Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఖేల్ ఖతమ్

ఖేల్ ఖతమ్

‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలు మాత్రమే’ అనే నీతి ఎంతగా పాచిపోయినది అయినప్పటికీ.. మళ్లీ మళ్లీ నిత్యసత్యంలాగా మన ముందు తటిల్మని మెరుస్తూనే ఉంటుంది. ‘ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేసి.. ప్రధానిగా కేసీఆర్ సింహనాదం చేసేందుకు వీలుగా కొత్తరూపులోకి అవతరించిన భారత రాష్ట్ర సమితి.. ఖేల్ ఖతమ్ అవుతోందా? దుకాన్ బంద్ చేయవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయా?

ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయినప్పుడు.. అందుకు కారణమేమిటో రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా పార్టీ ఖాళీ అవుతున్నది. ఇంకొన్నాళ్లకు కల్వకుంట్ల కుటుంబం తప్ప మరెవ్వరూ ఆ పార్టీలో ఉండరని.. ఆ నడుమ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్య అతిశయమే కావొచ్చు గానీ.. అంతకంటె కొంచెం బెటర్ స్థాయికి భారాస పరిస్థితి దిగజారుతున్నది. ఈ పతనం గురించిన విశ్లేషణే ఈవారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘ఖేల్ ఖతమ్’

పిల్లజమీందార్ సినిమాలో ఒక దృశ్యం ఉంటుంది. ప్రతిరోజూ వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే ప్రవీణ్ జయరామరాజు.. పరిస్థితులు వికటించి రాజన్న హాస్టల్ మరియు కాలేజీలో చదువు కొనసాగిస్తున్నప్పటి సీను అది. అక్కడ కాలేజీలో నాటకం వేయాల్సి వస్తుంది. వేరే వాళ్లెవరూ సెట్ కావడం లేదని.. నానితో పనిమనిషి పాత్ర వేయిస్తారు. మేకప్ అంతా అయ్యాక.. అందరూ కలిసి ఈ పాత్రలో ఎంత బాగా ఉన్నావో అంటూ నానిని పొగుడుతారు. అతడు మాత్రం లోపలి గదిలోకి వెళ్లి అద్దంలో తన ‘పనిమనిషి’ వేషాన్ని చూసుకుంటూ.. ‘‘ఏంటి నీది పనిమనిషి ఫేసేనా.. కాస్ట్ లీ బట్టలు వేసుకుంటే తప్ప కాస్ట్ లీగా కనిపించవన్నమాట నువ్వు.. థూ నీ బతుకు చెడ’’ అని తనను తానే తిట్టుకుంటాడు, 

కొంచెం అటు ఇటుగా భారత రాష్ట్ర సమితి పార్టీ పరిస్థితి ఇప్పుడు అదే విధంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే వారి వైభవం. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అది మహా బలమైన పార్టీగా చెలరేగగలుగుతుందా? ఒక్కసారి అధికారం జారిపోతే.. ఇక పార్టీగా మనుగడ కూడా వారికి కష్టసాధ్యమేనా? అనే అభిప్రాయాలు తాజా పరిణామాలను గమనిస్తే కలుగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి నుంచి నాయకులు విచ్చలవిడిగా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ప్రత్యేకించి.. ఆ పార్టీని ఖాళీ చేయించడానికే కాసుక్కూచున్నట్టుగా తెలంగాణలోని బిజెపి, కాంగ్రెస్ రెండూ కూడా ప్రయత్నిస్తున్నాయి.

కేంద్రంలో ఎటూ మోడీ 3.0 ప్రభుత్వమే ఏర్పడబోతోంది. మీకు భవిష్యత్తు బాగుంటుంది అని కమలదళమూ, రాష్ట్రంలో ఇప్పుడు దక్కిన అధికారాన్ని ఎప్పటికీ చేజారకుండా ఉండేలా పాలన సాగిస్తామనే భరోసాతో కాంగ్రెస్ పార్టీ.. గులాబీదళంలోని వారందరినీ ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర- జాతీయ రాజకీయాల్లో తమ భవిష్యత్తును ఎక్కడ కోరుకుంటున్నారు అనే అంశాన్ని బట్టి.. నాయకులు ఈ రెండింటిలో ఒక పార్టీని ఎంచుకుని అందులోకి ఫిరాయించేస్తున్నారు.

