అసలు జూమ్ యాప్ చంద్రబాబు కోసమే కనిపెట్టారా.. లేక చంద్రబాబు వాడినట్టుగా జూమ్ యాప్ ని ఇంకెవరూ వాడటం లేదా.. అనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకీ బలపడిపోతోంది. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చారంటే.. ప్రవాస జీవితానికి విరామం ఇచ్చారని అనుకున్నారంతా. అయితే బాబు మాత్రం రాష్ట్రం మారినా జూమ్ ని మాత్రం వదిలిపెట్టడం లేదు.
హైదరాబాద్ లో ఉన్నప్పుడు.. నేతలకు అందుబాటులో లేరు కాబట్టి జూమ్ ద్వారా మీటింగ్ లు పెట్టారంటే ఓ అర్థముంది. కనీసం ఏపీకి వచ్చాక కూడా నాయకుల్ని నేరుగా కలవకుండా, జూమ్ లోనే అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారంటే ఎలా అర్థం చేసుకోవాలి.
చోటామోటా నాయకుల్ని కలవడం అసలు బాబుకి ఇష్టంలేదా? ఇంకా కరోనాకే భయపడుతున్నారా? అంతకు మించి ఇంకేమైనా ఉందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
బుధవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బాబు, గురు-శుక్ర-శనివారాల్లో ఎవరినీ కలవలేదు. పార్టీ అధినేతను కలిసేందుకు ఉండవల్లి వెళ్లిన నేతలకు కూడా నిరాశే ఎదురైంది. వారెవర్నీ లోపలికి అనుమతించలేదు సెక్యూరిటీ.
ఎంతటి ముఖ్య నాయకులైనా బాబు నివాసం వద్దకు రావొద్దని, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని సమాచారం కూడా ఇచ్చారట. సీనియర్ నాయకులు కేవలం టెలికాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే సంప్రదించాలని కోరారట.
ఇటీవల పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గాలకు ఎన్నికైన అధ్యక్షులు మర్యాదపూర్వకంగా బాబుని కలవడానికి వస్తామన్నా కూడా కుదరదని తేల్చి చెప్పారట. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ లో ఆశీస్సులు తీసుకోండి అని చెప్పేశారట. దీంతో నాయకులంతా మరోసారి అసంతృప్తికి లోనయ్యారు.
అసలు బాబు ఏపీ ప్రజల కోసమో, ఏపీ నాయకుల కోసమో ఇక్కడికి రాలేదని, ఆయన కలవాలనుకున్నవారిని కలసి వెళ్లేందుకే వచ్చారని తేలిపోయింది. అమరావతి ఉద్యమానికి కూడా జూమ్ నుంచే సందేశాన్ని పంపించబోతున్నారు బాబు. ఆమాత్రం దానికి ఆయన అక్కడ ఉంటే ఏంటి? ఇక్కడికొస్తే ఏంటి? అని టీడీపీ నేతలే సెటైర్లు పేలుస్తున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే.. కొన్ని రోజుల తర్వాత “జూమ్ ను కనిబెట్టింది కూడా మనమే తమ్ముళ్లు” అంటూ బాబు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.