సినీ కార్మికుల సమ్మె వివాదం చుట్టూ తిరిగి దిల్ రాజు వద్దకు చేరింది. ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, అటు ఫిలింఛాంబర్ సభ్యులతో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా దిల్ రాజు ఎంపికయ్యారు. రేపట్నుంచి దిల్ రాజు రంగంలోకి దిగబోతున్నారు. సినీ కార్మికుల వేతనాలపై ఈ కమిటీ చర్చించి, ఓ నిర్ణయం తీసుకుంటుంది.
కమిటీ ఏర్పాటుతో కార్మికులు వెనక్కి తగ్గారు. రేపట్నుంచి షూటింగ్స్ కు హాజరు అవుతారు. కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ, పెంచిన వేతనాల్ని రేపట్నుంచి అమలు చేసేందుకు నిర్మాతల మండలి అంగీకరించింది. ఈ పని రోజులకు సంబంధించి పెంచిన వేతనాల మొత్తాన్ని ఫిలింఛాంబర్ కు అందిస్తారు సంబంధిత నిర్మాతలు. అక్కడ్నుంచి ఆ మొత్తం సినీ వర్కర్స్ కు అందుతుంది.
సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారని, 30శాతం వేతనాలు పెరిగాయంటూ మధ్యాహ్నం ప్రచారం జరిగింది. ఆ వెంటనే 30శాతం కాదు, 45 శాతం పెంచారంటూ మరో ప్రచారం ఊపందుకుంది. అయితే వేతనాలు పెంచలేదని నిర్మాత సి.కల్యాణ్ స్పష్టం చేశారు. వేతనాల పెంపు అంశాన్ని సమన్వయ కమిటీకి అప్పగించామని తెలిపారు. దీనికి సినీ కార్మిక సంఘాలు, ఫెడరేషన్ సభ్యులు కూడా అంగీకరించారు.
సమన్వయం కుదురుతుందా..?
వేతనాలు పెంచాలనేది కార్మికుల ప్రధానమైన డిమాండ్. దీనికి నిర్మాతలు కూడా అంగీకరిస్తున్నారు. వేతనాలు పెంచడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే కొన్ని విధివిధానాలు మార్చాల్సిన అవసరం ఉందని నిర్మాతలు గట్టిగా వాదిస్తున్నారు. అసలు 13 నెలల నుంచి వేతనాలు పెంచకపోవడానికి కారణం కూడా ఇదేనంటున్నారు నిర్మాతలు. విధివిధానాలు మారిస్తే, వేతనాలు సవరించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. అయితే అటు కార్మికులు మాత్రం విధివిధానాల్లో మార్పుచేర్పులకు అంగీకరించడం లేదు.
ప్రధానంగా ఈ అంశంపై సమన్యయ కమిటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. విధివిధానాలు మార్చకుండానే వేతనాలు పెంచుతారా.. లేక భారీగా వేతనాలు పెంచి విధివిధినాలు మారుస్తారా.. లేక విధివిధానాలు మార్చకుండా స్వల్ప పెంపుతో సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. సి.కల్యాణ్, దాము, సురేష్ బాబు లాంటి నిర్మాతలు మాత్రం విధివిధానాలు మార్చాల్సిందేనని పట్టుబడుతున్నారు.
గడువు పెట్టుకోలేదు..
సమన్వయ కమిటీ ఏర్పాటైంది. అందులో ఛాంబర్ సభ్యులు, ఫెడరేషన్ సభ్యులు ఎవరు ఉండాలనేది కూడా డిసైడ్ అయింది. అయితే కమిటీ తీసుకోబోయే నిర్ణయానికి గడువు మాత్రం పెట్టుకోలేదు. వీలైనంత త్వరగానే ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని అంతా చెబుతున్నారు. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నప్పటికీ, పెంచిన వేతనాలు రేపట్నుంచి అమలవుతాయనే ఆనందం మాత్రం కార్మికుల్లో ఉంది.
మొత్తానికి టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన సినీ కార్మికుల సమ్మె.. 48 గంటల వ్యవథిలోనే కొలిక్కి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.