అబ‌ద్ధ‌మే గొప్ప వ‌రం

ఈ లోకం ఒక విష వృక్షం. మ‌న క‌న్నీళ్లు తాగి బ‌త‌కాల‌నుకుంటుంది. క‌ల ఒక గాజుపాత్ర‌. తెల్లారేస‌రికి ప‌గిలి పోతుంది. వ‌ర్షం ఒక వీణానాదం, వినోదం, వెయ్యి బుడ‌గ‌ల రాక్ష‌సి. Advertisement వెన్నెల్ని ప్రేమించేవాడు…

ఈ లోకం ఒక విష వృక్షం. మ‌న క‌న్నీళ్లు తాగి బ‌త‌కాల‌నుకుంటుంది. క‌ల ఒక గాజుపాత్ర‌. తెల్లారేస‌రికి ప‌గిలి పోతుంది. వ‌ర్షం ఒక వీణానాదం, వినోదం, వెయ్యి బుడ‌గ‌ల రాక్ష‌సి.

వెన్నెల్ని ప్రేమించేవాడు అమావాస్య‌ని కూడా గౌర‌వించాలి. స‌ముద్రాన్ని చిలికిన వాడే అమృతానికి అర్హుడు. అడ‌వి దారిలో జింక పిల్ల త‌ప్పి పోయింది. మ‌హా న‌గ‌రంలో రైలు దిగిన కుర్ర‌వాడికి తోడేళ్ల కొత్త రూపం తెలియ‌దు.

ప‌ర‌కాయ ప్ర‌వేశం క‌ల్ప‌న‌కాదు. ఎవ‌రూ త‌మ పాత్ర‌ల్లో లేరు. ప్ర‌తిరోజూ ఒక కొత్త రూప‌మే.

బొడ్డు కోసిన క‌త్తితోనే శిశువు యుద్ధ పాఠాలు నేర్చుకుంటాడు. శ్మ‌శానంలోనే జీవించే వాడికి వైరాగ్యం వుంటుందా?

గులాబీలోని ర‌క్త నాళాలు త‌డిమి చూడు, ప్ర‌పంచం ఒక ప‌సిబిడ్డ‌గా క‌నిపిస్తుంది. విషాన్ని క‌క్కుతూ, లేదా మింగుతూ జీవించ‌డ‌మే మాడ్ర‌నిజం. మ‌న ప్ర‌యాణం తొలి అడుగు అమ్మ‌కి తెలుసు. చివ‌రి అడుగు భూమికి తెలుసు. ఇద్ద‌ర‌మ్మ‌ల ముద్దుబిడ్డ‌లే మ‌న‌మంతా.

మ‌నుషులంతా ఒక‌ప్పుడు చేద‌బావులు. మాట‌లు లోప‌లి నుంచి వ‌చ్చేవి. నువ్వు లేవు, ఉన్న‌దంతా నేనే అన్నాడు శ్రీ‌కృష్ణుడు. య‌జ‌మానులు కార్మికుల‌తో ఇదే అంటున్నారు.

వ‌ర్గ‌పోరాట‌మే చరిత్ర అయిన‌ప్పుడు, ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌రిత్ర రాసిందంతా ఒకే వ‌ర్గం.

ఒక‌ప్పుడు చెకుముకి రాళ్ల‌తో నిప్పు పుట్టేది. ఇప్పుడు నాలుక‌ల‌తో నిప్పు పుడుతోంది. కొలిమిలో కాలుతున్న క‌త్తికి తెలియ‌దు తాను ఎవ‌రి ప‌క్ష‌మో! త‌న యుద్ధం ధ‌ర్మ‌మో, అధ‌ర్మ‌మో!

ధ‌ర్మ‌రాజు ఓడిపోతాడ‌ని శ‌కునికి తెలుసు. అన్ని కాలాల్లోనూ శ‌కునికే మంచి శ‌కునం. జ్ఞానాన్ని లోకం క్ష‌మించ‌దు. మాట నేర్చుకుని చిలుక జైలుపాలైంది. కొండ చిలువ చాలా ద‌య‌గ‌ల‌ది. న‌మ‌ల‌కుండా తింటుంది.

జీవితాన్ని వ‌డ‌గ‌డుతూ వుండు. లేక‌పోతే చెత్త‌కుప్ప‌లో జ్ఞాప‌కాల్ని వెతుక్కోవ‌ల‌సి వుంటుంది. అడ‌విలో ఆకుల్లో నుంచి జారుతున్న వెన్నెల‌ని చూడు. అదే మ‌రో ప్ర‌పంచం.

ర్యాంకులు, మార్కులు అడిగావు త‌ప్ప , నీ పిల్ల‌ల్లో ద‌య‌, జాలి ఉన్నాయో లేదో తెలుసుకున్నావా? విత్త‌నం, వృక్షం వేర్వేరు వుండ‌డం అసాధ్యం.

నిన్ను గుర్తు ప‌ట్టేవాళ్లు, నువ్వు గుర్తు ప‌ట్టేవాళ్లు ఎంద‌రున్నారో అర్థ‌మైతే నువ్వేంటో తెలుస్తుంది. సూక్ష్మ‌రేణువులు కూడా బ్ర‌హ్మాండం అని న‌మ్మితే అది అతిశ‌యోక్తి అలంకారం.

ఆక‌లేసే వాడికి ఆధ్మాత్మిక ప్ర‌వ‌చ‌నాలు చెప్పొద్దు. త‌న్నినా తంతాడు. అబ‌ద్ధాలు చెబుతూనే వుండు. స‌త్యం నిన్ను వ‌రిస్తుంది.

మేక‌ప్ తీసేయ‌కు. నిన్ను నువ్వు కూడా గుర్తు ప‌ట్ట‌క జ‌డుసుకుంటావు. ప‌రావ‌ర్త‌న ర‌హ‌స్యం తెలుసుకో. నువ్వే పులి. నువ్వే మేక‌.

జీఆర్ మ‌హ‌ర్షి

4 Replies to “అబ‌ద్ధ‌మే గొప్ప వ‌రం”

  1. ఇంత థింకింగ్ మానేసి ప్రశాంతంగా రెండు పుట ల తిని పడుకునే ఆలోచన చేయండి. ఖాళీగా ఉంటే ఇవే ఆలోచనలు బుర్ర తొలుస్తాయి

Comments are closed.