Advertisement

Advertisement


Home > Politics - Opinion

జీవితం ఒక 3D సినిమా

జీవితం ఒక 3D సినిమా

జీవితం ఒక 3D సినిమా. లోతు ఎప్ప‌టికీ అర్థం కాదు. న‌ల్ల అద్దాలు పెట్టుకుంటే ఇంకా మ‌స‌క‌. ఎపుడూ క‌త్తి తిప్పుతూనే వుండు. లేదంటే ఖాళీగా ఉన్న క‌త్తి నిన్ను పొడుస్తుంది.

సూక్ష్మ జీవుల్లాగే కంటికి క‌న‌ప‌డ‌ని శ‌త్రువులు. గుర్తు ప‌ట్ట‌ని రూపాల్లో వుంటారు. నీలాగే కూడా వుంటారు. నిన్ను నువ్వే అనుకుని పొర‌ప‌డ‌కు. నువ్వు వేరే. నువ్వు సాధువువి కాదు, స‌ర్పానివి. గొంతులో విషమున్న‌ ప్ర‌తివాడు ప‌ర‌మ శివుడు కాదు. నువ్వు గాల్లో న‌డుస్తున్న‌ప్పుడు చ‌ప్ప‌ట్లు కొట్టిన వాళ్లే, కింద ప‌డితే చావు మేళం మోగిస్తారు. ప‌డిన వాడు లేస్తాడు. లేచిన వాడు ప‌డ‌తాడు.

క‌ళ్లాపి చ‌ల్లుతున్న‌ప్పుడు అర్థం కాదు, అవి క‌న్నీళ్ల‌ని. మోహ‌న‌దులు కూడా వైత‌ర‌ణిగా మారుతాయి. స్వ‌ర్గ‌మే న‌ర‌కం, న‌రకం కూడా అల‌వాటైతే స్వర్గం. కొర‌డాలు తాకుతున్న‌ప్పుడు పూల రెమ్మ‌లుగా భావించు.

అన్ని శాస్త్రాలు మ‌నిషిని బాగా బ‌త‌క‌మ‌నే చెప్పాయి. ఎవ‌డైనా బ‌తికాడా? శ‌వాల‌కి అత్త‌రు పూసి, ముక్కులు మూసుకున్న వాళ్లే క‌దా ఈ భూమండ‌లం అంతా.

సినిమా ప్రారంభం, ముగింపు తెలియ‌దు. ఇంట‌ర్వెల్‌లో పాప్‌కార్న్ తిని ఇంటికి వెళ్ల‌కుండా ఎందుకీ స‌మీక్ష‌? ఎవ‌డికీ ఏమీ తెలియ‌దు. తెలుసు అనుకుని లుక‌లుక‌లాడుతూ జీవించ‌డం త‌ప్ప‌.

తీగ‌లు తెగి సంగీతం స్ర‌విస్తుంది. కాలం ప్ర‌వ‌హిస్తోంది. రెండు న‌క్ష‌త్రాలు గ‌ట్టిగా ఢీకొంటే ఎవ‌రూ మిగ‌లం. దూళిలో జీవిస్తూ, బ్ర‌హ్మాండ ర‌హ‌స్యం కోసం వెతికేవాళ్లం.

మ‌నుషుల చ‌ర్మం పాత‌బ‌డిపోయింది. కుబుసం వ‌ద‌ల‌డం తెలియ‌ని పాములు. పొడిపొడిగా, పొర‌లుపొర‌లుగా రాలుతున్న చ‌ర్మం. నీకు నువ్వు న‌గ్నంగా క‌న‌ప‌డితే దాన్ని మించిన హార‌ర్ సినిమా వుంటుందా?

అంద‌రూ గొంగ‌ళి పురుగుల‌మే. సీతాకోక‌చిలుక క‌ల కంటున్న‌వాళ్ల‌మే. లోప‌ల నిగూఢ చీక‌టి ఆవ‌రించిన‌ప్పుడు రంగులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయి?

బ్ర‌హ్మం అంటే ప‌ర‌మాత్మ‌, బ్ర‌హ్మం అంటే స‌త్యం, జ్ఞానం అనంతం. అంతా అస‌త్యం, అజ్ఞానం, అంతం. మ‌రి తైత్తిరీయా ఉప‌నిష‌త్తుకి అర్థం వుందా?

జీవితం అంటే కన్నీటి చారిక‌లు వెతుక్కోవ‌డ‌మే క‌దా! చితిలో కాలుతున్న ఒక అనాథ శ‌వానికి కూడా ఏవో క‌ల‌లు వుండే వుంటాయి. బుడ‌గ‌ల్లాగా అన్నీ చిట్లి పోతాయి.

హైనాకి త‌న‌, మ‌న వుండ‌దు. స్వ‌జాతిని తింటుంది. మ‌నిషి కూడా నాగ‌రిక హైనా క‌దా!

ఎడారిలో పాద‌ముద్ర‌లు వెతికితే ఒయాసిస్సులు క‌నిపిస్తాయా? ఎక్క‌డ మొద‌ల‌య్యావో అక్క‌డే ఆగిపో. ప్ర‌యాణం వృథా. మ‌న‌మంతా వెన‌క్కి వెళుతున్న యాత్రికులం. ర‌క్తాన్ని వాస‌న చూస్తున్న తోడేళ్లం. అంద‌మైన కోక‌ల్ని అలంక‌రించుకున్న వాళ్లం. స్వ‌ప్న సౌధాలు క‌డుతున్న వాడా? కాసేపు ఆగు. ఎదురుగా శ్మ‌శానం వుంది. ఎవ‌రో కాలిపోతున్నారు. నీలాగే క‌ల‌లు క‌న్న‌వాళ్లు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?