ఒకసారి రాంగ్ స్టెప్ పడితే ఇక అదే అలవాటుగా మారిపోయే ప్రమాదం వుంది. టాలీవుడ్ లో ఇప్పుడు అదే జరిగింది. ఆచార్య సినిమా టైమ్ లో కొరటాల శివ చేసిన తప్పు ఇప్పుడు ఓ పద్దతిగా మారుతున్నట్లు కనిపిస్తోంది.
సినిమా రంగంలో వ్యాపారం రకరకాల పద్దతుల మీద జరుగుతుంది. సినిమాను ఇంత మొత్తానికి అని అమ్మేయడం, అంటే ఇక అక్కడితో నిర్మాత బాధ్యత తీరిపోతుంది. లాభ నష్టాలతో సంబంధం వుండదు. లేదూ ఇంత మొత్తం అడ్వాన్స్ తీసుకుని అమ్మడం.
ఇక్కడ ఈ అడ్వాన్స్ రెండు రకాలు. రిటర్న్ బుల్ అడ్వాన్స్. నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్. సినిమాను పంపిణీకి తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ కు కేవలం కమిషన్ మాత్రమే వస్తుంది. సినిమా హిట్ కాకపోతే రిటర్న్ బుల్ నా లేదా నాన్ రిటర్న్ బుల్ నా అన్నదాన్ని బట్టి డబ్బులు వెనక్కు ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ఆధారపడి వుంటుంది.
కానీ ఇక్కడ కనిపించని మూడో సింహం కూడా వుంది. అదే ఎగ్జిబిటర్. సినిమాకు అడ్వాన్స్ చెల్లించినపుడు లేదా కొనుగోలు చేసినపుడు డిస్ట్రిబ్యూటర్ తన ఇంట్లోంచే మొత్తం డబ్బులు తెచ్చి ఇవ్వడు. థియేటర్ల నుంచి అంటే ఎగ్జిబిటర్ల నుంచి అడ్వాన్స్ లు తీసుకుని, వాటని పూలప్ చేసి నిర్మాతకు ఇస్తాడు. థియెటర్లో సినిమా ఆడినపుడు, ఈ అడ్వాన్స్ అంతా రికవరీ చేసుకుని, ఆపైన వచ్చే మొత్తాన్నే డిస్ట్రిబ్యూటర్ కు పంపిస్తాడు. ఆ మొత్తాలు వస్తే తప్ప డిస్ట్రిబ్యూటర్ నిర్మాతకు సెటిల్ చేయడం కుదరదు.
ఈ టోటల్ సినేరియాలో అన్నీ రూల్స్ ప్రకారం జరగవు. కానీ ముందుగా అగ్రిమెంట్లు అన్నీ పకడ్బందీగా వుంటాయి. నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్ కు అగ్రిమెంట్ వుంటుంది. డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్ కు అగ్రిమెంట్ వుంటుంది. కానీ ఇది కేవలం అగ్రిమెంట్ వరకు మాత్రమే. నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఇచ్చి సినిమా ఫ్లాప్ అయిన తరువాత నష్టపోయాను వెనక్కు డబ్బులు ఇవ్వమని అడిగే హక్కు డిస్ట్రిబ్యూటర్ కు వుండదు. నిర్మాత ఇంటి మీదకు వచ్చి కూర్చునే హక్కు లీగల్ గా అయితే వుండదు.
కానీ పవన్ అజ్ఙాతవాసి సినిమా టైమ్ లో నిర్మాతలు మంచి తనానికి పోయి, కొంత మొత్తం వెనక్కు ఇచ్చారు. ఇక అక్కడి నుంచి అదో ప్రాక్టీస్ అయిపోయింది. నష్టాలు వస్తే కనీసం ఇరవై శాతం వెనక్కు ఇవ్వాలనే అనధికార ఆనవాయితీ మొదలైంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు ఓ విధంగా ధీమా వచ్చేసింది. హారిక సంస్థ కదా వెనక్కు ఇస్తారులే…మైత్రీ ఆర్గనైజేషన్ కదా వెనక్కు ఇవ్వకుండా వుండరులే అనే ధీమా మొదలైంది. దాంతో సినిమాకు వాళ్లు కోట్ చేసినంతా పంపడం అలవాటు అయిపోయింది.
