నేను నిలిస్తే ఎలా వుంటుంది?…ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడు నరేన్ రామాంజనేయరెడ్డి ఆరా తీస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని, కుమారుడిని తీసుకురావాలని రవీంద్రనాథ్‌రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారుడిని చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకున్నారు.
కుమారుడిని కమలాపురం నియోజకవర్గ ప్రజలకు రవీంద్రనాథ్‌రెడ్డి పరిచయం చేస్తున్నారు. అవకాశం ఉన్న చోటికల్లా కుమారుడిని వెంట తీసుకెళుతున్నారు. అయితే ఈ దఫా వారసులకు టికెట్ లేదని, మీరే నిలబడాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు వైఎస్ జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రచారం జరుగు తోంది. దీంతో కమలాపురంలో జగన్ మేనమామ కుమారుడు నరేన్ నిలుస్తారా? లేదా? అనే చర్చకు తెరలేచింది.
కమలాపురం నుంచి రవీంద్రనాథ్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకు ముందు ఆయన జెడ్పీ వైస్ చైర్మన్‌గా, కడప మేయర్‌గా పని చేశారు. ఇప్పటికీ ఆయన్ను మేయర్‌గానే గుర్తిస్తారు. ఇదిలా వుండగా కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలనే ప్రయత్నాల్ని రవీంద్రనాథ్‌రెడ్డి వేగవంతం చేశారని సమాచారం. వడ్డించే వాళ్లు మన వాళ్లైతే అనే చందంగా… రవీంద్రనాథ్‌రెడ్డి కుమారుడికి టికెట్ తెచ్చుకోవడం కష్టమేమీ కాదంటున్నారు.
కానీ రానున్న ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. ప్రతి నియోజకవర్గంలో గెలిచి తీరాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. కావున అనుభవం లేదనే కారణంతో వారసులకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిది ఏమీ లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు తమ వారసులను బరిలో దింపేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో కమలాపురం ఎమ్మెల్యే కుమారుడు నరేన్ తాను నిలిస్తే ఎలా వుంటుందని నియోజకవర్గంతో పాటు విద్యావంతులు, మేధావులను ఆరా తీస్తున్నారని సమాచారం. టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఫలితం వుంటుందని అతనికి ఎక్కువ మంది చెబుతున్నారని తెలిసింది. అందుకే టీడీపీ అభ్యర్థి ఎవరో తెలుసుకునేందుకు నరేన్ ఆసక్తి చూపుతున్నారు.