అటు అమరావతి….ఇటు విశాఖ

అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే ఇదే. అమరావతి రాజధానిగా వుండాలి. విశాఖ మీద తమ వర్గం పట్టు అలాగే సాగాలి. Advertisement కానీ ఉంచుకున్నదీ పోయింది..ఉన్నదీ పోయింది అంటే కూడా ఇదే. జగన్ పుణ్యమా…

అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే ఇదే. అమరావతి రాజధానిగా వుండాలి. విశాఖ మీద తమ వర్గం పట్టు అలాగే సాగాలి.

కానీ ఉంచుకున్నదీ పోయింది..ఉన్నదీ పోయింది అంటే కూడా ఇదే.

జగన్ పుణ్యమా అని అమరావతి భవితవ్యం అయోమయంలో పడింది. విశాఖలో తమ హవాకు గండి పడుతోంది.  అమరావతి అయోమయం కాకుండా వుండి వుంటే విశాఖలో ఈ పరిస్థితి వచ్చి వుండేది కాదు. అసలు ఆయనే వుంటే…అన్న సామెత మాదిరిగా. అమరావతి అలాగే వుండి వుండాలంటే బాబుగారు అధికారంలో వుండాలి. ఆయనే అధికారంలో వుంటే విశాఖలో తమ హవా ఇలాగే సాగేది.

అసలు ఏమిటిదంతా? అంటే కాస్త వెనక్కు వెళ్లి చూడాలి. ఆపై ముందుకు వచ్చి జరుగుతున్నది గమనించాలి.  విశాఖ లేదా ఉత్తరాంధ్ర వాసులు నెమ్మదస్తులు. ఎవరు వచ్చినా ఏమీ అనేవారు కాదు. తమ దగ్గరకు ఎవరు వచ్చినా ఆదరిస్తారు.

వాళ్లు కోట్లు చేసుకుంటూ వుంటే బాధపడరు. వారి దగ్గరే పని చేస్తూ, తమ బతుకుబండి సాగిస్తారు. అందుకే అవిభక్త ఆంధ్రలో హైదరాబాద్ తరువాత ఏకైక కాస్మపాలిటన్ నగరంగా విశాఖ మాత్రమే అభివృద్ది చెందింది. ఈ తరహా కాస్మాపాలిటన్ లుక్ అన్నది విజయవాడకు లేదా గుంటూరుకు  ఎప్పటికీ రమ్మన్నారాదు. ఎందుకు రాదు అంటే రాదంతే.

నాలుగు దశాబ్దాల పట్టు

ఇలాంటి విశాఖపై ఓ సామాజిక వర్గం కన్ను నెమ్మదిగా 1980వ దశకం నుంచే పడుతూ వచ్చింది. ముందు వ్యాపార పరంగా, ఆపై రాజకీయపరంగా పూర్తి ఆధిపత్యం సాధించేసారు. అసలు ఇలా ఆధిపత్యం తీసుకోవడానికి వెనుక అసలు సిసలు కారణం వుంది. దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తాకు వచ్చిన వాలిన ఈ వర్గానికి కృష్ణ, గుంటూరు జిల్లాల్లో మరో వర్గంతో జన్మవైనం వుంది. చిరకాల శతృత్వం అలా సాగుతోంది.

ప్రతి సారీ ఆ వర్గంతో తలకాయనొప్పలు తప్పడం లేదు. అదే విశాఖలో అయితే ఎన్ని వర్గాలు వున్నా, అణిగి మణిగి వుంటారు తప్ప ఎదిరించరు. లోకల్ ఫీలింగ్ అన్నది రక్తంలోనే వుండదు. అలాంటి ఫీలింగ్ వుంటే ఇంత మంది బయటవాళ్లు ఎంపీలు గా, ఎమ్మెల్యేలుగా గెలవరు కదా? అందుకే తమకు అత్యంత అనుకూలమైన షెల్టర్ గా విశాఖను ఎంచుకున్నారు. ఎవరు అయినా తలెత్తితే అణగదొక్కారు. ఎంతటి ఆధిపత్యం అంటే స్థానికులు పొరపాటున వ్యాపారం పెడితే వాళ్లను అణగదొక్కేసేంత.  ఇది పచ్చినిజం దీనికి ఓ ఉదాహరణ చెప్పుకుందాం.

