సీరియస్‌గా ఆలోచించాల్సినవి వదిలేసి గతం గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తవ్వుకుంటున్నారు. బాబులో వెనక చూపే తప్ప ముందు చూపు కొరవడిందనేందుకు ఆయన తాజా వ్యాఖ్యలే నిదర్శనం. అది కూడా అనవసరమైన, ఊహాజనిత అంశాల్ని పట్టుకుని వేలాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తానేదో హైదబాద్‌ను నిర్మించిన గొప్ప పాలనాదక్షుడిగా తనకు తాను ఊహించుకుంటూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేయడం ఆయనకే చెల్లింది. 2004లో జగనే సీఎంగా బాధ్యతలు తీసుకుని వుంటే తాను నిర్మించిన మహానగరం హైదరాబాద్ ఏమయ్యేదో అంటూ, ప్రస్తుతం అమరావతిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అయితే 2004లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టి అభివృద్ధి పనుల్ని కొనసాగించారని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ఏమన్నారో తెలుసుకుందాం…
“ప్రస్తుతం రాష్ట్రంలో అన్నీ కూల్చేస్తున్న, ప్రాజెక్టులు ఆపేస్తున్న జగన్ లాంటి వ్యక్తి 2004లో నా తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్ పరిస్థితి ఏమయ్యేదో? టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హైటెక్ సిటీ, ఐఎస్‌బీ వంటి వాటిని కూల్చేసి, శంషాబాద్ విమానాశ్రయం, అవుటర్ రింగ్‌రోడ్డు వంటి ప్రాజెక్టులను నిలిపివేసి ఉండేవారేమో! నా మీద కక్షతో రాజధాని అమరావతిని శ్మశానం చేయాలని చూస్తున్న జగన్‌కు అప్పట్లో సీఎంగా అవకాశం వస్తే హైదరాబాద్‌ను ఎంత నాశనం చేసేవారో” అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
ఊహాజనిత అంశాల్ని పట్టుకుని వేలాడడం అంటే ఇదే. ఇలాంటి అనవసర విషయాలపై చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారో పార్టీ శ్రేణులకే అర్థం కావడం లేదు. తన తర్వాత ఏంటి? అని చంద్రబాబు ఆలోచించాల్సిన, ఆవేదన చెందాల్సిన విషయాలు వేరే వున్నాయి. ముందు 2024లో టీడీపీని అధికారంలో తీసుకురావడం ఎలా అంశంపై చంద్రబాబు దృష్టి పెట్టాలి. తన తర్వాత టీడీపీని నడిపించే రథసారథి ఎవరనే విషయమై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి పెట్టాలి.
తన తర్వాత టీడీపీని వారసుడు నారా లోకేశ్ ఏం చేస్తారో చంద్రబాబు ఆలోచించాలి. ఇప్పటి వరకూ లోకేశ్ ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలేవీ ఆ పార్టీని కాపాడుతారనే నమ్మకాన్ని, భరోసాని చంద్రబాబుకు, పార్టీ శ్రేణులకి ఇవ్వలేదన్నది వాస్తవం.
అసమర్థుడైన కుమారుడి చేతిలో పార్టీని పెట్టడమా? లేక సమర్థుడైన మరో నాయకుడికి టీడీపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించడమా? తన తర్వాత ఆలోచించాల్సిన అంశాలు ఇవి. తనది 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని, దేశానికి, రాష్ట్రానికి అది చేశాను, ఇది చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు… టీడీపీ భవిష్యత్ రథసారథిని ఎందుకు తయారు చేయలేకపోయారనేది బేతాళ ప్రశ్నగా మిగిలింది.
జగన్‌ను విమర్శించడానికి వేరే విషయాలు చాలా వున్నాయి. ఇందుకోసం 2004 వరకూ వెళ్లాల్సిన పనిలేదు. చంద్రబాబు ఇప్పటికైనా తన తర్వాత టీడీపీ భవిష్యత్ ఏంటనే అంశంపై దృష్టి పెట్టాల్సి వుంది. ఎందుకంటే చంద్రబాబు ఉన్నంత వరకే టీడీపీ అనే ప్రచారం బలంగా సాగుతోంది. ఇలాంటి ప్రచారానికి ప్రధాన కారణం… చంద్రబాబు తర్వాత పార్టీని నడిపే సమర్థవంతమైన నాయకత్వం జనానికి కనిపించకపోవడమే. ముఖ్యంగా నారా లోకేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, చేజేతులా ప్రత్యర్థులకు అధికారాన్ని అప్పగించినట్టే అనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టడమా? లేక లోకేశ్ చేతిలో పెట్టి శాశ్వతంగా సమాధి కట్టడమా? చంద్రబాబు ఆలోచించాలి. లోకేశ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వడం అంటే టీడీపీ వినాశనానికి చంద్రబాబు శంకుస్థాపన చేసినట్టే. లోకేశ్ కాకుండా టీడీపీ భవిష్యత్ నాయకుడు ఎవరు? అని చంద్రబాబు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. అలా కాకుండా అప్పుడు జగన్ సీఎం అయివుంటే ఏమయ్యేదో అంటూ ఏడ్వాల్సిన పనిలేదు. 2004 కాదు 2024 ఏం జరగనుందో చంద్రబాబు ఆలోచించాలి. పార్టీ అధికారంలోకి రాకపోతే టీడీపీతో పాటు వారసుడి భవిష్యత్ ఏంటో ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.
సొదుం రమణ