జస్ట్…పొలిటీషియన్…!

‘‘న్యాయ వ్యవస్థపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారణ జరపక తప్పదు. ఎవరైతే మాకేంటి? న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిని లెక్క చేసేది లేదు. ఈ తరుణంలో న్యాయ వ్యవస్థకు అండగా…

‘‘న్యాయ వ్యవస్థపై స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారణ జరపక తప్పదు. ఎవరైతే మాకేంటి? న్యాయ వ్యవస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిని లెక్క చేసేది లేదు. ఈ తరుణంలో న్యాయ వ్యవస్థకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది’’ …ఇదీ తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. 

న్యాయ వ్యవస్థపై స్పీకర్ సహా బాధ్యతాయుత పదవుల్లో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు) అనుచిత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకరంగా, అగౌరవంగా మాట్లాడటం ఏ రాష్ర్టంలోనూ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

నిజమే…ఏపీలో ఇదొక వింత పరిణామం. జగన్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవచ్చుగాక. కాని ఆ మంచి పేరును మంత్రులు, స్పీకర్, ప్రజాప్రతినిధులు మంటగలుపుతున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలు చేసుకున్నా, పరస్పరం బూతు పురాణం చదువుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు.

రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోయినందుకు బాధపడతాంగాని, రాజకీయ నాయకుల స్వభావమే అలాంటిదని సరిపెట్టుకుంటాం. కాని ఏపీలో అధికార పార్టీ నేతలు కట్టుతప్పిపోయారు. వారు న్యాయస్థానాలను, న్యాయమూర్తులను కూడా వదిలిపెట్టడంలేదు. పైగా న్యాయస్థానాలపై విమర్శలు చేయడాన్ని ధీరోదాత్తమైన పనిగా పరిగణిస్తున్నారు. వీరు ఇలా చెలరేగిపోవడానికి ముఖ్యమంత్రి జగన్ ఉదాసీనత కూడా కారణం కావచ్చు. 

జగన్ రాజకీయంగా ఏ వ్యూహాలైన పన్నుకోవచ్చు. ప్రతిపక్షాలను దెబ్బ కొట్టడానికి రాజకీయ కోణంలో ఏమైనా చేయొచ్చు. కాని పార్టీ నాయకులు అనుచితంగా వ్యవహరించినప్పుడు అది తప్పని చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆ పనిచేయనంత కాలం ఆ చెడ్డ పేరు ఆయనే మోయాల్సివస్తుంది. ప్రస్తుతం ఇతర నాయకుల గురించి పక్కన పెడదాం. స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి మాట్లాడుకుందాం.

సరిగ్గా చెప్పాలంటే ఏపీకి తమ్మినేని సీతారాం స్పీకర్ కావడం దురదృష్టం. ఆ పదవికున్న ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ఆయన దిగజార్చారని చెప్పుకోక తప్పదు. తమ్మినేని వ్యాఖ్యలను ప్రత్యేకంగా పరిగణించి విచారణ జరుపుతామని చెప్పిందంటే ఆయన స్పీకర్ వ్యవస్థను ఎంతగా దిగజార్చారో అర్థమవుతోంది. 

శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి చెప్పినట్లుగా ఒక్కో పదానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఒక్కో భావం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకునే తీరును బట్టి వారి వ్యవహారశైలి, ప్రవర్తన ఉంటాయి. 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం శంకరాభరణం సినిమా చూశారో చూడలేదో మనకు తెలియదు. చూసి ఉంటే ఆయన పదాలకు అర్థం తెలుసుకునే ప్రయత్నం చేసేవారేమో…! ‘స్పీకర్’ అనే పదానికి మామూలు భాషలో మాట్లాడేవాడని, ఉపన్యాసకుడని అర్థం. ఏదైనా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రిక చూస్తే అందులో స్పీకర్స్ అని సభలో మాట్లాడేవారి పేర్లు రాస్తారు. అయితే చట్టపభలో అంటే అసెంబ్లీలో, పార్లమెంటులో (లోక్‌సభలో) స్పీకర్ అంటే సభను క్రమబద్ధంగా నడిపించేవాడని అర్థం.

