కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని తమిళనాట అధికారంలోకి తీసుకురావడానికి తెగ కష్టపడ్డ నటీమని కుష్బూ ఇక భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే పని పెట్టుకుంటున్నారట. ఆమె భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా ఆధ్వర్యంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారట.
ఇలా మూడో పార్టీలో చేరబోతున్నారు కుష్బూ. ఈమె గతంలో డీఎంకేలో పని చేశారు. ఆ పార్టీలో అప్పట్లో నెలకొన్న అంతర్గత రాజకీయాలపై వ్యాఖ్యలు చేసి కరుణానిధి ఆగ్రహానికి గురయ్యారు. దీంతో డీఎంకేను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. డీఎంకే తోకగా వ్యవహరిస్తూనే ఉంది. త్వరలో జరిగితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మీద కాంగ్రెస్ ఆశలున్నాయి. డీఎంకేతో కలిసి పోటీ చేసి అధికార భాగస్వామి అయ్యే అవకాశాలున్నాయి కాంగ్రెస్ కు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడుతోంది కుష్బూ.
ఆమె ఇప్పటికే ఢిల్లీ లో చర్చలు షురూ చేశారు. గత కొన్నాళ్లుగా కుష్బూ భర్త సుందర్.సితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతూ వచ్చారు. ఇప్పుడు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. కుష్బూ కమలం పార్టీలోకి చేరబోతున్నారని తెలుస్తోంది.
మొత్తానికి డీఎంకే, కాంగ్రెస్ లలో చాలా కాలం పాటు పని చేసినా.. పెద్దగా రాజకీయంగా సాధించింది ఏమీ లేకపోయినా, ఇప్పుడు కుష్బూ కమలం పార్టీలోకి చేరుతున్నట్టుగా ఉంది!