ఇలా నాన్ రిటర్న్ బుల్ అడ్వాన్స్ అగ్రిమెంట్ వున్నా కూడా అది కాగితం ముక్క కిందకే మిగిలిపోయింది. నిజానికి లీగల్ గా చూసుకుంటే నిర్మాత ఇవ్వకున్నా డిస్ట్రిబ్యూటర్ చేసేది లేదు. కానీ ఇక్కడ ఛాంబర్, కౌన్సిల్ లాంటి పెద్ద మనుషుల సంఘాలు మధ్యవర్తులుగా వుండి సెటిల్ మెంట్ లు చేయడంతో, ఇక ఈ అగ్రిమెంట్ లకు అంత విలువ లేకుండా పోయింది.
ఆచార్య నుంచీ..
ఇలాంటి నేపథ్యంలో ఆచార్య సినిమా మరో కొత్త సంప్రదాయానికి తెరతీసింది. అప్పటి వరకు నిర్మాతల ఆఫీసు మీదకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే వచ్చేవారు. తొలిసారి ఎగ్జిబిటర్లు బయల్దేరి నిర్మాత మీద దండెత్తారు. ఎగ్జిబిటర్లు కూడా రకరకాలుగా డిస్ట్రిబ్యూటర్ కు డబ్బులు ఇస్తారు. మినిమమ్ గ్యారంటీ, ఫిక్స్ డ్ హయ్యర్లు, అడ్వాన్స్ లు, ఇలా రకరకాలుగా, ఇవి కాక థర్డ్ పార్టీలు కూడా వుంటాయి. సినిమా మీద క్రేజ్ చూసి, కనీసం ఇంత బిజినెస్ అవుతుందని లెక్కలు కట్టి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర సినిమా కొనుక్కునే రకాలు. నిజానికి వీరెవ్వరితో నిర్మాతకు సంబంధం వుండదు. వారెవరో అస్సలు తెలియదు.
ఆచార్య టైమ్ లో డిస్ట్రిబ్యూటర్లు వీరందరినీ తీసుకుని కొరటాల శివ ఆఫీసు మీదకు దండెత్తారు. నిజానికి లీగల్ గా వెళ్లి వుంటే వీరంతా ఇబ్బందుల్లో పడి వుండేవారు. కానీ కొరటాల మంచి తనానికి పోయి, కొంత మొత్తం వెనక్కు ఇవ్వడానికి రాయబారాలు జరిపి ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే ఆనవాయితీ గా మారుతున్నట్లు కనిపిస్తోంది.
పూరి జగన్నాధ్ లైగర్ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్ల విషయంలో వివాదం లేదు. ఎందుకంటే వారి తరపున దిల్ రాజు, ఆసియన్ సునీల్ మాట్లాడుతున్నారు. తనకు రావాల్సిన నాన్ థియేటర్ మొత్తాలు రాగానే డిస్ట్రిబ్యూటర్ లకు సెటిల్ చేస్తా మన్నారు. కానీ ఇక్కడ తకరారులు చాలా వున్నాయి. సినిమా రకరకాలుగా చేతులు మారింది. వరంగల్ శ్రీను నుంచి చదలవాడ శ్రీనివాసరావు, ఫైనాన్సియర్ శోభన్, ఆసియన్ సునీల్ వరకు చాలా మంది ఇన్ వాల్వ్ అయి వున్నారు. ఈ లింకులు అన్నీ విప్పాల్సి వుంది.
ఇలాంటి నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, ధర్డ్ పార్టీలు తన నష్టం సంగతి ఏమిటి అని గొంతు ఎత్తడం ప్రారంభించాయి. నిజానికి అది కొంత వరకు సబబే. నష్టం వచ్చింది కనుక ఆందోళన చెందడం సహజం. కానీ ఇందులో లీగాలిటీ ఎంత వరకు అన్నది చూడాలి. వీరు ఎవరి వద్ద కొన్నారు. ఎవరికి డబ్బులు ఇచ్చారు..ఎవరిని అడగాలి? ఎవరి ఆఫీసు మీదకు వెళ్లి కూర్చోవాలి?
'ఎ' అనే వాడి దగ్గర 'బి' అనే వాడు అప్పుడు తీసుకున్నాడు. కానీ ఆ 'ఎ' అనేవాడు 'సి' అనేవాడి దగ్గర అడిగి తెచ్చి 'బి' కి ఇచ్చాడు. ఇప్పుడు 'బి' అనేవాడు అప్పు ఎగ్గొడితే అడిగే హక్కు 'ఎ' అనేవాడికి వుంటుంది కానీ 'సి' అనేవాడికి కాదు. ఈ మాత్రం లాజిక్ ను టాలీవుడ్ గాలికి వదిలేసింది. మంచితనం లేదా ఓ కట్టుబాటు అనే దానికి లొంగి వ్యాపారాలు సాగించడం అన్నది తప్పు అవుతోంది. సినిమా అనేది కూడా స్పెక్యులేషన్ వ్యాపారమే. బాగుంటుంది అనే నమ్మకంతో జరుగుతుంది.
