హైదరాబాద్ లో చిరుత.. ఇప్పుడెక్కడుంది?

3 నెలల కిందటి సంగతి.. హైదరాబాద్ శివార్లలో నడిరోడ్డుపై పట్టపగలు చిరుతపులి కనిపించింది. లారీ క్లీనర్ తో పాటు మరో వ్యక్తిని గాయపరిచి పారిపోయింది. అదే టైమ్ లో శివారు ప్రాంతంలోని పశువులపై దాడి…

3 నెలల కిందటి సంగతి.. హైదరాబాద్ శివార్లలో నడిరోడ్డుపై పట్టపగలు చిరుతపులి కనిపించింది. లారీ క్లీనర్ తో పాటు మరో వ్యక్తిని గాయపరిచి పారిపోయింది. అదే టైమ్ లో శివారు ప్రాంతంలోని పశువులపై దాడి చేసి చంపేసింది. అలా 3 నెలల పాటు అధికారులను ముప్పుతిప్పలు పెట్టి, స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.

రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దాని కాలిముద్రల ఆధారంగా బోనులు, నైట్ విజన్ సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అయినప్పటికీ చిరుతను పట్టుకోలేకపోయారు. రద్దీగా ఉండే జనావాసాల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల పరిథిలో చిరుత అక్కడక్కడే సంచరించినప్పటికీ అధికారులు పట్టుకోలేకపోయారు.

అలా రాజేంద్రనగర్ ను ఓ రౌండేసిన చిరుత.. మళ్లీ తన గమ్యస్థానానికి చేరుకుంది. 3 నెలల కిందట ఎక్కడైతే కనిపించిందో మళ్లీ అక్కడే ప్రత్యక్షమైంది. వాలంటరీ కాలనీలో రెండు ఆవులపై దాడి చేయడంతో.. చిరుత మళ్లీ అక్కడికే వచ్చిందనే విషయం అధికారులకు తెలిసింది. కాలిముద్రల ఆధారంగా.. 3 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్న చిరుత, రాత్రి దాడి చేసిన చిరుత ఒకటేనని గుర్తించారు.

ఏ పశువులనైతే చిరుత చంపిందో, అదే పశువులను ఎరగా వేసి బోనులు ఏర్పాటుచేశారు. మరోసారి అదే ప్రాంతానికొచ్చిన చిరుత ఎట్టకేలకు ఈరోజు ఉదయం బోనులో చిక్కింది. దీంతో స్థానికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

విశాఖ మీద ఆ సామాజిక వర్గం పట్టు ఉంటుందా