వీరగంధము దెచ్చినారము.. వీరు డెవ్వడొ తెల్పుడీ!
పూసి పోదుము, మెడను వైతుము.. పూలదండలు భక్తితో!!
..అని పాట పాడడం ఒక్కటే తక్కువ. ఆ పాటలో పాపం.. ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి చౌదరి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కీర్తించే ప్రయత్నం చేస్తే.. అంతకంటె మిన్నగా ఆకతాయి బజారు రౌడీలను కీర్తించి తరించడానికి జనసేన అగ్ర నాయకులు క్యూకట్టి మరీ ఎగబడుతున్నారు.
జనసైనికులు, వీరమహిళలు లాంటి ట్యాగ్ లైన్లు తగిలించుకున్న రౌడీ మూకలు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో మంత్రుల మీద దాడికి తెగబడిన సంగతి స్పష్టం. ఎయిర్ పోర్ట్ లో ఉండే సీసీ కెమెరాల ఫుటేజీల సాక్షిగా ఇలాంటి దుండగులు తప్పించుకోవడం అనేది అసాధ్యం. దానికి తగ్గట్టుగానే వారిని పోలీసులు అప్పుడే అరెస్టు చేశారు. కాకపోతే.. వారికి బెయిల్ రాగానే.. జనసేన నాయకులు మొత్తం పండగపండగ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
బెయిల్ మీద బయటకు వచ్చిన వారిని అభినందిస్తూ, ఆరాధిస్తూ జనసేన నాయకులు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే మరీ ఎబ్బెట్టుగా అనిపిస్తోంది, చీదర పుడుతోంది. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం, వారికి దన్నుగా నిలవడం, వారు చిన్న చిన్న తప్పులు చేసినా వెనకేసుకు రావడం ఏ పార్టీ నాయకులకైనా తప్పదు. కానీ అందులో కూడా హద్దులుంటాయి. అలాంటివేమీ ఎరగం అన్నట్లుగా జనసేన నాయకులు.. తమ ఎయిర్ పోర్ట్ గూండాలను భుజానికెత్తుకుని ఊరేగుతున్నారు. వారి హీరోయిజాన్ని వేనోళ్ల కీర్తించడంలో తరించిపోతున్నారు.
వారు బయటకు వచ్చినప్పటినుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగేంద్రబాబు (అంతేలే.. చెప్పుకోడానికి ఆ పార్టీలో ఆ ముగ్గురూ తప్ప మరొక నాయకుడు లేరు!) అందరూ దడికట్టి మరీ వారిని అభినందిస్తున్నారు. విశాఖపట్టణం సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులలో, వీరమహిళల్లో స్ఫూర్తిని పెంచాయట. వాళ్ల తెగింపు, గుండెధైర్యం చూసి.. రాష్ట్రమంతా ఉప్పొంగిపోతోందట.
అందరు కార్యకర్తల గుండెబలం టన్నుల్లో పెరిగిపోతోందంట.. ఇలా అరెస్టయి బెయిలుపై బయటకు వచ్చిన వారి ఆకతాయి బజారురౌడీ చేష్టలను ఆ పార్టీ సమర్థించుకుంటోంది. వారి పనులు, రాళ్లు విసరడం, చేతికి అందిన ఆయుధాలతో చంపడానికి తెబడడం వంటివి.. మిగిలిన అందరు జనసైనికులకు స్ఫూర్తిదాయకం అనడం ద్వారా ఈ నాయకులు రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల జనసైనికులకు ఏం సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నారు.
పవన్ కల్యాణ్, మనోహర్, నాగబాబు తమను కూడా ఇలా కీర్తించాలంటే.. పొగడాలంటే.. వారి గుడ్ లుక్స్ లో పడాలంటే.. లోకల్ గా తమకు ఏ మంత్రి దొరికినా దాడికి పాల్పడి అరెస్టయితే సరిపోతుందని జనసైనికులు ఒక యాక్షన్ ప్లాన్ కు ఫిక్స్ కాకుండా ఉంటారని గ్యారంటీ ఏమిటి? అలాంటి దుర్ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఒకవైపు 13 మంది వైసీపీ నేతలపై దాడులకు జనసైనికులు స్కెచ్ వేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ నివేదికల్ని ఆడిపోసుకుంటూనే.. విశాఖ రౌడీలు స్ఫూర్తదాతలు అంటూ నాయకులు చేసే ప్రసంగాలు చాలా నీచంగా ఉన్నాయి.