Advertisement

Advertisement


Home > Politics - Opinion

అమెరికాలో కుప్పకూలుతున్న రియల్ ఎస్టేట్

అమెరికాలో కుప్పకూలుతున్న రియల్ ఎస్టేట్

పెరుగుట విరుగుట కొరకే అని సామెత. అయినా కూడా భూమి, బంగారం ధరలు పెరగనున్నాయనగానే గబగబా పెట్టుబడులు పెట్టేస్తాం. తీరా అంతా పెట్టాక పెరిగినట్టే పెరిగి ఢమాల్న పడడం కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరుగుతోంది అమెరికాలో. 

మూడేళ్ల క్రితం ఎటువంటి భారీ పెరుగదల సూచనలు లేని కాలంలో మామూలుగా ఇల్లు కొనుక్కున్నవాళ్లు అమాంతం రియలెస్టేటులో అనూహ్యమైన పెరుగుదల రావడంవల్ల విపరీతంగా లాభపడ్డారు. 

కొన్ని ప్రాంతాల్లో పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగింతలు పెరిగిపోయింది భూమి విలువ. అది చూసి పెరుగుతున్న ట్రెండులో చాలామంది కొంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రియలెస్టేట్ తిరోగమనం చూస్తోంది. 

పెరిగిన ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న ఆర్ధిక మాంద్యం, వడ్డీ రేట్లు పెరగడం మొదలైన కారణాలవల్ల ఒక బబుల్ లాగ పెరిగిన రియలెస్టేట్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉంది. ఒక అంచనా ప్రకారం గత ఆర్నెల్లుగా ఇళ్లు కొంటున్నవాళ్లు కనీసం సగానికి పైగా నష్టపోయే అవకాశముందంటున్నారు పలు చోట్ల. ఈ విషయాన్ని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. 

అధిక వడ్డీ రేట్ల వల్ల ఒక్కసారిగా ఇల్లు కొనాలన్న సరదా చాలామందిలో ఆరిపోయింది. ఫలితంగా రియాల్టర్లు గుడ్లు తేలేస్తున్నారు. కొనుగోలు దారులు లేక వాళ్లకి పెట్టుబడుల్లోంచి బయటపడే దారులు ఇప్పట్లో కనపడట్లేదు. అమెరికా రియలెస్టేట్ లో ఈ స్థాయి తిరోగమనం 1985 తర్వాత ఇదే కాబోతోందంటున్నారు మరి కొందరు నిపుణులు. 

ఇప్పటికే 13% మంది బిల్డర్లు వినియోగదారుల్ని ఆకర్షించడానికి గత నెల డిస్కౌంట్లు కూడా ప్రకటించారు. కానీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. 

అంతర్జాతీయ కారణాల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి వడ్డీ రేట్లు పెంచితే అది కాస్తా రియలెస్టేట్ నెత్తిన పడింది. 

పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే అమెరికన్ రియలెస్టేట్ కోలుకోవడానికి చాలా సమయం పట్టేలాగే ఉంది. ఎందుకంటే కోర చాపిన ఆర్ధికమాంద్యం మన ముందుంది. దానిని ఎదుర్కుని తేరుకుంటే తప్ప మళ్లీ రియలెస్టేట్ వైపుకి దేశవాసులు చూడరు. 

సంజయ్ అప్పసాని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?