చంద్రబాబు దయనీయ గాధ

వద్దు అవతలకి పొమ్మంటున్నా ఒక పార్టీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్టు చరిత్రలో మరే ఇతర నాయకుడు వెంపర్లాడిన దాఖలాలు లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజీపీతో తెగతెంపులు చేసుకుని నోటికొచ్చిందల్లా పేలి,…

వద్దు అవతలకి పొమ్మంటున్నా ఒక పార్టీ పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నట్టు చరిత్రలో మరే ఇతర నాయకుడు వెంపర్లాడిన దాఖలాలు లేవు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు బీజీపీతో తెగతెంపులు చేసుకుని నోటికొచ్చిందల్లా పేలి, కాంగ్రెసుతో జట్టుకట్టి భంగపడ్డ కథ చంద్రబాబుది. మళ్లీ మోదీ పదవిలొకొస్తాడని ఏ మాత్రం నమ్మని చంద్రబాబు అప్పట్లో కమలానికి పొడిచిన వెన్నుపోటది. 

చంద్రబాబు అవకాశవాద రాజకీయాన్ని రుచి చూసిన మోదీ-షాలకి తత్వం బోధపడింది. చంద్రబాబుతో ఎలా వ్యవహరించాలో తేటతెల్లమయ్యింది. 

రాజకీయాల్లో ఒక ప్రాధమిక సూత్రముంది. ఒకడు బాగా బలహీనపడి పోయేట్టు ఉంటే మరొక బలమైన దెబ్బ కొట్టి మళ్లీ లేవకుండా చావు దెబ్బ కొడతారు తప్ప చేయందిచ్చి పైకి లేపరు. అందునా ఒక సారి వెన్నుపోటు పొడిచిన వాడు బలహీనపడ్డప్పుడు ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోరు. దానికి తోడు శత్రువుకి శత్రువు మిత్రుడు టైపులో మరొక ప్రజాబలమున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అష్టదిగ్బంధనానికి ఏర్పాట్లు చేసి మరీ చావుదెబ్బ కొట్టే అవకాశాలే ఎక్కువ. 

చంద్రబాబుని అపరచాణక్యుడిగా ఎల్లో మీడియా కొనియాడుతుంది కానీ కనీస పరిజ్ఞానం కూడా లేని మొద్దబ్బాయిలాగానే వ్యవహరిస్తున్నాడు ఆయన ఈ మధ్యన. ఒక పక్కన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వేల కోట్లు అందజేస్తూ, పోలవరానికి సైతం ఫండ్స్ రిలీజ్ చేస్తూ బహిరంగంగానే వైకాపా-భాజపా మైత్రిని చాటుతుంటే చంద్రబాబు ఇప్పటికీ కమలనాధులను కలిసే ప్రయత్నాలేవిటో అస్సలు అర్ధం కాదు. 

ఏమన్నా అంటే తెలంగాణాలో భాజపాకి మద్దతిచ్చి తెదేపా సానుభూతిపరులందరి ఓట్లను భాజపాకు పడేలా చేస్తే ఆంధ్రలో తెదేపాతో పొత్తు గురించి ఆలోచిస్తామని కమలనాయకులు చంద్రబాబుతో చెప్పారట. చెప్తే చెప్పుండొచ్చు. అది నిజమనుకుని చంద్రబాబు నమ్మితే అతనికంటే తెలివితక్కువ ప్రాణి దేశరాజకీయాల్లోనే ఉండడని తేల్చేయొచ్చు. 

భాజపా తెలంగాణలో మూడవస్థానంలో ఉంది. తెదేపా ఇక్కడ అంతర్ధానమయ్యి చాలా ఏళ్ళయ్యింది. ఇక ఎటొచ్చీ తెదేపా సానుభూతుపరులైన తెలంగాణా ఓటర్లట! వాళ్లు ఎంతమందుంటారు, ఎక్కడుంటారు? వాళ్లకి భాజపా మీద ప్రేమెందుకుంటుంది? చంద్రబాబు వేయమంటే ఓట్లేసేస్తారా? వాళ్లకి బీఆర్ఎస్ అన్నా, భాజపా అన్నా అస్సలు పడదు. కళ్లు మూసుకుని కాంగ్రెసుకి గుద్దుతారు తప్ప చంద్రబాబు చెప్తే వేసే స్థితిలో వాళ్లు ఉండరు. ఒకవేళ వేసేసినా సంఖ్యాబలం రీత్యా ఆ ఓట్లు దేనికీ పనికిరావు. ఈ లెక్కలన్నీ భాజపా పెద్దలకి తెలుసు. అయినా సరే, చంద్రబాబుని ఒక ఆట ఆడుకోవడానికి చేస్తున్న సర్కస్సే ఇదంతా. చంద్రబాబుకి మాత్రం ఇది అర్థం కావట్లేదు. 

ఇక్కడ తెలంగాణాలో బాబుకి ఏవీ లేదని గాలి తీయడం, తెలంగాణా ఎన్నికల్లో ఎందుకూ పనికిరాకుండా పోయావు కనుక ఆంధ్రలో పొత్తు లేదని చెప్పడం..ఈ రెండూ జరిగేలా చూస్తున్నారు కమలనాధులు. 

ఒక్క చిన్న కేసుని తిరగతోడతారనే భయంతో చంద్రబాబు బీజేపీతో పొత్తు పూజ చేస్తున్నాడని అంటున్నారు. ఒకరకంగా అది నిజమే కావొచ్చు. భాజపాకి పదేళ్ల పాలన అనంతరం సహజంగా వచ్చే ప్రభుత్వవ్యతిరేకత వచ్చింది. అది దక్షిణాదిన మరింత బలంగా ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు కంటే సరిగ్గా ఎన్నికల ముందు పాత కేసులు తిరగతోడి తనను లొపలేస్తారేమో అనే భయం బాబుని ఆవరించి ఉండొచ్చు. 70ల్లో ఉన్న బాబుకి, 80ల్లో ఉన్న రామోజీరావుకి ఈ వయసులో కడుపులో చల్ల కదలకుండా జీవితం గడిచిపోవాలని కోరుకోవడం సహజం. జైల్లో కూర్చునే శారీరకమైన ఓపిక, ఆ మచ్చని మోసే మానసిక బలం రెండూ వాళ్లకి లేవు. 

చంద్రబాబులో మాత్రం విపరీతమైన బెదురు కనపడుతోంది. పొత్తు కోసం ప్రదక్షిణాలే దానికి నిదర్శనం. అమరావతి కుంబకోణం విషయంలో సీబీఐ విచారణ లాంటివి బిగించి ఇంకొంచెం గట్టిగా బెదిరిస్తే తన పార్టీని బీజేపీలో విలీనం చేసేసినా చేసేస్తాడేమో చంద్రబాబు అంటూ రాజకీయ మీడియా వర్గాలు జోకులు కూడా వేసుకుంటున్నాయి. ఏదిఏమైనా చంద్రబాబుది దయనీయ గాధ. ఎటూ తేల్చుకోలేని పరిస్థితి, ఏం చెయ్యాలో తెలీని దుస్థితి. 

– హరగోపాల్ సూరపనేని