ఆధ్యాత్మిక విషయాల సంగతేమో గానీ, లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న స్వామిగా నిత్యానందకు గుర్తింపు. మరోసారి నిత్యానంద స్వామి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాను బతికే ఉన్నానంటూ ఆయన ఉనికి చాటుకునే ప్రయత్నం చేయడం విశేషం. బతికే ఉన్నానని నమ్మించేందుకు ఆయన పరితపిస్తున్నారని అర్థమవుతోంది.
మన దేశంలో యువతులపై లైంగిక దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నిత్యానందస్వామి అనేక మార్లు న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దీంతో చట్టపరమైన శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆయన మూడేళ్ల క్రితం దేశం విడిచి పరరయ్యారు. ఆ తర్వాత ఈక్వెడార్‌కు సమీపంలోని ద్వీపంలో నిత్యానంద తలదాచుకుంటున్నట్టు వార్తలొచ్చాయి.
తానున్న ప్రాంతానికి కైలాస అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. తనకు తానుగా దాన్ని దేశంగా ప్రకటించుకున్నారు. సొంత కరెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా స్వామి భౌతికంగా కనిపించడం లేదు. దీంతో స్వామి అనారోగ్యంతో చనిపోయారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలతో ఖంగుతిన్న నిత్యానంద స్వామి …తన మరణంపై సాగుతున్న ప్రచారాన్ని ఖండించడం విశేషం. స్వామి ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టులో చెప్పిన విషయాలు నమ్మతగ్గట్టు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో ఉన్నట్టు స్వామి పేర్కొన్నారు.
ప్రస్తుతం మాట్లాడలేక పోతున్నట్టు తెలిపారు. మాట్లాడేందుకు కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. మనుషులు, పేర్లు, ప్రాంతాలను గుర్తించలేకపోతున్నట్టు ఆయన వివరించారు. 27 మంది వైద్యులు తనకు వైద్యం చేస్తున్నట్టు చెప్పడం విశేషం. స్వామి పేరుతో ఆయన మనుషులు ఈ పోస్ట్ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
మనుషులను, పేర్లను, ప్రాంతాలను గుర్తించలేని నిత్యానంద స్వామి తన మరణంపై సాగుతున్న ప్రచారాన్ని మాత్రం ఎలా ఖండిస్తున్నారు? అలాగే 27 మంది వైద్యులు చికిత్స చేయడం ఏంటి? మరోవైపు సమాధిలో ఉన్నట్టు చెప్పడం ఏంటి? అంతా గందరగోళంగా ఉంది.
ఇంతకూ నిత్యానంద స్వామికి ఏమైంది? ఆయన ఎక్కడున్నట్టు? అనే ప్రశ్నలు మాత్రం సోషల్ మీడియాలో వెల్లువెత్తడం గమనార్హం.