ఏ గొడవా లేకపోతే మనకు మనశ్శాంతి వుండదు. పెరుగుతున్న ధరలు, పెట్రోల్, గ్యాస్ రేట్లు ఇవన్నీ మనకి గుర్తు రాకుండా వుంటే ఏదో ఒక సమస్యను అగ్గి పుల్ల పెట్టి వెలిగించాలి. ఒకప్పుడు విదేశీయులు మనల్ని పాలించారు.
ఒక గుజరాతి (గాంధీ) వచ్చి వాళ్లని తరిమేశారు. ఇప్పుడు గుజరాత్ వాళ్లే మనల్ని (మోదీ, అమిత్‌షా) పాలిస్తున్నారు. మన పిల్లలు ఇక్కడ బతకలేక విదేశాలకు వెళ్లిపోతున్నారు. పోనీ అక్కడ ఏదైనా కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుదామంటే మనకంటే ముందు వచ్చి పటేల్ బజార్లు పెట్టేశారు. అమెరికాలో ఉప్పు, పప్పు, చింతపండు ఏం కావాలన్నా పటేల్ వారి దయ.
మోదీ సార్‌కి ఉచిత సలహా (ఉచితం అనే పదం వాడితే జగన్‌కి కోపం. ఆ పదంపై పేటెంట్ హక్కులు ఆయనవే) ఏమంటే గతంలో పెద్ద నోట్లు రద్దు చేశారు. చిన్నవాళ్లు నానా తిప్పలు పడి క్యూల్లో నిలబడ్డారు. పెద్దవాళ్లకి కూచున్న చోటుకే నోట్ల మార్పిడి జరిగింది. ఈ సారి అట్లా కాకుండా చిన్న నోట్లని రద్దు చేస్తే ఫలితం వుంటుంది.
ఎందుకంటే చిన్న నోట్లకి ఏమీ కొనలేం. వందలోపు నోట్లు రద్దు చేసి, ధరల స్థిరీకరణ అంటే రౌండ్ ఫిగర్ చేసేస్తే సమస్యే వుండదు. అంటే పెట్రోల్ 200, పచ్చిమిర్చి 100. ఈ రకంగా వుంటే అందరికీ సౌలభ్యం, ఒకవేళ తప్పనిసరి పరిస్థితులుంటే డిజిటల్ పేమెంట్స్ వుండనే వుంటాయి. అప్పుడు రూపాయికి విలువ లేదని ఎవరూ అనలేరు. వందకే విలువ లేకపోతే ఇక రూపాయి గోల ఎందుకు!
చరిత్రలో చిన్న నోట్ల రద్దు అని విప్లవాత్మక ప్రక్రియ రికార్డు అవుతుంది. మీడియాలో కనీసం నెల రోజులు చర్చలు, కొట్లాటలు, ఆర్థికవేత్తల ప్రసంగాలు, సలహాలు, సూచనలు నడుస్తూ వుంటాయి. సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్స్‌లో బిజీగా వున్న ప్రజలు అసలు సమస్యను మరిచిపోతారు.
అప్పుడు ప్రతిపక్షాలు కూడా గందరగోళంలో పడతాయి. చిన్న నోట్ల రద్దుని మేము గుర్తించబోమని కేసీఆర్ అనలేడు. నోట్లను గుర్తించే పని రిజర్వ్ బ్యాంక్‌ది. తెలంగాణకి సొంత కరెన్సీ ఉండాలనే డిమాండ్ తెచ్చినా తెస్తాడు. ఆయన మొండి మనిషి, చెప్పలేం సాధించినా సాధిస్తాడు.
తమిళులు ఆవేశపరులే కానీ, గతంలో అయితే ఒంటి మీద పెట్రోల్ పోసుకుని బెదిరించే వాళ్లు కానీ, ఇప్పుడు పెట్రోల్ ధర చూస్తే ఒంటి మీద పోసుకోవాలన్నా భయమేస్తుంది. ఇక జగన్, ఉన్న రాజ్యసభ సీట్లనే గుజరాత్ వాళ్లకు ఇస్తున్నాడు. టైంకి అప్పులిస్తూ వుంటే మీ జోలికి రాడు. కర్నాటకలో వున్నది మీ కీలు బొమ్మయి. యూపీలో బుల్డోజర్లకి సరిపడే డీజిల్ ఇస్తూ వుంటే యోగి మారు మాట్లాడడు.
రాహుల్ గాంధీకి ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే తప్ప దేశంలో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏం చేసినా నోటు మీద గాంధీబొమ్మ చెరపలేరు కదా, గాంధీ పేరు చెప్పుకుని ఇంకో రెండు తరాలు రాజకీయం చేసేస్తారు. మోదీ సార్, మీకు ఎదురే లేదు. బుల్డోజర్ మీరు.
జీఆర్ మహర్షి