రమేష్ అనే పేరు టీడీపీకి బాగా కలిసి వచ్చినట్టుంది. అందుకే రమేష్ అనే పేరు వింటే టీడీపీ నేతలు పులకించిపోతారు. ఆ పేరు వింటే తమకు తిరుగులేని విధంగా న్యాయం జరిగిపోతుందనే ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. గత ఏడాది, ప్రస్తుతం టీడీపీ కలవరిస్తున్న, పలవరిస్తున్న పేరు ఏదైనా ఉందా? అంటే, అది రమేష్ మాత్రమే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు కేసు విషయంలో మరోసారి తెరపైకి వచ్చిన రమేష్ ఆస్పత్రి.
ఇద్దరూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఇద్దరి పేర్లు రమేష్ కావడం యాదృచ్ఛికమే. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వ్యవహరించిన తీరు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలుసు. చివరికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించకుండానే పదవీ విరమణ చేశారాయన. ఎన్నికలకు వెళితే కరోనా విజృంభిస్తుందని ప్రభుత్వం నెత్తీ నోరూ కొట్టుకుని చెబితే …వినిపించుకోకుండా, పంతం నెగ్గించుకోడానికే ప్రయత్నించారు.
ఇందులో కొంత వరకూ సక్సెస్ సాధించారు. అంతిమంగా కోవిడ్ విస్తరించడానికి మార్గం సుగుమం చేసి, తాను మాత్రం సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన కూడా ఎక్కడా కనిపించడం లేదు.
టీకా ప్రక్రియను అడ్డుకుని, ఎన్నికలే ముఖ్యమని ముందుకెళ్లి, జనాన్ని మాత్రం ప్రమాదంలో నెట్టేసిన ఖ్యాతిని నిమ్మగడ్డ దక్కించుకున్నారు. చంద్రబాబుకు ఏదో ప్రయోజనం కలిగించాలని పంచాయతీ, పురపాలక ఎన్నికలు నిర్వహించారు. అయితే ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమిని పొంది పరువు పోగొట్టుకుంది. తానొకటి తలస్తే, దైవం మరొకటి చేసిందనేందుకు నిమ్మగడ్డ ఉదంతమే నిదర్శనం.
ప్రస్తుతానికి వస్తే రమేష్ ఆస్పత్రి. ఈ ఆస్పత్రి అధినేత డాక్టర్ రమేష్ బాబు. గత ఏడాది ఇదే రమేష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది సజీవ దహనం అయ్యారు. ఈ కేసులో ఆస్పత్రి అధినేత డాక్టర్ రమేష్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. అలాంటి ఆస్పత్రిలో రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే న్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు.
మరోవైపు రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలంటే … టీడీపీ ఆఫీస్‌లో చేసినట్టే అని సీఐడీ తరపు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తేల్చి చెప్పారు. అవినీతి కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఆరోగ్యం బాగా లేకపోతే …రమేష్ ఆస్పత్రే కావాలి. ఎక్కడా లేని విధంగా మొలల ఆపరేషన్‌కు సంబంధించి నెలకు పైగా ట్రీట్‌మెంట్ ఇచ్చిన ఘనతను సదరు టీడీపీ ప్రేమించే రమేష్ ఆస్పత్రి దక్కించుకుంది.
అందుకే ఆ ఆస్పత్రి అంటే టీడీపీ నేతలకు వల్లమాలిన ప్రేమ. ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకు ఒక్క రమేష్ ఆస్పత్రిలో తప్ప, మరెక్కడ వైద్య పరీక్షలు చేసినా న్యాయం జరగదని టీడీపీ భావించడాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి రమేష్ అనే పేరుతో టీడీపీది జన్మజన్మల బంధంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.