మరో స్టే.. ఇబ్బంది ప్రభుత్వానికా..? ప్రజలకా..?

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం అమలులోకి రాకుండా ఏపీ హైకోర్టు స్టే విధించింది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలా స్టే ఆర్డర్లు వచ్చాయి, కానీ ఈ సారి వచ్చిన ఆర్డర్ మాత్రం…

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం అమలులోకి రాకుండా ఏపీ హైకోర్టు స్టే విధించింది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలా స్టే ఆర్డర్లు వచ్చాయి, కానీ ఈ సారి వచ్చిన ఆర్డర్ మాత్రం ప్రభుత్వంతో పాటు, ప్రజల్ని కూడా నిరాశలో నెట్టేసేలా ఉంది. ఈ స్టే ఆర్డర్ తో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం సంబరపడుతున్నాయి.

అసలేం జరిగిందంటే..? ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓ కమిషన్ నియమించింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో “చైనా” బ్యాచ్ అందినకాడికి తల్లిదండ్రుల్ని పీల్చి పిప్పిచేసింది. ఇతర ప్రైవేట్ స్కూల్స్ విద్యావ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగింది. వైసీపీ రాకతో ఈ వ్యాపారానికి బ్రేక్ పడుతుందని ఆశించారాంతా.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ని ఏర్పాటు చేసింది. చైర్మన్ రెడ్డి కాంతారావు నేతృత్వంలో పలు దఫాలు సమావేశాలు కూడా జరిగాయి. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలను సందర్శించి, అక్కడ ఉన్న వసతులు, విద్యా నాణ్యత ఆధారంగానే ఫీజులు నిర్ణయించాలని భావించింది.

ఇకపై ఫీజులు, ఇతర రుసుముల లెక్కలన్నీ కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిందేనని ప్రభుత్వం కూడా జీవోలో స్పష్టం చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో ఉపాధ్యాయుల నియామకాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలని చెప్పింది. 

ప్రభుత్వ సిలబస్ ని కచ్చితంగా పాటించాలని, ఏ స్కూల్ కి ఆ స్కూల్ తమకి నచ్చిన సిలబస్ చెప్పుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలన్నీ అమలులోకి వచ్చే సమయంలో హైకోర్టు స్టే ఆర్డర్ తో బ్రేక్ పడింది.

కమిషన్ పేరుతో ప్రభుత్వం తమపై ఆధిపత్యం చలాయించడం కుదరదని, తమ ఫీజులు తామే నిర్ణయించుకుంటామని, ఫీజులు తగ్గిస్తే.. విద్యా ప్రమాణాలు పడిపోతాయని కుంటి సాకులు చెబుతూ కోర్టుని ఆశ్రయించాయి ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు.. ఫీజుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యకలాపాలపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి.

ఇప్పటి వరకూ హైకోర్ట్ ఇచ్చిన స్టే ఆర్డర్లతో ప్రభుత్వం ఇబ్బంది పడింది అనుకున్నా.. ఈ దఫా ఇచ్చిన స్టేతో… ప్రైవేట్ స్కూళ్లకు పిల్లల్ని పంపిస్తున్న తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశముంది. కమిషన్ కార్యకలాపాలు అమలులోకి వస్తే.. కచ్చితంగా ఫీజుల భారం తగ్గే అవకాశముంది. కానీ హైకోర్టు స్టే తో కమిషన్ కార్యకలాపాలకు బ్రేక్ పడింది.

చంద్రంబావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఆర్కే ఆవేద‌న