రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక అభిప్రాయం. దానిని పూర్తిగా నమ్మింది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబునాయుడు వంటి నాయకులు.
అందుకే అప్పటివరకు మద్దతిచ్చి చేతిలో చేయి వేసి నడిచిన మోదీని వెన్నుపోటు పొడిచి అమాంతం బద్ధశత్రువైన కాంగ్రెస్ తో జతకట్టగలిగాడు.
తెరాసాతో కూడా చేతులు కలిపి మళ్లీ తెలంగాణాలో తెదేపాకి ఊపిరులూదుకునే ఆలోచనలు చేయగలిగాడు (ఈ విషయం కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పాడు).
కానీ అన్ని సామెతలూ ఎల్లవేళలా నిజాలు కావు. ఒక్కసారి శత్రువుగా మనసులో నమోదైతే ఇక పిడక కాలేవరకు ఆ శత్రుత్వాన్ని అలాగే ఉంచుకునే ఉద్దండ రాజకీయవేత్తాలున్నారు మన దేశంలో. మోదీ, అమిత్ షాలు ఈ పద్ధతికి నిలువెత్తు రూపాలు.
నిన్నటికి నిన్న మహరాష్ట్ర ఉదంతమే దీనికి మచ్చుతునక.
అక్కడ శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఆశ్చర్యకరంగా ఏకనాథ్ షిండే అనే శివసేన నాయకుడు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చిపారేసాడు. ఉన్న 56 ఎమ్మెల్యేలలో 40 మందిని పక్కకు లాగేస్తే ఇక చేసేదేముంది? ఉద్ధవ్ తప్పుకున్నాడు.
పైకి చూస్తే ఇది కేవలం శివసేనలో చిచ్చులాగ కనిపించొచ్చు. కానీ ఆ చిచ్చు పెట్టిందెవరు? అసలు కారణమేమిటి, కథేమిటి అని చూస్తే 2019 ఎన్నికల ముందు కాలానికి వెళ్లాలి.
శివసేన, బీజేపీ కలిసే పోటీ చేసాయి 2019 సార్వత్రిక ఎన్నికల్లో. బీజేపీకి 106 సీట్లు రాగా, శివసేనకి 56 వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసి 288 స్థానాల మహరాష్త్ర అసంబ్లీలో జయకేతనం ఎగరవేయడం కష్టం కాదు. కానీ ఉద్ధవ్ థాకరేకి ముఖ్యమంత్రైపోవాలన్న కోరికపుట్టింది. బీజేపీ దానికి ఒప్పుకోలేదు. అంతే వెంటనే బీజేపీని తూచ్ అని శరద్ పవార్ నీడలోని ఎన్.సి.పి కి మద్దతిస్తానన్నాడు.
ఈ వెన్నుపోటుని తాళలేని మోదీ-షాలు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్గాన్ని తమవైపుకు లాక్కుని మద్దతు కూడగట్టుకుని బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫద్నవీస్ ని ముఖ్యమంత్రిని చేసారు. శరద్ పవార్ మళ్లీ ఏం నమ్మబలికాడో ఏమో అజిత్ పవార్ వర్గం మళ్లీ ప్లేటు ఫిరాయించి వెనక్కి పోయింది. పర్యవసానంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండ్రోజుల్లోనే దేవేంద్ర ఫద్నవీస్ పదవీచ్యుతుడయ్యాడు.
ఈ వెన్నుపోట్ల పరంపరని తట్టుకోలేని మోదీ-షాలు సమయం కోసం చూసారు. జాగ్రత్తగా రాజకీయ పథకరచన చేసారు. నిజానికి ఇది కనీసం రెండేళ్ల క్రితమే జరగాల్సిన విషయం. ఆలశ్యమైనా ఎట్టకేలకి 40 మంది ఎమ్మెల్యేలని పక్కకు తప్పించి మరీ ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేసారు.
రాజకీయంగా ఇందులో మోదీ-షాలు చేసింది తప్పు కాదనిపిస్తుంది. ఉద్ధవ్ దే ముమ్మాటికీ తప్పు. ఎందుకంటే బాల్ థాకరే హిందుత్వవాది. కాంగ్రెస్ కి బద్ధవ్యతిరేకి. శివసేన ఆవిర్భావమే కరడుగట్టిన హిందూవాదంతో జరిగింది. బీజేపీ తో బాల్ థాకరే భావజాలం కలుస్తుంది. 1993 నుంచి 1998 వరకు శివసేన-బీజేపీ లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపాయి. అప్పట్లో శివసేనదే పైచేయి. బీజేపీది ఇంకా ఎదుగుతున్న వయసు.
ఈ నేపథ్యంలో తుచ్ఛమైన పదవి కోసం శివసేనని కాంగ్రెస్ పక్కలో పడుకోబెట్టడం బాల్ థాకరే అభిమానులకు అస్సలు మింగుడుపడని వ్యవహారం. ఏ మాత్రం ప్రజల్లో కరిష్మాలేని ఉద్ధవ్ కి ముఖ్యమంత్రి కావడానికి 2019 నాటి పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రాదని అనుకుని ఉండొచ్చు. అందుకే పదవి కోసం పార్టీ భావజాలాన్ని మంటలో కలిపాడు.
అలా ఏ ఎండకి ఆ గొడుకు పట్టుకునే నాయకులకి మోదీ-షాలు సమయం చూసి గుణపాఠం చెప్తుంటారు. అంతటితో ఆగరు కూడా. రాజకీయాన్ని తిప్పి శత్రువు అనుకున్న పార్టీని నామరూపాల్లేకుండా భూస్థాపితం కూడా చేయగలరు. అదీ మోదీ మార్కు రాజకీయం.
– హరగోపాల్ సూరపనేని