విశాఖలో ఓ బహుళ జాతి సాఫ్ట్ డ్రింక్ సంస్థ వుంది. ఇది ఆ వర్గం చేతిలో వుండేది.  అలాంటి టైమ్ లో ఒక కొత్త బ్రాండ్ వచ్చింది. లోకల్ వ్యాపార వర్గం దాని డీలర్ షిప్ తీసుకుంది. వాళ్లేమీ చిన్నవాళ్లు కాదు. విశాఖలో పుస్తకాల వ్యాపారంలో అద్భుతమైన పేరు సంపాదించిన వాళ్లు వారు.  వాళ్ల డ్రింక్ ను ఒక్క సినిమా థియేటర్లోకి ఎంటర్ కానివ్వలేదు. 

ఎందుకంటే థియేటర్ల ఓనర్లు లేదా మేనేజ్ మెంట్ లు అన్నీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.  అంతేకాదు, ఎక్కడన్నా కొత్త డ్రింక్ కేసులు కనిపిస్తే, ఖాళీవి తీసుకుని, నిండు కేసులు తమ బ్రాండ్ వి అందించారు. అలా సంపాదించిన ప్రత్యర్థి బ్రాండ్ ఖాళీ సీసాలు అన్నీ పగలగొట్టి సముద్రం పాలు చేసారు. లోకల్ వ్యాపార వర్గం తేరుకుని చూసే సరికి వాళ్ల గొడౌన్ లో ఒక్క ఖాళీ సీసా లేదు. సరుకు నింపాలంటే సీసాలు లేవు. కుదేలయిపోయారు. వ్యాపారం మూసేసారు. చాలా కాలం పాటు అందుకోసం నిర్మించిన ఫ్యాక్టరీ అలా ఖాళీగా వుండిపోయింది.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కొన్నాళ్లకు మరో బహుళ జాతి పానీయం మార్కెట్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు ఎవరు ధైర్యం చేస్తారు? ఎవరు తీసుకుంటారు? అప్పుడు రాష్ట్రంలో ఈ సామాజిక వర్గంతో గట్టిగా పోటీ పడగల వర్గం నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చి మరీ  ఆ డీలర్ షిప్ తీసుకుంది. వాళ్లయితేనే వీళ్లను ఢీకొనగలరు అని ఎంచి ఎంచి అప్పటి వరకు రోడ్ల కాంట్రాక్టులు చేసే వారికి ఈ డీలర్ షిప్ ఇచ్చారు.  

మళ్లీ విశాఖ మీద పట్టు సాధించేసిన వర్గం మళ్లీ అదే గేమ్ ప్లాన్ ప్రారంభించింది. కానీ ఈసారి లోకల్ వ్యాపార వర్గం మాదిరిగా ఆ రెండో సామాజిక వర్గం ఊరుకోలేదు. వీళ్లెంత రౌడీ యిజం చేసారో, వాళ్లు డబుల్ చేసారు. థియేటర్ల దగ్గర గొడవలు, సీసాలు పక్కదారి పట్టించడం ఇలాంటి వ్యూహాలు అన్నీ వీళ్లు కూడా అమలు చేసేసారు.  దెబ్బకి దెయ్యం దిగిపోయింది. తమ వ్యాపారాన్ని అమ్మేసుకుని, తోక ముడిచేసింది.