ఇటీవల రకరకాల కంపెనీలు షేర్ మార్కెట్ కు వచ్చాయి. బాగుంటుందని భయంకరంగా పెట్టుబడులు పెట్టారు. ఆ షేర్లు అన్నీ కుదేలు అయ్యాయి. ఎవరి ఇంటకి వెళ్లి కూర్చుంటున్నారు ఇన్వెస్టర్లు అంతా? లబో దిబో అన్నడం తప్ప చేసేది లేదు.
దిల్ రాజు కరెక్ట్
నిర్మాత..డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అయిన దిల్ రాజు ఈ మధ్య ఓ మాట అన్నారని ఇండస్ట్రీలో వినిపిస్తూ వుంటుంది. తాను ఇకపై సినిమాలు ఎన్ ఆర్ ఐ చేయను అని, అవుట్ రేట్ కు కొంటానని, లాభమైనా, నష్టమైనా తానే భరిస్తా అని అన్నారన్నది ఆ ప్రచారం. నిజానికి ఇదే కరెక్ట్. ఎలాగూ నష్టపోతున్నపుడు ఈ ఎన్ ఆర్ ఐ సిస్టమ్ ఎందుకు? అంత కష్టపడి రిస్క్ చేసి పదిశాతం, ఇరవై శాతం కమిషన్ ఎందుకు..శుభ్రంగా లాభాలు తినక.
ఇప్పటికైనా టాలీవుడ్ బిజినెస్ స్వరూపం మారాల్సి వుంది. అగ్రిమెంట్ లకు విలువ వుండాలి. థర్డ్ పార్టీలు, కింద స్థాయిలో విక్రయించడాలు అలాంటివి కూడా ఓ పక్కా అగ్రిమెంట్ ప్రకారం జరగాలి. ప్రతి అగ్రిమెంట్ లొ కూడా లాభ నష్టాల ప్రస్తావన వుండాలి. ఇలా వుంటేనే ఎవరికైనా బాధ్యత వుంటుంది. ఏదైనా లీగల్ గా వుండాలి తప్ప, దాడి, దండెత్తడం, నిరసన రూపంలో కాదు.
ఇవ్వాళ లైగర్ కావచ్చు..రేపు మరే సినిమా అయినా కావచ్చు. ఎట్ లాస్ట్ ఏదైనా బిజినెస్. బిజినెస్ అన్నాక లాభం వుంటుంది..నష్టం వుంటుంది. రిస్క్ కూడా వుంటుంది. ఈ రిస్క్ కు సిద్దపడే వ్యాపారం చేయాలి. కానీ టాలీవుడ్ లో ఈ రిస్క్ అన్నది మరీ రాను రాను తారా స్థాయికి చేరిపోతోంది. స్వల్పకాలంలో అధికలాభాలు సంపాదించే అవకాశం వుండడం వల్లే ఈ రిస్క్ కూడా అంతకు అంతా పెరిగిపోతోంది. అందరూ కలిసి ఈ రిస్క్ ను తగ్గించి, వ్యాపారాన్ని ఉభయతారకంగా లాభసాటిగా వుండేలా మార్చాల్సి వుంది.
ఇక్కడ ఇంకో గమ్మత్తు కూడా వుంది. ఇదంతా సినిమా పెద్దలకు తెలియంది కాదు. పరిష్కరించలేనిది కాదు. కానీ ఇక్కడ మరో తెరవెనుక మర్మం కూడా వుందని వినిపిస్తోంది.
థియేటర్లు నడపలేక, గిట్టుబాటు కాదని వదిలేస్తుంటే ఒక్కొకటి తమ చేతుల్లోకి తీసుకుని, టోటల్ టాలీవుడ్ ను నియంత్రిస్తున్న వారు వున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ ను సిండికేట్ చేసి నియంత్రించడం, కాపీ లెవెల్ లో కొనేసి పంచుకోవడం మొదలైంది..ఇలా అన్ని వ్యవస్థలు అనార్గనైజ్డ్ గా, కంగాళీగా మారిపోతే, నిర్మాతలు ఈ బడాపీపుల్ కు సినిమా చేతిలో పెడితే బెటర్ అనే భావనకు వచ్చే అవకాశం వుంది. అందువల్ల ఇప్పుడున్న ఈ వ్యవస్థ ఇలా ఎంత వరకు గజిబిజి అవుతుందో కానివ్వడమే బెటర్ అనే తెరవెనుక అజెండా వుందని చెబుతున్నవారూ టాలీవుడ్ లో వున్నారు.
విఎస్ఎన్ మూర్తి