వలసలు కావాలి.. తాయిలాలు పెంచండి!

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నానా పాట్లు పడుతోంది. మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తెలంగాణ మొత్తం భాజపాదే అనే భావన ప్రజల్లో కలిగించాలనేది వారి…

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లో హైప్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు నానా పాట్లు పడుతోంది. మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తెలంగాణ మొత్తం భాజపాదే అనే భావన ప్రజల్లో కలిగించాలనేది వారి తాపత్రయం. అన్ని పార్టీల్లో ఉండే ముఖ్య నాయకులు ఎందరో.. తమను ఆశ్రయిస్తున్నారని, మంత్రులు కూడా బిజెపిలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. కమల నాయకులు చాన్నాళ్లుగా ఊదరగొడుతూ మనుగడ సాగిస్తున్నారు. 

అయితే మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీలోకి కొందరు నాయకులైనా వలస రావడం జరిగితే.. పార్టీ ఇమేజి కాస్త పెరుగుతుంది. అందుకోసం వారు ఇప్పుడు.. ఇతర పార్టీ నాయకులకోసం జల్లెడ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఎన్నిక సమయంలోనే వలసలు చోటు చేసుకోవడం అనేది చిత్రమైన పరిణామం ఏమీ కాదు. తమ పార్టీకి ప్రజాదరణ వెల్లువవుతోందని చెప్పుకోడానికి తగినట్టుగా.. పార్టీలు  ప్రచారసమయంలో ఊరూరా వందల సంఖ్యలో తమ పార్టీలో కార్యకర్తలు చేరుతున్నారని కండువాలు కప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ఒక మాయ. అలాంటిది.. కాస్త అంతో ఇంతో పేరున్న నాయకులు పార్టీలో చేరడం అంటూ జరిగితే.. ఇంకాస్త బజ్ క్రియేట్ అవుతుందనేది వారి కోరిక. చూడబోతే ఇప్పుడు ఆ వలసల అవసరం బిజెపికే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఇటీవలే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఆయన గతంలో భువనగిరినుంచే ఎంపీగా చేశారు. మునుగోడులో ప్రభావం చూపగల నేత అనుకోవచ్చు. కానీ 2019లో ఓడిన తర్వాత.. ఆయన పార్టీలో లూప్ లైన్ లో ఉన్నారన్నది నిజం. అంతో ఇంతో పేరున్న టిఆర్ఎస్ నాయకుడు.. బిజెపిలో చేరేసరికి.. వారు తెగ డప్పు కొట్టుకున్నారు. 

దానికి జవాబుగా టిఆర్ఎస్ కౌంటర్ వలసలకు గేలం వేసింది. ఆ గేలానికి కొన్ని పెద్దచేపలే పడ్డాయి. బిజెపినుంచి దాసోజు శ్రవణ్, రాపోలు ఆనంద భాస్కర్ గులాబీ దళంలో చేరిపోయారు. వారు టెక్నికల్ గా బిజెపిలో ఉన్నప్పటికీ.. ఇన్నాళ్లుగా వాళ్లు పొందిన ప్రాధాన్యమూ లేదు, వారు క్రియాశీలంగా వ్యవహరించినదీ లేదు. ఇలాంటి నేపథ్యంలో.. తెరాసలోకి ఎక్కువ వలసలు అయ్యాయి. 

దీనికి దీటుగా నిలవాలంటే.. టీఆర్ఎస్ నుంచి, కనీసం కాంగ్రెస్ నుంచి అయినా సీనియర్ నాయకులను బిజెపిలోకి వలసలు తీసుకురావడమే మార్గం అని కమలదళం ఆరాటపడుతోంది. అయితే వారి కనుచూపుమేరలో వచ్చి చేరే నాయకులు లేరు. పైకి మంత్రులు కూడా వచ్చేస్తున్నారు, టిఆర్ఎస్ సీనియర్లు అనేకమంది టచ్ లో ఉన్నారు వంటి డైలాగులు వస్తుంటాయి గానీ.. ఆచరణలోకి రావడం లేదు. 

ఎవరో వలసలు వస్తే.. తమకు ఆదరణ పెరుగుతోందని డప్పు కొట్టుకోవచ్చునని వారి ఆశ. కానీ, పోలింగుకు ఇంకా వారం రోజులు మాత్రమే మిగిలిఉన్న నేపథ్యంలో వలసల కోసం నిరీక్షిస్తున్న కమలం కోరిక అంత ఈజీగా తీరేలా లేదు.