తెలుగునాట రాజకీయాల్లో నాయకుల ఫిరాయింపులు అనేవి ప్రజలకు ఒక వార్తలాగా కనిపించడం మానేశాయి. మధ్యాహ్నం వరకు భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే కేండిడేట్ గా ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతూ ఉండి, సాయంత్రం కాంగ్రెసులోకి ఫిరాయించేసిన శ్రీగణేష్ వంటి వారిని కూడా మనం గమనిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నాటినుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నేడో రేపో కూలిపోబోతున్నదని అంటూ భారాస పాట పాడుతూనే ఉంది. కూలుతుందో లేదో తరవాత.. ముందు భారాసలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెసు పార్టీలో చేరిపోతారేమో అనిపించేలా రేవంత్ రెడ్డి పరిస్థితుల్ని నిర్దేశిస్తూ వచ్చారు.

గులాబీదళం నుంచి పలువురు ఎమ్మెల్యేలు విడివిడిగాను, సమూహాలుగానూ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ‘మర్యాదపూర్వకంగా’ కలిశారు. తమ తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించి వెళ్లారు. ఫిరాయించే ముందు ప్రతి నాయకుడు చెప్పే మాటలనే వారు కూడా చెప్పారు. ఆ రకంగా వారందరూ కూడా ఫిరాయించబోతున్నారని ప్రజలు ప్రిపేర్ అవుతున్న తరుణంలో, వారు ఫిరాయించకుండా కట్టడి చేయడానికి భారాస పెద్దలు కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో కలిసిన వారు కాకుండా, అనూహ్యంగా ఇతర నాయకులను రేవంత్ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే దానం నాగేందర్ వచ్చారు, ఇప్పుడు కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య, కె.కేశవరావు తదితరులు వచ్చేశారు.

నాగేందర్ సంగతి ఎటున్నా.. మిగిలిన వారి ఫిరాయింపు కేసీఆర్ అంత త్వరగా జీర్ణం చేసుకోగలిగేది కాదు. పాపం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదంటే.. ఎంపీ టికెట్ ఇస్తాం అంటే.. అందరూ వద్దువద్దని తిరస్కరిస్తున్నారు. బలవంతంగా టికెట్ అంటగడితే, ఆ తర్వాత కూడా దాన్ని కాదనుకుని పారిపోతున్నారు. భారాసకు ‘వరంగల్ ఎంపీ’ పాఠం చాలా గొప్పది. అక్కడి పరిధిలోని నాయకుడు ఆరూరి రమేష్ పార్టీ నుంచి వెళ్లిపోవడానికి డిసైడ్ అయ్యారు.

ఎర్రబెల్లి వంటి నాయకులు వెళ్లి బలవంతంగా ఆయనను తీసుకువచ్చి కేసీఆర్ సమక్షంలో కూర్చోబెడితే.. తాను వాళ్ల వద్దకు వెళ్లలేదని, బిజెపినే తనను సంప్రదిస్తోందని చెప్పారు. వెళ్లే ఆలోచన మానుకుంటానని కేసీఆర్ తో అన్నారు. ‘పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు’ అంటూ కేసీఆర్ కూడా.. ఏదో మందలింపుగా ఆరూరి రమేష్ ను హెచ్చరించి.. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే.. ఆయన వద్దన్నారు. టికెట్ తీసుకోనే లేదు. తీరా అదే రోజున కడియం శ్రీహరి కూతురు కావ్యకు ప్రకటించారు. ఓ పది దినాలు గడిచిన తర్వాత.. ఇప్పుడు కావ్య తూచ్ నాకు టికెట్ వద్దు అనేసి.. కాంగ్రెసులోకి వెళ్లింది. వెళ్తూ వెళ్తూ లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ లలో ఇరుక్కున్న ఈ పార్టీనే వద్దు అని తెగేసి చెప్పేసి వెళ్లింది.

తన తర్వాత తనంతటి నాయకుడుగా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్న కేశవరావు కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. అది కూడా.. ఇక్కడ నిరంతరాయంగా రాజ్యసభ ఎంపీ పదవిని అనుభవిస్తూనే! 84 ఏళ్ల వయసులో ఆయనకు మళ్లీ తన తల్లి ఒడికి చేరాలని అనిపించిందట. ఈ రకంగా చూసినప్పుడు భారాసనుంచి ఒక్కరొక్కరుగా అందరూ జారుకుంటున్నారనే అర్థమవుతోంది. గత్యంతరంలేని వాళ్లు తప్ప ఎవరూ అక్కడ మిగలరేమో అని కూడా అనిపిస్తుంది.

భారత రాష్ట్ర సమితి అనేది తమ రాజకీయ ప్రస్థానంలో మధ్యలో కాసేపు సేదతీరడానికి ఉన్న హాల్టింగ్ స్టేషన్ లాగా ప్రతి ఒక్కరూ ఫీలవుతున్నారా? అనిపిస్తోంది. వచ్చారు, కాసేపు హాల్ట్ చేశారు, ఇప్పుడు వెళ్లిపోతున్నారు.. అన్నట్టుగానే రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణను సాధించింది మేమే అని చెప్పుకున్న పార్టీకి, అలాంటి వాదనతో ప్రజలను నమ్మించగలిగిన పార్టీకి, తమ పార్టీ వ్యవస్థాపకుడిని తెలంగాణ జాతిపితగా ఆవిష్కరించిన పార్టీకి, తెలంగాణలో దక్కుతున్న ప్రజాదరణతో సంబరపడిపోయి.. దేశరాజకీయాలను మొత్తం తామే శాసించాలనే కోరికతో జాతీయస్థాయికి అవతరించిన పార్టీకి ఇంతటి దీనస్థితి ఎందుకు దాపురించింది. కేవలం వెళ్లిపోతున్న నాయకుల అవకాశవాదం మాత్రమే కారణమా? పార్టీ పరమైన లోపాలు ఏమీ లేవా? దళపతుల స్వయంకృతాలు లేవా? ఉంటే ఎలాంటివి? సరిదిద్దుకోగలిగినవేనా? ఎలా? అనే అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 

అవకాశవాదం నిజం

ఇప్పుడు చిల్లరగా పార్టీలు మారుతున్న వారిలో.. చిత్తశుద్ధిలగల నేతలుగా గుర్తింపు ఉన్న సీనియర్లు కూడా ఉన్నారు. చాలామంది కంటె భిన్నంగా కేశవరావు పార్టీని వీడే ముందు స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి.. పార్టీని వీడుతున్నట్టు చెప్పడం మనం చూశాం. గులాబీ దళపతి అసహనానికి గురయ్యారు. ఆగ్రహించారు. పదేళ్లు అధికారంలో ఉంటే అన్నీ అనుభవించి, ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లిపోతారా? అంటూ సీరియస్ అయ్యారు. ఆయన చెప్పింది నిజమే. ఇది నాయకుల అవకాశవాదమే.

అయితే ఆ అవకాశవాదాన్ని, సిగ్గుపడవలసిన విషయంగా కాకుండా, ఒక మామూలు విధానంలాగా వారికి అలవాటు చేసింది ఎవరు?  రాజకీయాల్లో ఉండడం అంటే.. ఎప్పటికప్పుడు రంగులు మార్చేస్తూ, అధికారం పంచన ఉండడం మాత్రమే సరైన పద్ధతి అనే సిద్ధాంతాన్ని అందరూ నేర్చుకునేలా చేసింది ఎవ్వరు? ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు.. అందరి వేళ్లూ కేసీఆర్ వైపే చూపిస్తాయి.

రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చి కేసీఆర్ వెంట నిలిచారు. వారంతా రాష్ట్ర సాధన అనే లక్ష్యం కోసం వచ్చారని అనుకోవచ్చు. కానీ 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ తెలుగుదేశం పార్టీని దాదాపుగా ఖాళీచేసేశారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీని దాదాపుగా ఖాళీ చేయించేశారు.ఆ సందర్భాల్లో వారందరికీ కేసీఆర్ ‘ఏం చెప్పి’ తన పార్టీలోకి లాక్కుని ఉంటారు. ‘మేం అధికారంలో ఉన్నాం.. అధికారంలో మేమే ఉంటాం.. ఉండబోతున్నాం.. మా పార్టీలోకి వచ్చేయడం మీకు శ్రేయస్కరం’ అని చెప్పి ఉంటారేమో! వారందరికీ కూడా అర్థమైంది.

‘అవున్నిజమే. అధికారంతో పాటు మనం ఉండాల్సిందే’ అనుకుని వచ్చారు. ఇప్పుడు కూడా వారు అప్పట్లో కేసీఆర్ నేర్పిన పాఠాన్నే అనుసరిస్తున్నారు. అధికారంతో జతకలిసి ఉండడానికే వెళ్లిపోతున్నారు. కేటీఆర్, బండి సంజయ్ ప్రభృతులు కోరుకుంటున్నట్టుగా, పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెసు సర్కారు కూలిపోకపోయినా.. అయిదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికార బదలాయింపు జరిగేలా ప్రజలు తీర్పు చెబితే గనుక.. అప్పుడు మళ్లీ ఈ నాయకులు అందరూ.. తిరిగి అధికారం పంచకు చేరుతూ ఇంకోసారి ఫిరాయించవచ్చు కూడా.

కాబట్టి అవకాశవాదం అనేది తప్పుగా పరిగణించే రోజులు పోయాయి. వారికి అవకాశవాదాన్ని ఆ స్థాయిలో నేర్పిన కేసీఆర్ తప్పిదమే మనకు ఎక్కువగా కనిపిస్తోంది. 

భారాసకు సిద్ధాంతబలం ఉందా?

ఒక పార్టీ మనగలగాలి, వర్ధిల్లాలి అంటే.. ఆ పార్టీకి నిర్దిష్టమైన సిద్ధాంతబలమూ, నిర్దిష్టమైన లక్ష్యమూ ఉండాలి. లేకపోతే కష్టం. పార్టీ సిద్ధాంతాల నిర్మాణం బలంగా ఉండాలి. వాటిని ఆ పార్టీ ఆచరిస్తుందా? లేదా? అనేది తర్వాత. కానీ మౌలిక నిర్మాణం తప్పనిసరిగా ఆ పార్టీ పుట్టుకలోనే ఉండాలి. పార్టీలో ఎవరైనా చేరాలన్నా, ఆకర్షితులు కావాలన్నా ప్రధానంగా ఆ సిద్ధాంతాలే పనిచేయాలి. మరి భారాసకు అలాంటి నిర్దిష్టమైన సిద్ధాంతబలం ఉందా? ‘ఎస్’ అని ధైర్యంగా చెప్పలేని పరిస్థితి.

కానీ.. భారాస గొప్పదనం ఏంటంటే.. ఆ పార్టీ పుట్టుకలో నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి వాళ్లు చిత్తశుద్ధితో కట్టుబడ్డారు. ఆ లక్ష్యమూ, లక్ష్యం పట్ల వారి చిత్తశుద్ధీ చూసి ఎంతోమంది ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. కానీ సిద్ధాంత బలం లేకుండా, కేవలం లక్ష్యంతోనే పుట్టే పార్టీల మనుగడ కష్టం. ఆ లక్ష్యం పూర్తయిన తర్వాత ఆ పార్టీలకు ఇక మనుగడ ఉండదు. కనీసం- పార్టీ పుట్టేప్పుడు సిద్ధాంతాల నిర్మాణం లేకపోయినప్పటికీ.. తమ లక్ష్యం నెరవేరిన తర్వాత.. వీలైనంత తక్కువ వ్యవధిలో సిద్ధాంతాల నిర్మాణం చేసుకోవాలి.

