2024లో గన్నవరం టికెట్ ఎవరికో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తేల్చి చెప్పారు. తన స్నేహితుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహనే రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని తనతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి పేర్ని నాని సాక్షిగా కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వల్లభనేని నాయకత్వాన్ని వ్యతిరేకించే వాళ్లు తమ దారి ఏంటో వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.
2019లో టీడీపీ తరపున వల్లభనేని వంశీ గన్నవరం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలిచారు. వంశీ రాకను, నాయకత్వాన్ని వైసీపీ నియోజకవర్గ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల వీళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. వ్యవహారం సీఎం జగన్ వరకూ వెళ్లింది. వంశీతో కలిసి నడవాలని జగన్ సూచించినా వారు పట్టించుకోలేదు.
వంశీపై విమర్శలు, అటు నుంచి కౌంటర్లతో గన్నవరం రాజకీయం వేడెక్కింది. మీడియాకెక్కి పరస్పరం తిట్టుకుంటున్న వ్యవహారం వైసీపీకి తలనొప్పిగా మారింది. వల్లభనేని వంశీకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వనని దుట్టా రామచంద్రరావు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు.
గన్నవరం టికెట్ ఎవరికో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించాలని, ఆ తర్వాత భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానని మరో అసమ్మతి నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని గన్నవరం టికెట్‌పై స్పష్టత ఇచ్చారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటగా… వల్లభనేని వంశీమోహనే రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని తేల్చి చెప్పారు.
వ్యక్తులతో తమకు సంబంధం లేదని, అధినేత జగన్ ఎవరిని నిలబెడితే వారి విజయం కోసం పార్టీ శ్రేణులు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల గన్నవరంలో దుగ్గా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు అసమ్మతి కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకునే కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారని అర్థం చేసుకోవచ్చు.
గన్నవరంపై వైసీపీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో, ఇంకా వైసీపీ వేదికగా వంశీకి వ్యతిరేక రాజకీయాలు నడుపుతారా? లేక తమ దారేంటో చూసుకుంటారా? అనేది దుట్టా, యార్లగడ్డ ముందున్న ఆప్షన్లు.
సొదుం రమణ