అధికారుల అత్యుత్సాహం.. సర్కార్ పై మరో విమర్శ

అన్నీతెలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారో లేక, అక్రమాల ప్రక్షాళన కోసం అత్యుత్సాహ పడుతున్నారో కానీ.. ముఖ్యమంత్రి జగన్ పై నిందలు వేయించడానికి సిద్ధంగా ఉంటున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికారులు తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు…

అన్నీతెలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారో లేక, అక్రమాల ప్రక్షాళన కోసం అత్యుత్సాహ పడుతున్నారో కానీ.. ముఖ్యమంత్రి జగన్ పై నిందలు వేయించడానికి సిద్ధంగా ఉంటున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికారులు తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. సదుద్దేశంతో సీఎం జగన్ ఆశావర్కర్ల జీతాలు పెంచారు. దీంతో వారి వార్షిక ఆదాయం పెరిగింది. అయితే అంతలోనే వార్షిక ఆదాయ పరిమితిని చూపిస్తూ రేషన్ కార్డులు కట్ చేశారు అధికారులు. వారితోపాటు పనిలో పనిగా, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ లు, మరి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డులు కూడా ఉన్నట్టుండి ఊడిపోయాయి.

దీంతో ఆయావర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. పరిమితికి మించి ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డులు ఉండకూడదు సరే. ఆశా వర్కర్లు, గ్రామ తలారులు.. ఇలాంటి చిరుద్యోగులకు అదే పెద్ద ఆసరా. అలాంటి వారికి కూడా రేషన్ కార్డులు తీసేయడం దారుణం అనేవాదన మొదలైంది. ఇప్పటివరకూ చాలా గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలకు ఒకటే కార్డు ఉంటోంది. వాటి విభజన సరిగా జరగలేదు. అలాంటి టైమ్ లో ఇంట్లో ఒక చిరుద్యోగి ఉంటే.. ఇంటి మొత్తానికీ రేషన్ కార్డు కట్ చేసి పారేశారు.

దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో కొన్నిచోట్ల అధికారులు తప్పు సరిదిద్దుకున్నారు. అయితే ఇంతలోనే జగన్ సర్కారుపై నిందలు మాత్రం పడ్డాయి. క్షేత్రస్థాయిలో జరిగే ఇలాంటి తప్పొప్పులన్నిటికీ జగన్ ని టార్గెట్ చేస్తూ నిందిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ చేత్తో జీతం పెంచి, ఆ చేత్తో రేషన్ కట్ చేశారని దెప్పిపొడుస్తున్నాయి. నిజానికి ఇది చాలా సున్నితమైన అంశం. రేషన్ కార్డు ఒకసారి కట్ అయితే, దాన్ని తిరిగి తెచ్చుకోవడం మామూలు విషయం కాదు. ఇలాంటి అంశాల్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది.

ఇలాచేస్తే ప్రభుత్వానికి ఎంత వరకు లాభం అనే విషయం గమనించాల్సి ఉంది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోడానికి ముందు ఓసారి ప్రభుత్వానికో, సంబంధిత మంత్రికో ప్రతిపాదనలు పంపితే బాగుండేది. కానీ అధికారులు అలాంటి పనులేం చేయలేదు. రూల్స్ ప్రకారం మాత్రమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. ఇలాంటి సున్నితమైన అంశాల్లో అవసరమైతే రూల్స్ ను కూడా మార్చాల్సిందే.