష్మీపార్వతి రాశారు. కానీ ఎన్టీఆర్ మరణించినా , ఆయన చావుకు కారకులైన వారు ఇంకా సజీవంగా ఉన్నారు. లక్ష్మిపార్వతి ప్రస్తావించిన అష్టగ్రహ కూటమి ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై పట్టు నిలుపుకునేందుకు, కులం, మతం, ప్రాంతం పేర్లతో ఒక్కో దశలో ఏపీలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి.