సైనికులు ఎక్కడో దేశం అంచుల్లో, సరిహద్దుల్లో ఉంటారు.. దేశం సురక్షితంగా ఉండడానికి అహరహమూ తమ జీవితాలను పణంగా పెట్టి కాపలా కాస్తుంటారు. సైనికులు- మహా అయితే పెద్దపెద్ద నగరాల్లో సైనిక శిబిరాలలో ఉంటారు. దేశానికి అత్యవసరం అయినప్పుడు భద్రతకు సంబంధించిన సేవలు అందించడానికి, సహాయక చర్యలకు తక్షణం రంగంలోకి దిగేలా అందుబాటులో ఉంటారు.
కానీ, అదే సైనికులు దేశవ్యాప్తంగా ఊరూరా, వాడవాడలా విస్తరించి ఉంటే ఎలా ఉంటుంది. వెలుపలినుంచి గానీ, లోపలి నుంచి గానీ.. ఏ చిన్న అవసరం వచ్చినా.. తక్షణం సైనికులు అందుబాటులోకి వస్తారు కద! అంతకంటె గొప్ప విషయం ఏముంటుంది?
సైనిక ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకసారి సైన్యంలో చేరితే జీవితమంతా నిశ్చింతగా గడచిపోతుందని అనుకునేవాళ్లు.. నాలుగేళ్ల తర్వాత తమను ఇంటికి పంపేస్తారేమో (అది కూడా ప్రతిభ పేలవంగా ఉంటే మాత్రమే) ఆందోళనకు గురికావడం తప్ప.. ఉద్యోగార్థుల ప్రయోజనాల గురించి ఆలోచించినప్పుడు తప్ప.. విశాల దేశప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు.. అగ్నిపథ్ మంచిగానే అనిపిస్తుంది.
ఏమిటి అగ్నిపథ్?
దేశాన్ని తాజాగా రావణకాష్టంగా మారుస్తున్న అంశం ‘అగ్నిపథ్’! ఇంతకూ ఏమిటీ అగ్నిపథ్? ఇది సైనిక నియామకాలకు సంబంధించినది. ఈ ఏడాది 46వేల సైనికోద్యాగాలను అగ్నిపథ్ ద్వారా భర్తి చేయనున్నారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారు నాలుగేళ్ల పాటు సైనిక సర్వీసు/ శిక్షణలో ఉంటారు. ఆ తర్వాత వారికి రకరకాల పరీక్షలు నిర్వహించి 25 శాతం మందిని మాత్రం సైన్యంలోకి పర్మినెంట్ ఉద్యోగులుగా తీసుకుంటారు. వారు ఆ తర్వాత 15ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది.
మిగిలిన 75 శాతం మంది.. తిరిగి సాధారణ పౌరజీవనంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా తిరిగి వెళ్లే వారికి సేవానిధి పేరిట ఒక్కొక్కరికి రూ.11.71 లక్షలు ఇస్తారు. వారు తమ సొంతంగా ఇతర వృత్తి ఉద్యోగాలు వ్యాపారాల్లో స్థిరపడడానికి వీలుంటుంది!
ఈ నాలుగేళ్ల పాటు వారికి వేతనం కూడా ఉంటుంది. నాలుగేళ్లపాటు వరుసగా 30, 33, 36.5, 40 వేల వంతున నెలసరి వేతనం ఉంటుంది. ఇందులో 30 శాతం నాలుగేళ్ల తర్వాత వారికి ఇచ్చే సేవానిధి కోసం వారి జీతంనుంచి మినహాయిస్తారు. ఆ మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అదనంగా జత చేస్తుంది. ఆ సొమ్ము వడ్డీతో కలిపి 11.71 లక్షలుగా వారి చేతికి అందుతుంది. ఇది సర్వీసులో ఉండగా వచ్చే జీతానికి అదనం.
ఏమిటి లాభం?
అగ్నిపథ్ పథకం కింద ఇప్పుడు 46వేల మంది నియామకాలు జరగనున్నాయి. అంటే నాలుగేళ్ల తర్వాత కనీసం 30వేల మంది యువకులు, సైనిక శిక్షణ పొందిన వారు, అగ్నివీరులు గా దేశం నలుమూలలా ఉంటారు. ప్రతి ఏటా ఇలా సుశిక్షితులయ్యే యువతరం సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటుంది. ఇలా దేశంలో విస్తరించి ఉండే మాజీ సైనికులు ఇప్పుడు కూడా ఉంటారు. కానీ వారంతా 15ఏళ్ల శిక్షణ పూర్తి చేసుకుని, రిటైరై, దాదాపు నడివయసు దాటి, వృద్ధాప్యానికి చేరిన మాజీ సైనికులు. కానీ అగ్నివీరులు అలా కాదు. 21నుంచి 25 ఏళ్ల వయసులోగా వారు అగ్నివీరులుగా శిక్షణ పొంది పౌరసమాజంలో ఉంటారు.
దేశానికి వెలుపలి నుంచి లేదా లోపలినుంచి విపత్కర పరిస్థితి హఠాత్తుగా వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ అగ్నివీరులు అందుబాటులోకి వస్తారు! దేశ సైనిక బలం అనేక రెట్లు పెరిగినట్లుగా ఈ పరిస్థితి తయారవుతుంది.
ఎందుకు నిరసనలు?
సైనిక నియామకాల కోసం ఎదురుచూసే యువతరం మన దేశంలో చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. అలాంటి వారిలో ఒక్కసారిగా తమ ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయనే భయం వచ్చింది. భవిష్యత్తు ఉండదనే భయం కూడా వచ్చింది.
అయితే ఇవి కేవలం అపోహలే. నిజానికి సైన్యంలో చేరడానికి కనీస విద్యార్హత పదోతరగతి, కనీస వయసు 17 సంవత్సరాలు అయితే.. ఆ వయసులో చేరిన వారు.. నాలుగేళ్ల సైనిక శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత.. వారికి 12వ తరగతికి సమానమైన ధ్రువపత్రం ఇస్తారు. చదువు కొంత ఆలస్యం అవుతుంది గానీ.. కొనసాగించవచ్చు. స్వయం ఉపాధితో స్థిరపడదలచుకుంటే.. బ్యాంకురుణాల్లో వారికి ప్రాధాన్యం లభిస్తుంది. ఉద్యోగాలే కావాలనుకుంటే.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసు నియామకాల్లో వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఏ రకంగా చూసినా.. అగ్నివీరులకు ఎడ్వాంటేజీ గానే కనిపిస్తోంది.
రాష్ట్ర కేంద్ర పోలీసు బలగాల్లో సైనిక శిక్షణ పొందిన యువతరం పెరగడం ఒక మంచి పరిణామం కూడా అవుతుంది. పోలీసు శిక్షణలో ఉండగల దానికంటె, సైనిక శిక్షణలో ఉండే క్రమశిక్షణ వారిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతుంది. వారినుంచి మరింత నాణ్యమైన సేవలు ఆశించవచ్చు.
చాలా దేశాల్లో ఉన్నదే..
అగ్నిపథ్ వంటి పథకాలు చాలా దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఇప్పటికే ఉన్నాయి. ఇజ్రాయిల్ లో 12 నెలలు, ఇరాన్ లో 20 నెలలు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉందని కిషన్ రెడ్డి చెబుతున్నారు. సింగపూర్లో అయితే.. దేశంలోని ప్రతి విద్యార్థి కూడా తమ గ్రాడ్యుయేషన్ చదువులో భాగంగా విధిగా నిర్ణీతకాలం సైన్యంలో కూడా పనిచేసి ఆ శిక్షణ తీసుకుని తీరాలి. అంటే ఆయా దేశంలో.. డిగ్రీ చదివిన ప్రతి యువకుడు కూడా ఒక సైనికుడే అన్నమాట.
నిజానికి అలాంటి పద్ధతి చాలా గొప్పది. కానీ 150 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో డిగ్రీ చదివే ప్రతి విద్యార్థికీ సైనిక శిక్షణ కంపల్సరీ చేయడం ఆచరణ సాధ్యం కాదు. కానీ.. సమాజంలో ఉండే యువతరంలో ఎక్కువ మంది సైనిక శిక్షణ పొందిన వారుగా, సన్నద్ధులుగా ఉండడం అనేది కార్యరూపం దాల్చడానికి ఉపకరించే వ్యవస్థ ఈ అగ్నిపథ్.
ఏమిటి రాజకీయం?
మోడీ సర్కారు.. ఆరెస్సెస్ వాళ్లకు సైనిక శిక్షణ ఇచ్చి, తిరిగి పౌరజీవనంలోకి పంపే ఉగ్రవాదులుగా తయారు చేయడానికే ఈ అగ్నిపథ్ పథకం తీసుకువచ్చిందని ప్రతిపక్షాల్లో కొందరు విమర్శిస్తున్నారు. ఇది చాలా దారుణమైన విమర్శ. ఒక పథకం రాగానే.. దానికి వక్ర లక్ష్యాలను ఆపాదించి.. ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలుగా ఇవి కనిపిస్తున్నాయే తప్ప.. మరొకటి కాదు.
సందేహం మిగిలే ఉంది..
ఇంకా ఒక సందేహం మిగిలుంది. అగ్నిపథ్ అనేది ఆప్షనల్ మాత్రమే అని కేంద్రప్రభుత్వపు పెద్దలు చెబుతున్నారు. అంటే అగ్నివీరులుగా ఉండదలచుకున్న వారు, నాలుగేళ్ల తర్వాత.. తిరిగి పౌరజీవితంలోకి వచ్చేయదలచుకున్న వారు మాత్రమే.. ఈ అగ్నిపథ్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, అగ్నిపథ్ ఆప్షనల్ మాత్రమే అంటున్న కేంద్రం.. దీనితోపాటు రెగ్యులర్ సైనిక నియామకాలను కూడా చేపడుతుందా? లేదా, ఆ నియామకాలు చేపట్టకుండా ఉద్యోగార్థులను వంచిస్తుందా? అనేది స్పష్టత లేదు!!
నిరసనలు తగవు..
ఆందోళనలు చేస్తున్న వారు.. అపోహలతో ఉండవచ్చు. వారు అల్లర్లకు పాల్పడి ఉండవచ్చు. కానీ వారు సంఘవిద్రోహక శక్తులు కాదు. తమ ఉద్యోగ ఆశలు అడియాసలవుతున్నాయనే భయంతో ఆందోళనలు చేశారే తప్ప మరొకటి కాదు. వారు చేసిన దుందుడుకు చర్యలు సమర్థనీయం కాదు గానీ.. వారి పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి.
అగ్నిపథ్ అనేది.. యువతకు సైనిక ఉద్యోగాల పరంగా మరింత మెరుగైన అవకాశాలు కల్పించడానికి, యువతరం శిక్షణ తర్వాత కూడా తమ తమ జీవితాల్లో మరింత మెరుగ్గా స్థిరపడడానికి ఉపయుక్తం అయ్యేది మాత్రమే అని తెలియజెప్పాలి.
.. ఎల్.విజయలక్ష్మి