ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. మెల్లగా మాటలు కలిపాడు. ప్రేమించానంటూ కమ్మగా నమ్మించాడు. పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే, ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను రాజస్థాన్ తీసుకెళ్లి అమ్మేశాడు. కట్ చేస్తే, అతడి వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే.
ఒరిస్సాలోని బెలపాడా ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల రాజేష్ రాణా, ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ప్రేమిస్తున్నానంటూ నమ్మాడు. అబ్బాయికి 17, అమ్మాయికి 26 ఏళ్లు. దీంతో పెద్దలు ఒప్పుకోలేదు. అయినప్పటికీ రాజేష్ రాణా అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లయిన 2 నెలలకే ఉపాధి కోసం భార్యతో కలిసి రాజస్థాన్ వెళ్లాడు రాజేష్. అక్కడే ఓ 55 ఏళ్ల వ్యక్తితో బేరం మాట్లాడుకున్నాడు. తన భార్యను లక్షా 80వేల రూపాయలకు ఆ 55 ఏళ్ల వ్యక్తికి అమ్మేశాడు. డబ్బు తీసుకొని, భార్యను వదిలేసి తిరిగి స్వస్థలానికి వచ్చేశాడు.
తమ కూతురు ఏమైందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే, తనను వదిలేసి మరో వ్యక్తితో వెళ్లిపోయిందని అబద్ధం ఆడాడు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, రాజేష్ నుంచి నిజాలు కక్కించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న బారన్ అనే జిల్లాలోని ఓ ప్రాంతంలో తన భార్యను అమ్మేసినట్టు రాజేష్ అంగీకరించాడు.
రాజేష్ ఇచ్చిన సమాచారంతో అమ్మాయిని విడిపించారు పోలీసులు. ఈ క్రమంలో స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కేవలం సెల్ ఫోన్ కోసమే తన భార్యను అమ్మేశానని రాజేష్ చెప్పడం. అవును.. ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం కోసం భార్యను అమ్మేశాడు ఈ దుర్మార్గుడు. వచ్చిన డబ్బుతో స్టార్ హోటల్ లో దిగాడు. 2 రోజులు ఎంజాయ్ చేశాడు. మిగిలిన డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. ప్రస్తుతం ఆ స్మార్ట్ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. రాజేష్ ఊచలు లెక్కబెడుతున్నాడు.