తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్థారించారు. ఇటీవలే బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇతడు. వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
తెలంగాణలో పెరుగుతున్న అనుమానిత కేసుల్ని దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా కరోనా నిర్థారణ యూనిట్ ను నెలకొల్పారు. ఇప్పటివరకు శాంపిల్స్ ను పూణెకు పంపించి ఫలితాల కోసం వేచిచూసేవారు. ఇకపై కరోనా తుది పరీక్షల్ని కూడా హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లోనే నిర్వహించి, ఇక్కడ రిజల్ట్ ప్రకటిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు అధికారులు తెలిపారు.
ఇక దేశవ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151కి చేరినట్టు (మృతి చెందిన వారితో కలిపి) అధికారులు ప్రకటించారు. అంతేకాదు.. ఇండియన్ ఆర్మీలోకి కూడా ఇది ప్రవేశించింది. లడక్ స్కౌట్ రెజిమెంట్ కు చెందిన 34 ఏళ్ల సైనికుడికి కరోనా వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల్ని వేగవంతం చేశారు. రేపట్నుంచి అన్ని విద్యాసంస్థలకు శెలవులు ప్రకటించారు. ఏపీలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు.. ఇలా అన్నీ మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించింది. ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల్ని సురక్షితంగా ఇంటికి పంపేందుకు ఆర్టీసీతో సంప్రదింపులు జరుపుతున్నారు విద్యాశాఖమంత్రి.
అటు ప్రపంచవ్యాప్తంగా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. తాజాగా మృతుల సంఖ్య 8వేలకు చేరింది. పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 92 వేలకు చేరుకుంది. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్ లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. స్పెయిన్ లో ఒక్క రోజులోనే 2వేల కొత్త కేసులు నమోదయ్యాయి.