మరో ఉదాహరణ

వలస వచ్చిన వర్గం దౌర్జన్యానికి ఇక్కడ ఇంకో ఉదాహరణ చెబుతాను. విశాఖలో ఓ పేద్ద పలుకుబడి కలిగిన పెద్దాయిన మూడు అక్షరాల పేరిట మూడు నక్షత్రాల హోటల్ పెట్టారు. ఇది 80ల నాటి ముచ్చటే. ఆ హోటల్ కు ఎదురుకుండా ఎప్పటి నుంచో చిన్న రెస్టారెంట్ వుండేది. దానికి మాంచి పేరువుంది. ఇంత పెద్ద హోటల్ పెట్టినా అందులో రెస్టారెంట్ కు జనాలు రావడం లేదు. 

ఎదురుగా వున్న రెస్టారెంట్ కు జనాలు తగ్గడం లేదు. అంతే కుట్రలు కళ్లు తెరిచాయి. యూనియన్లు పుట్టుకువచ్చాయి. చిన్న రెస్టారెంట్ లో సమ్మె ప్రారంభమైంది. ఆఖరికి రెస్టారెంట్ అమ్మేసుకుని వెళ్లిపోయాడా ఆసామీ.  ఇదే ఆ సామాజిక వర్గంతో ఢీ అంటే ఢీ అనగల వర్గం అయితే ఆటలు సాగవు. ఇప్పుడు అదే భయం.

ఇంకా..ఇంకా..

హైదరాబాద్ లో పేరున్న ఓ హోటల్ విశాఖలో హోటల్ ను నిర్మించాలనుకుంది. స్థలం కొనుగోలు చేసింది. కానీ అప్పటికే దాని పక్కనే ఒక హోటల్ కట్టాలనుకుంది విశాఖను గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న వర్గం. వెంటనే పావులు కదిపింది. హైదరాబాద్ హోటల్ కొన్న స్థలానికి చెందిన కుటుంబంలో ఎక్కడో మూలన మిగిలి పోయిన వారు చిన్న లిటిగేషన్ పెట్టారు. అంతే ఏళ్లూ పూళ్లుగా ఆ స్థలం అలాగే మిగిలిపోయింది. ఈ లోగా వీళ్ల హొటల్ రెడీ అయిపోయింది. వ్యాపారమూ సాగిపోతోంది.

విశాఖలో ఓ పార్లర్ వుంది. అద్భుతంగా రన్ అవుతోంది. ఎదురుగా ఓ మాంచి బిల్డింగ్ వుంది. కానీ ఆయన అమ్మడు. దాన్ని ఎవరో లీజుకు తీసుకున్నారు. మెల్లగా వ్యూహం నడిచింది. లీజుకు తీసుకున్నవాళ్ల దగ్గర వీళ్లు సబ్ లీజ్ కు తీసుకున్నారు. బిల్డింగ్ కంట్రోల్ లోకి వచ్చింది. ఇదేంటీ అని గోల పెట్టబోయిన ఓనర్ కు కోర్టు స్టే అడ్డం పడింది. కోట్ల విలువైన భవనం వివాదంలోకి పోయింది.

అంతెందుకు రాజశేఖర రెడ్డి అండ లేకపోతే ఈనాడు భవనాన్ని రామోజీ రావు నుంచి వెనక్కు తెచ్చుకోవడం దాని ఓనర్లకు సాధ్యం అయ్యే పనేనా? తమ భవనం తాము తీసుకోవడానికి దాని ఓనర్లకు ఎన్ని ఏళ్లు సుప్రీంకోర్టు వరకు యుద్దం చేయాల్సి వచ్చింది. ఓ పిటిషన్ ను ఎదుర్కోంటే మరోటి ఇలా ఎన్ని అడ్డంకులు?

ఇప్పుడు అదే భయం

ఇప్పుడు ఇదే భయం..ఇదే జరుగుతుందనో? జరుగుతోందనో భయం. లోకల్ వాళ్లు అంటే మెత్తని వాళ్లు , ఎలా మొత్తినా మొత్తించుకుంటారు. కానీ రెడ్డి సామాజిక వర్గం అలా కాదే, దెబ్బకు దెబ్బ..ఆర్థికంగా, రాజకీయంగా, ఇంకా అన్ని విధాలుగా. నిజానికి విశాఖలో నానా అబద్దపు ప్రచారాలు చేసి విజయమ్మను ఓడించింది అందుకే. 