భారాస మైనస్ పాయింట్ అది. ఆ పార్టీకి కేవలం లక్ష్యం ఉంది తప్ప.. సిద్ధాంతబలం లేదు. రాష్ట్ర సాధనతో లక్ష్యం తీరిపోయింది. అప్పుడు వారు అలర్ట్ అయి ఉండాలి. కానీ అప్పుడు దక్కిన అధికారంతో ఇతర పార్టీలనుంచి అవకాశవాదుల్ని ప్రోత్సహించారు తప్ప.. పార్టీని సిద్ధాంతాలవైపు మళ్లించే ప్రయత్నం చేయలేదు. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఫిరాయింపులన్నీ కూడా. 

సమయం మించిపోయిందా?

భారత రాష్ట్ర సమితిని ఖాళీ చేయించడంపై రేవంత్ రెడ్డికి ఎజెండా క్లియర్ గానే ఉంది. అయితే.. ఇప్పుడు అవసరమైనంత మేరకు మాత్రమే.. నాయకుల్ని తీసుకుంటారు. పార్లమెంటు ఎన్నికలు కూడా పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలను గరిష్టంగా ఖాళీ చేసే అవకాశం ఉంది. తద్వారా.. రేవంత్ సర్కారు కూలిపోతుంది.. కూలిపోతుంది.. అంటూ తమ కోరికలను జ్యోతిష్య ఫలితాలులాగా పదేపదే అంటున్న కేటీఆర్, హరీష్ రావు ప్రభృతుల నోర్లకు ఆయన తన చేతలతో తాళాలు వేయిస్తారు. ఎంతమందిని ఆకర్షించినా భారాసలో ఎంతో కొంతమంది కచ్చితంగా మిగులుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ గుర్తించాల్సింది ఏంటంటే.. సమయం మించిపోలేదు అని!

పార్టీలో మిగిలేవాళ్లలో రెండు రకాలు ఉంటారు. ఒకరు- పార్టీ మౌలిక లక్ష్యం పట్ల విశ్వాసంతో కట్టుబడి ఉండేవాళ్లు. రెండు- మరెక్కడా గతిలేని వాళ్లు. ఒకరకంగా.. రాష్ట్రంలో అధికారబదలాయింపు జరిగిన ఆరునెలల కంటె తక్కువ వ్యవధిలోనే భారాస ఖాళీ అయిపోతే ఎక్కువ సంతోషించాల్సింది ఆ పార్టీ నాయకులే. ఎందుకంటే.. అవకాశవాదులందరూ వెళ్లిపోగా.. పార్టీని నమ్మిన వాళ్లు  మాత్రమే అక్కడ మిగులుతారు గనుక. మరియు, వాళ్లను ఎమ్మెల్యే అభ్యర్థిత్వాలకు తగిన గట్టి నాయకులుగా తయారు చేసుకోవడానికి ఇంకా నాలుగున్నర నెలల సమయం ఉంటుంది గనుక.

మరి వారు పార్టీని కాపాడుకోవడానికి జాగ్రత్తపడతారో.. లేదా, ఎప్పటిలాగే.. అధికారంలో ఉండగా తాము చేసిన దందాలపై జరిగే విచారణల మీదినుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ రేవంత్ ప్రభుత్వం రేపు కూలిపోతుంది.. ఎల్లుండి కూలిపోతుంది అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తారో వేచిచూడాలి. 

.. ఎల్ విజయలక్ష్మి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?