అంబాని రెండో కొడుకు అనంత్ అంబాని పెళ్లి వేడుకల గురించి తెలియనివాళ్లు ఇంచుమించు ఉండరు. ఉన్నారంటే వాళ్లు సోషల్ మీడియాతోటి, అసలు ప్రపంచంతోటి సంబంధం లేకుండా బతుకుతున్నట్టే.
అనంత్ అంబానిది ఆ ఇంట్లో చివరి పెళ్లి. ఇప్పటికే అమ్మాయి ఇషా, పెద్దబాయి ఆకాష్ పెళ్లిళ్లు చేసేసారు. ఇంట్లో చివరి పెళ్లి వేడుక కనుక..ఎంత ఘనంగా వీలైతే అంత ఘనంగా చేసుకుంటున్నారు అంబానీ కుటుంబం.
మార్చిలో ప్రీ వెడ్డింగ్ పార్టీతో మొదలైన వేడుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జూకర్ బెర్గ్ లాంటి ప్రపంచ కుబేరులంతా వచ్చి సందడి చేసారు. ప్రపంచ ప్రఖ్యాత రిహానా వచ్చి తన గాన ప్రదర్శన ఇచ్చింది. గుజరాత్ లోని జాం నగర్ విమానాశ్రయానికి ఆ వేడుక వల్ల కొత్త జీవం వచ్చింది.
అంబాని కుటుంబం తాజాగా 50 మంది పేద జంటలకి దగ్గరుండి ఘనంగా పెళ్లిళ్ళు జరిపించి ఒక్కో జంటకి మంగళసూత్రాలు మొదలైన ఖర్చులతో పాటు లక్ష రూపాయల నగదు, కొత్త కాపురం పెట్టడానికి సమానులు వగైరాలన్నీ ఇచ్చారు. నిండైనా విందు భోజనాలు ఏర్పాటు చేసారు.
ఇక కొత్తగా ప్రపంచప్రఖ్యాత జస్టిన్ బీబర్ దిగాడు పెళ్లి వేడుకలో తన ప్రదర్శన ఇవ్వడానికి. ఎప్పటిలాగానే బాలీవుడ్ ప్రముఖుల సందడి, వాళ్లు వేసుకునే దుస్తుల వివరాలు అన్నీ మీడియాలోకొస్తున్నాయి.
వరుడు అనంత్ అంబాని డ్రెస్ ఖరీదు ఇంత, వధువు రాధికా మర్చంట్ చీర ఖరీదు అంత..అంటూ వార్తలొస్తున్నాయి. వాళ్ల హంగులు, ఆర్భాటాలు అన్నిటి లెక్కలు ప్రచారమవుతున్నాయి.
ఇదంతా చూసి సన్నాయి నొక్కులు నొక్కుతున్న అర్భకులు చాలామంది సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు.
ఒకడేమో ఇదంతా శుద్ధ వేస్ట్ అని, అనవసరపు ఆర్భాటమని, పెళ్లిళ్లు ఆర్య సమాజంలోనో, రిజిస్టర్ ఆఫీసులోనో సింపుల్ గా చేసుకుని ఆదర్శంగా నిలవాలని స్వీయ దారిద్ర్య పాఠాలు చెబుతున్నాడు.
ఒకడైతే “ఇంత ఆర్భాటాలకి డబ్బు తగలేసే బదులు పేదలకి అన్నదానం చేయొచ్చుగా” అని సూక్తి వల్లిస్తున్నాడు..అక్కడికి అంబానీ ఏదో చేయనట్టు. మార్చ్ ఉంచి నేటి వరకు నిత్యం ఏదో ఒక కారణంతో అంబానీ చేతుల మీదుగా పేదలకి అన్నాదానాలు జరుగుతూనే ఉన్నాయి.
ఇంకొక అర్భకుడైతే, “పెళ్లి కదా..మొదట్లో సందడి బాగుంది..ఆశ్చర్యం వేసింది. తరువాత కాస్త విసుగేసింది. ఇప్పుడు చిరాకు వేస్తుంది.. రేపు అసహ్యం వేస్తుంది. పెళ్లి అనేది ఇద్దరి మనస్సుల కలయిక.. అంతేగాని ఏమి చేస్తున్నామో తెలియక, ఎలా ఖర్చు పెడుతున్నామో అర్ధం గాక…ఏంటిది. వేస్ట్” అంటున్నాడు.
వాళ్ల వీడుక చూసి వీడిక అసహ్యం వేస్తోందట. ఇది ఏడుపు కాక ఏవిటి?
వాళ్లకి డబ్బుంది ఖర్చు పెడుతున్నారు, పబ్లిసిటీ సరదా ఉంది చేసుకుంటున్నారు! వాళ్లు డబ్బుని కుప్పగా పోసి తగలబెట్టట్లేదు కదా, “వేస్ట్” అని ఏడవడానికి!! వేడుకలో భాగమైన ప్రతి సెర్వీస్ ప్రొవైడర్ కి డబ్బిస్తున్నారు..అలా ఆ కంపెనీలు, కుటుంబాలు బతుకుతున్నాయి. డబ్బు బయటికి తీసినప్పుడే ఎకానమీ బలపడుతుంది.
అందుకే ఎవరి శక్తి కొలది వాళ్లు ఖర్చు చేయాలన్నది ప్రాధమిక ఆర్ధిక సూత్రం. అంతే తప్ప ఈ సోషల్ మీడియా శక్తిహీనులు చెబుతున్నట్టు డబ్బున్నా దాచుకుని సింపుల్ గా అర్యసమాజ్ పెళ్లి చేసుకోవడం వెనుకబాటు తనానికి, దేశ ఆర్ధిక పతనానికి చిహ్నం.