ఇదో రాజ్యాంగబద్ధమైన పదవి. గౌరవనీయమైన పదవి.  దీనికి ఎన్నికయ్యేది అసెంబ్లీలో ఎమ్మెల్యే, పార్లమెంటులో ఎంపీ అయినప్పటికీ ఆ పదవిలో కూర్చున్న తరువాత తాను ఎంపీని, ఎమ్మెల్యేను అనే విషయం మర్చిపోవాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. అన్ని పక్షాలను సమానంగా చూడాలి. స్పీకరుకు సభ నిర్వహణ తప్ప ఇతర రాజకీయ వ్యాపకాలు ఉండకూడదు. 

ఎమ్మెల్యేగా, ఎంపీగా తన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూనే, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే దైనందిన రాజకీయాల రొచ్చులో తల దూర్చకుండా హుందాగా వ్యవహరించాలి. కాని తమ్మినేని సీతారాం స్పీకర్ పదానికి అర్థం మరోలా అన్వయించుకొని, అంటే స్పీకర్ అంటే ఏదిబడితే అది మాట్లాడేవాడని అనుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన పదవిలోకి వచ్చినప్పటినుంచి ఇదే ధోరణి. ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశాక ఆయన ఇక ఉండలేకపోయారు.

సాధారణ రాజకీయ నాయకుడి మాదిరిగానే రెచ్చిపోయి మాట్లాడారు. ప్రతిపక్షం టీడీపీపై విరుచుకుపడ్డారు. అమరావతిలో వెళుతుంటే ఎడారిలో పోతున్నట్లుగా ఉందన్నారు. స్పీకర్ ఇలా అనొచ్చా?  అమరావతిలో భూముల విలువ పడిపోయిందని ఆందోళన చేస్తున్నారా? అని ప్రశ్నించారు. 

అమరాతిని లెజిస్లేచర్ కేపిటల్‌గా కొనసాగిస్తామని, ఇంకా ఏంటి మీ బాధ అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ఆమోదిస్తారా? లేదా? అమరావతిలో లెజిస్లేచర్ కేపిటల్ కావాలా? వద్దా? కర్నూలులో హైకోర్టు పెట్టాలా? వద్దా? చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన మూడు రాజధానుల ఆలోచన బ్రహ్మాండంగా ఉందన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి పాలనను అన్ని ప్రాంతాలకు తీసుకెళుతుంటే ఇంకా ధర్నాలు, ఆందోళనలు ఎందుకన్నారు.

బహిరంగ సభల్లో బూతుపురాణం చదివిన చరిత్ర  తమ్మినేనికి ఉంది.  కొంతకాలం కిందట దేశంలో పౌరసత్వ చట్టం సవరణ బిల్లు మీద, ఎన్‌ఆర్‌సీ మీద పెద్దఎత్తున గొడవ జరిగింది.  కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలూ జరిగాయి. దానిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.  వారు ఏవేవో వివరణలు ఇచ్చుకున్నారు. తాము చెప్పాల్సిందేదో చెప్పారు.  కాని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు కదా. దేశంలో ఆందోళనలు చేస్తున్నవారిని తిట్టడంలేదు, విమర్శించలేదు కదా. ఎందుకంటే అది ఆయన పని కాదు. 

తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు అనేకసార్లు వివిధ అంశాలపై చీవాట్లు పెట్టింది. కాని అక్కడి స్పీకర్ ఏమైనా వ్యాఖ్యానాలు చేశారా? మంత్రులు అగౌరవంగా మాట్లాడారా? తెలంగాణలోనూ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు రాజును మించిన రాజభక్తి ఉంది.

కాని ప్రభుత్వానికి ప్రతికూలంగా తీర్పులు వచ్చినప్పుడు లేదా కోర్టు తలంటు పోసినప్పుడు నిబ్బరంగా ఉన్నారేగాని న్యాయ వ్యవస్థను అగౌరవపర్చలేదు. చివరగా చెప్పొచ్చేదేమిటంటే తమ్మినేని సీతారాం పేరుకే స్పీకర్. కాని ఆయన జస్ట్…పొలిటీషియన్. అంతే…!

నాగ్ మేడేపల్లి