కరోనాపై పోరులో భాగంగా రోగులకు మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని పేరు 2డీజీ. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ మెడిసిన్ ను కేంద్రం ఈరోజు రిలీజ్ చేసింది. తొలి విడతగా 10 వేల సాచెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కరోనా వైరస్ ను తగ్గించేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని చెబుతున్నారు డీఆర్డీవో శాస్త్రవేత్తలు. ఈ మెడిసిన్ వాడడం వల్ల కరోనా రికవరీ టైమ్ గణనీయంగా తగ్గడంతో పాటు, ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అయితే ఇది కూడా అత్యవసరం నిమిత్తం, క్రిటికల్ కండిషన్ కి చేరినప్పుడు మాత్రమే వాడాలని చెబుతున్నారు.
తొలి విడతలో కేవలం 10వేల సాచెట్లను మాత్రమే రిలీజ్ చేసిన సంస్థ.. మరో 10 రోజుల్లో మరిన్ని సాచెట్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. జూన్ నాటికి పూర్తిస్థాయిలో ఈ మందు అందుబాటులోకి రాబోతోంది.
మొదట ఈ మందును క్యాన్సర్ కోసం తయారుచేశారు. శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా చేస్తుంది ఈ మందు. ఇదే ఫార్ములాను కరోనాకు కూడా వర్తింపజేసి, 2డీజీని తయారుచేశారు. శరీరంలోకి చేరిన కరోనా వైరస్.. మరింత గ్లూకోజ్ ను వాడుకోకుండా ఈ మందు నివారిస్తుంది. ఈలోగా తెల్ల రక్తకణాలు వైరస్ ను చంపేస్తాయి.
ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, రికవరీ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. అటు రెమిడిజివర్ ఇంజెక్షన్ కు ప్రత్యామ్నాయంగా కూడా మారే అవకాశం ఉంది.