అయినా అంబాని ఖర్చు పెడుతున్నది కుళ్లుతో రగిలిపోయే ఈ జిడ్డుబేరాలకి పెద్ద అమౌంట్ లా కనిపించవచ్చేమో కానీ అసలు అంబానీకి అది ఒక లెక్క కూడా కాదు.
ఎందుకో చూద్దాం…
అంబానీ ఆస్తి ఏడున్నర లక్షల కోట్ల పైమాటే. ఈ పెళ్లికి ఖర్చు చేస్తున్నది దాదాపు 5000 కోట్లు. ఈ అంకెలు వాటి పక్కన సున్నాలు ఎన్నో లెక్కేసుకునే పని పెట్టుకోకుండా సింపుల్ గా ఆ చివరున్న “కోట్లు” అనే పదాన్ని తీసేసి చూడండి.
ఏడున్నర లక్షల రూపాయలున్నవాడు 5000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అన్నమాట.
మన దగ్గరే ఏడున్నర లక్షలుండి, పెళ్లి ఖర్చు ఐదు వేలంటే ఎలా ఫీలవుతాం? బహుశా అంబాని ఫీలింగ్ అలాగే ఉండొచ్చు. తన ఆస్తిలో 0.006 శాతం ఖర్చు చేస్తున్నాడన్నమాట. ఎంత తక్కువో చూడండి.
కోటి రూపాయల ఆస్తి ఉన్న వ్యక్తులు తన ఇంట్లో పెళ్లి కోసం కేవలం వేడుకకే కనీసం పది-పదిహేను లక్షలు ఖర్చు పెడుతున్నారు.
పది కోట్లు ఉన్నవారు ఈజీగా 50 లక్షల నుంచి కోటిన్నర వరకు పెళ్లికి ఖర్చుపెడుతున్నారు. అంటే వారి నెట్ వర్త్ లో దాదాపు 10-15 శాతం.
అలా జనం ఖర్చు పెడుతుండబట్టే ఎన్నో రంగాలు నిలబడుతున్నాయి. పూలమ్మే వాళ్లు, క్యాటరింగ్ కంపెనీలు, ఫోటోగ్రాఫర్లు, డెకరేషన్ వాళ్లు, చీరల షాపులు, బంగారం షాపులు…ఒకటా రెండా..పెళ్లిళ్ళ మీద ఆధారపడిన వ్యాపారాలు లెక్కలేనన్ని. ఆ వ్యాపారాలని ఆశ్రయించుకుని ఉన్న ఉద్యోగులకి, పనివాళ్లకి అందరికీ ఉపాధే కదా!
ప్రతివాడు ఆదర్శవివాహం టైపులో ఆర్యసమాజం, రెజిస్టర్ ఆఫీసుల్లో పెళ్లిళ్లు కానిచ్చేస్తే ఈ వ్యాపారాలన్నీ ఏమవ్వాలి? ఆదర్శ వివాహాలంటే నిరుద్యోగానికి, ఉపాధి లేని తనానికి బాట వేయడం కాదు కదా.
ఈ లెక్కన చూస్తే ముకేష్ అంబాని తన నెట్ వర్తులో కేవలం 0.006 శాతం మాత్రమే ఈ పెళ్లికి ఖర్చు చేస్తూ చాలా పొదుపుగా, ఒక రకంగా చెప్పాలంటే పిసినారి తనంగా ఖర్చు పెడుతున్నాడు అని అనుకోవాలి.
ఖర్చు పెట్టడానికి డబ్బున్నవాడు, అది లేకపోయినా ఆర్ధిక శాస్త్ర సూత్రాలు తెలిసినవాడు అంబాని ఇంటి పెళ్లి ఖర్చు చూసి ఏడవడు. ఎటొచ్చీ డబ్బు లేదని ఆత్మన్యూనత ఉండి, ఆపైన అజ్ఞానం కలగలిసినవాళ్లే సోషల్ మీడియాలో పిచ్చి ఏడుపులు ఏడుస్తూంటారు. వాళ్ళ అశక్తతని ఏదో కుహనా మేథావిరకం పోస్టులు పెట్టి కామెంట్ల కోసం ఎదురు చూస్తుంటారు. వారిలాగే మానసిక దరిద్రంతో కొట్టుమిట్టాడే ఇంకొందరు వాళ్ళకి జతకలిసి ఆ డిస్కషన్ ని పొడిగించుకుని కాలక్షేపం చేస్తారు. అదొక రిగ్రెసివ్ కల్ట్ గ్రూప్.
ఇక్కడొక చిన్న కొసమెరుపు. సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపించిన విషయం. ఒక సుప్రసిద్ధ సంగీత దర్శకుడు కూడా ఈ అంబాని పెళ్లి గురించి సన్నాయి నొక్కు ఒక్కటి నొక్కాడట.
“ఈ రిహానాలు, జస్టిన్ బీబర్లు ఏవిటి? ఇక్కడ ఆర్టిష్టులు లేనట్టు. అంత డబ్బుని అలా విదేశీయులకి ధారపోస్తే ఏలా?” అని వాపాయాడట గ్లాసులో ఉన్నదాన్ని గుటకేస్తూ.
పక్కనే ఉన్న తన మిత్రుడు, “మీరు ఇలా అమెరికా డ్యూటీ ఫ్రీలో కొనుక్కున్న మందు కాకుండా, ఇక్కడ దొరికే లోకల్ గుడుంబా తాగి ఈ మాట అనుంటే బాగుండేది” అని చురక వేసాడట.
అదన్నమాట. దేని విలువ దానిది. దేని మోజు దానిది. దేని లెక్క దానిది. ఈయన గారికి అవకాశం రాలేదన్న బాధని ఇలా పరోక్షంగా వ్యక్తీకరించాడని అర్ధం చేసుకోవాలంతే!