జగన్ మీద కోపమో? దేశం మీద ప్రేమో కాదు, విశాఖ మీద తమ పట్టు పోకూడదని. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వ్యాపారాలు, పదవులు అన్నీ ఆ వర్గానికే. మూడు జిల్లాల్లో మైనింగ్ అధికంగా వాళ్లదే. ఉత్తరాంధ్ర మొత్తం మీద వేలాది ఎకరాలు ఆ వర్గం చేతిలోనే.

ఏ పార్టీ అధికారంలో వున్నా ఆ వర్గం హవా అలా సాగుతూ వచ్చింది.  ఓట్లు వేసేది ఇక్కడి జనాలు. వీళ్ల ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ ఫండ్స్ లోంచి ఉదారంగా కేటాయింపులు చేసేది వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రాంతాలకు. కానీ ఏనాడూ ఏ ఉత్తరాంధ్ర వాసీ ప్రశ్నించలేదు. నిలదీయదు.

ఇలాంటి నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రావడమే కాదు, ఈ వర్గం హవాకు అడ్డుకట్ట వేయడం ప్రారంభించింది. అలాంటి టైమ్ లో అమరావతిని కాదని, విశాఖ మెడలో రాజధాని హారం వేయడానికి నిర్ణయం జరిగిపోయింది.  నిజానికి విశాఖలో అన్ని విధాలుగా పాతుకపోయి, ఆధిపత్యం సంపాదించిన వర్గం ఈ నిర్ణయానికి సంతోషించాలి. తమ వ్యాపారాలు పెరుగుతాయి. తమ భూముల విలువలు పెరుగుతాయి. తమ సంపద మరింత పెరుగుతుంది. ఇదే ఎవరన్నా అనుకునేది.

కానీ ఈ వర్గం అలా అనుకోలేదు. విశాఖకు రాజధాని వద్దంటోంది. అమరావతే ముద్దు అంటోంది? ఎందుకు? అమరావతి మీద ప్రేమనా? అక్కడే తప్పులో కాలు పడేది. అమరావతి మీద ప్రేమ కాదు, విశాఖలో ఆధిపత్యం పోతుందనే భయం. గతంలో రెండు సాఫ్ట్ డ్రింక్ కంపెనీల మధ్య పోరులో తమ వర్గం కంపెనీని ఎదురు దెబ్బ తీసిన చందంగా ఇప్పుడు కూడా వుంటుందేమో వ్యవహారం అనే భయం.

అసలు సమస్య ఇదే

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఇన్నాళ్లు ఉత్తరాంధ్రను ముఖ్యంగా విశాఖను తమ గుప్పిట్లో పెట్టుకుని కోట్లకు కోట్ల ఆర్జిస్తున్న సామాజిక వర్గం గుండెల్లో గుబులు మొదలైంది. ముందుగా మద్యం సిండికేట్ లేచిపోయింది. ఆపై మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్టపడింది. ఊ అంటే సెమినార్, ఆ అంటే సెమినార్ అంటూ విశాఖలో ఓ బోలెడు నక్షత్రాల హోటల్ ను పెంచి పోషించే వ్యవహారానికి తెరపడింది.

అంతే కాదు, విశాఖలోని వివిధ వ్యాపారాలను వ్యవహారాల్లో తాము కూడా దూరడానికి మరోవర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర అమాయకపు జనాల్లా కాదు ఆ వర్గం. ఈ సామాజిక వర్గానికి దీటైన వర్గం. సామ దాన దండ బేధోపాయాలు అన్నీ సమానంగా రచించగల వర్గం.

