మే 14 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం. నిజానికి మనమంతా వలస పక్షులమే. మనుషులు పక్షులుగా మారి చాలా కాలమైంది. మా జనరేషన్ పల్లెలు వదిలి పట్టణాలకి వచ్చింది. మా తర్వాత జనరేషన్ విదేశాలకు వెళ్లిపోయింది. మంచి జీతం కోసం, జీవితం కోసం వున్న ఊళ్లు, దేశాల్ని వదిలి పోతున్నారు.
మనిషి చరిత్రలో ఈ వలసలు ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఎవరికీ తెలియదు. అమెరికా మొత్తం వలస దేశమే. అక్కడున్న స్థానికుల్ని (రెడ్ ఇండియన్స్) ఊచకోత కోసి జెండా పాతారు. ఆ స్వాభావిక లక్షణం వాళ్లకి ఇంకా పోలేదు. అందుకే ప్రపంచం మీద పెత్తనం చేయాలని చూస్తున్నారు.
ఇపుడు అమెరికాలోని అన్ని పట్టణాలు తెలుగు వాళ్లతో నిండిపోయాయి. టంపా (ఫ్లోరిడా)లో విజయవాడ బిర్యాని దొరుకుతుంది. కీవెస్ట్ (క్యూబా బోర్డర్)లో తెలుగు పాటలు వినిపిస్తాయి. అక్కడికి వెళ్లిన వాళ్లెవరూ తిరిగి రారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని లక్షల తెలుగు కుటుంబాలు తమ పిల్లల్ని అమెరికాకి దత్తత ఇచ్చేశాయి.
అక్కడి నుంచి డబ్బులు వచ్చే కాలం పోయి, డబ్బులు తిరిగి వెళ్లే కాలం వచ్చింది. 1980-90 మధ్యన వెళ్లిన వాళ్లు డాలర్లు పంపితే ఇక్కడున్న తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు కొనుక్కున్నారు. వాళ్లు చనిపోయిన తర్వాత ఆ ఆస్తుల్ని ఇక్కడ ఎవరు చూసుకుంటారు? పిల్లలు ఎలాగూ ఇండియా వచ్చి వుండరు. అందుకని అమ్మేసి డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు. వచ్చిన డాలర్లు వెనక్కి వెళ్లే సైకిల్ ప్రారంభమైంది.
ఒకప్పుడు ఊళ్లలో వుండడమే గొప్ప. బయటికెళితే పది మంది పలకరిస్తారు. అదో సంతోషం. హైదరాబాద్‌లో మన పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్లే సరిగా తెలియదు. అందుకని పెద్ద వాళ్లు నగరాలకి వస్తే వుండలేరు. అమెరికాలో పిల్లల దగ్గరికి వెళ్లిన వాళ్లు అనుభవించే బోర్, విసుగు ఇంతింత కాదు.
ఇపుడు ఊరంటే సంక్రాంతికి, దసరాకి వెళ్లే చోటు మాత్రమే. వలస రెండు రకాలు. పనుల కోసం కొన్ని నెలలు వుండి వెనక్కి రావడం. అక్కడే శాశ్వతంగా వుండిపోవడం. వ్యవసాయ కూలీలు వెళ్లి వస్తూ వుంటారు. కార్మికులుగా వెళ్లిన వాళ్లు ఇక తిరిగి రారు. పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. పట్టణాల్లో సంపాదించి, పల్లెలో ఇల్లు గుర్తుగా ఉండాలని కొత్తగా కట్టేవాళ్లు తప్ప, మిగిలిన వాళ్లు ఉన్న వాటినే అమ్ముకుని వెళ్లిపోతున్నారు.
వలసకి ముఖ్య కారణం పిల్లల చదువులు, టౌన్లో వుంటే పిల్లల్ని చదివించుకోవాలనే కోరిక. పిల్లల్ని రైతుల్ని చేయాలని ఎవరూ అనుకోవడం లేదు. వ్యవసాయాన్నే నమ్ముకున్న వాళ్లు వలస వెళ్లిపోతున్నారు. వ్యాపారాల్లో వచ్చిన మిగులు ఆదాయాన్ని వ్యవసాయంలో పెట్టుబడి పెడుతున్న వాళ్లు పెరిగారు. వ్యవసాయం ఆగదు. రూపం మార్చుకుంటూ వుంది, రేపు అంబానీ, ఆదానీ వ్యవసాయ క్షేత్రాలు వస్తాయి. తన భూమిలోనే కూలి వాడుగా రైతు పనిచేస్తాడు.
వలస అనివార్యం. సెంటిమెంట్లు, ఎమోషన్స్ సినిమాల్లో వుంటాయి. జీవితం నుంచి వలస వెళ్లిపోతున్నాయి.
జీఆర్ మహర్షి