ఆంధ్రప్రదేశ్ లో పెరిగిపోతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న కర్ఫ్యూను ఎత్తేసి, ఆ స్థానంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ను తీసుకొస్తారని అంతా అనుకున్నారు.
మరోవైపు కేంద్రం కూడా పాజిటివిటీ రేటు 20శాతం దాటింది కాబట్టి లాక్ డౌన్ ఒక్కటే మార్గమంటూ చెప్పేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే జగన్ సర్కార్ మాత్రం లాక్ డౌన్ కు నో చెప్పింది.
రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూనే కొనసాగించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. మరో 2 రోజుల్లో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ కనీసం 4 వారాల పాటు ఉంటేనే సరైన ఫలితాలొస్తాయన్న ముఖ్యమంత్రి.. గ్రామీణ ప్రాంతాల్లో కేసులు మరింత పెరగకుండా వాలంటీర్లు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతోంది. ఇదే విధానాన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని జగన్ ఆదేశించారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.. అలాంటి వాళ్లకు ఆర్థిక సహాయం అందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలౌతున్న కర్ఫ్యూ వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరోసారి కర్ఫ్యూ వైపే మొగ్గుచూపడం, కనీసం 4 వారాలైనా ఉంటేనే ఫలితాలొస్తాయని చెప్పడం గమనార్హం.
అయితే ఓవైపు కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ.. మరోవైపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో, మండల స్థాయిలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఎక్కడికక్కడ కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. కర్ఫ్యూకు తోడు ఈ లాక్ డౌన్ కూడా కలిసి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.