అదే అసలు బాధ. అమరావతి పోయింది. విశాఖ కూడా పోయేలా కనిపిస్తోంది. అదే కనుక విశాఖ రాజధాని కాకపోతే ఆ వర్గం ఇక్కడకు రాదు. అందుకే ఉన్నది, ఉంచుకున్నదీ రెండూవుండాలంటే అమరావతి రాజధానిగానే వుండాలి. విశాఖకు తమకు చెక్ చెప్పే వర్గం రాకూడదు.

అందుకే ఈ రాతలు

ఈ మధ్య ఆ వ్యాపారంలో వాటా లాగేసుకున్నారు. ఈ వ్యాపారంలో వాటా కొట్టేసారు లాంటి వార్తలు కనిపిస్తున్నాయి. వీటినే వ్యాపార పరిభాషలో టేకోవర్ లు అంటారు. వ్యాపారాల్లో ఇవి కామన్. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. ఇప్పడూ జరుగుతున్నాయి. రేపూ జరుగుతాయి. అయితే గతంలో ఇదే మీడియా అస్సలు పెదవి విప్పలేదు. విశాఖపై వాలి ప్రతి వ్యాపారాన్ని నొల్లేసినపుడు నోరు విప్పలేదు.  

నిజానికి వ్యాపారాల్లో ఇలాంటివి అన్నీ మామూలే. హెరిటేజ్ షేర్లను గుత్తగా మనవుడు దేవాన్ష్ కు బాలయ్య ఇచ్చేసారని వార్తలు వచ్చాయి.  కొడుకు మోక్షజ్ఞ వుండగా అలా ఎందుకు చేసారో? మరో కూతురు కూడా వుండగా, ఒక్క కూతురు కొడుక్కే ఎందుకు ఇచ్చేసారో? ఎవరన్నా అడిగారా? అది ఆయన ఇష్టం. చంద్రబాబు తల్లి హైదరాబాద్ లో ఖరీదైన స్థలం మనవడు లోకేష్ కు ఇచ్చేసారు. మరి నారా రోహిత్ కూడా మనవడేగా? ఎందుకు ఇవ్వలేదు? అది ఆమె ఇష్టం.  కోరి కోరి అర్జెంట్ గా అంబానీ వెళ్లి ఈనాడులో భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టేసారో? ఎవరన్నా అడిగారా? ఆయన ఇష్టం.

కానీ ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రం విశాఖలో ఇలాంటివి బోలెడు జరిగిపోతున్నాయని తెగ బాధపడిపోతోంది. ఇవన్నీ దందాలు అంటోంది. నిజం కావచ్చు. అబద్దం కావచ్చు. నిన్న తప్పు జరిగితే ఎత్తి చూపితే, ఇవ్వాళ తప్పు జరిగినా ఎత్తి చూపే హక్కు వుంటుంది. లేదంటే వుండదు. కానీ ఆ మీడియా అలా అనుకోదు. తమ తప్పులు అన్నీ గంప కింద దాచేయడం, ఎదుటవారిలో రంధ్రాన్వేషణ చేయడం అలవాటు అయిపోయింది.

ఆ సంగతి అలా వున్నా, నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రలో ఓ వర్గం సాగిస్తున్న పెత్తనానికి గండి పడుతోంది. దోపిడీకి అడ్డుకట్ట పడుతోంది. అమరావతిని పక్కన పెట్టేసి, విశాఖను చాప చుట్టేస్తే ఈ నలభై ఏళ్ల వ్యవహారానికి ఇక ఏదీ దిక్కు? అందుకే జై అమరావతి. 

రాజధానిగా అమరావతే వుండాలి. విశాఖకు ఎవ్వరూ రాకూడదు. విశాఖపై మరెవ్వరూ కొత్తగా కన్నేయకూడదు. విశాఖ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ పదవులు అన్నీ ఆ వర్గానికే వుండాలి. అలా జరగాలన్నదే ఆ వర్గం కోరిక. కానీ అది నెరవేరుతుందా? బ్రేక్ పడుతుందా? అన్నది కాలమే చెబుతుంది.

-చాణక్య