ఇపుడైతే పది రూపాయలకి కూడా విలువ లేదు కానీ, ఒకప్పుడు పది పైసలు కూడా ఫేస్ వాల్యూతో వుండేది. బ్లాక్‌లో టికెట్లు అమ్మేవాళ్లు వుంటారని మొదటిసారి చూసింది మోసగాళ్లకి మోసగాడు సినిమాకి. ఏడెనిమిదేళ్ల వయసు. మా ఫ్రెండ్స్ వాళ్ల అన్నయ్యలు దొంగగా సినిమాకు వెళుతుంటే వెంటపడ్డాను. రాయదుర్గంలో మహత్తరమైన KB ప్యాలెస్ వుండేది. అక్కడికి వెళ్లే సరికి ఒకటే జనం. బీడీలు, సిగరెట్ల కంపు. తప్పి పోకుండా వుండడానికి ఒక అన్నయ్య చెయ్యి గట్టిగా పట్టుకున్నాను.
బుకింగ్‌లు ఎంత ఇరుగ్గా వుండేవంటే లోపలికి వెళితే నాలాంటి పిల్లలు బయటికి రాలేరు. నేనే కాదు, మా అన్నయ్యలు కూడా రాలేరని అర్థమైంది. కొంత మంది మనుషుల భుజాలపై ఎక్కి కౌంటర్‌లో చేయి పెడుతున్నారు. కౌంటర్‌లో నుంచి చెయ్యి బయటికి లాగడం చాలా పెద్ద ఆర్ట్.
అప్పుడొచ్చాడు ఒకడు. కోర మీసాలు, మాసిపోయిన చొక్కా, భుజంపైన కర్చీప్ నలభై, యాభై …నలభై యాభై అని అరుస్తున్నాడు. వాన్ని చూడగానే పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడనుకుని గుండెలు డబడబలాడాయి. వాడు బ్లాక్ టికెట్ల వాడు. 40 పైసల టికెట్‌ని 50 పైసలకి అమ్ముతున్నాడు. అంతకు మునుపు 30 పైసలే టికెట్. బంగ్లాదేశ్ యుద్ధం మాకు సోడా లేకుండా చేసింది. టికెట్ 10 పైసలు పెంచారు. అన్నయ్యలు చేసేది లేక బ్లాక్‌లో కొని నన్ను ఈడ్చుకెళ్లారు. జనానికి తొక్కుకుంటూ నడిచి, ఎవడి తొడ మీదో కూచున్నాను. కృష్ణ గుర్రం మీద కనబడితే విజిలెన్స్ సెక్షన్ విజృంభిస్తే నేనూ ప్రయత్నించాను. చేతకాలేదు. ఇంట్లో వాళ్లతో సంబంధం లేకుండా నేను చూసిన తొలి సినిమా 10 పైసల బ్లాక్ టికెట్ సినిమా.
థియేటర్‌లో వున్నంత సేపూ నాకు నేను పెద్ద వాడై పోయిన ఫీలింగ్. చెయ్యి వదిలితే తప్పి పోతానని భయం. ఎందుకంటే ఇంటికి దారి తెలియదు. కృష్ణ గన్‌తో కాలుస్తుంటే జనాల ముక్కుల్లో నుంచి పొగ వచ్చేది (బీడీలు). సోషల్ సినిమాలకి కూడా థియేటర్‌లో పొగ వచ్చే కాలం. క్రైం సినిమాల్లో తుపాకుల్లోంచి వచ్చే పొగకి ఇది అదనం.
కొంచెం పెద్దైన తర్వాత కలెక్టర్ జానకి సినిమాకి కూడా బ్లాక్‌లో కొన్నాను. అపుడు కూడా 10 పైసలే. రాయదుర్గం బ్లాక్ టికెట్ల వాళ్లు చాలా న్యాయంగా వుండేవాళ్లు. ఇప్పుడు తలచుకుంటే బాధగా వుంటుంది. ఎన్ని 10 పైసలు కలిస్తే ఒక రూపాయి.
ఇంకొంచెం పెద్దయ్యాక బుకింగ్‌లోకి వెళ్లే ధైర్యం వచ్చింది. ఆ రోజుల్లో బుకింగ్ సూత్రం ఏమంటే ఎవడో మనల్ని తోస్తాడు. మనం ఇంకెవరినో తోయాలి. చివరికి టికెట్‌తో బయటికి వస్తాం. ఒక్కోసారి పల్టీలు కొడుతూ వస్తాం.
అనంతపురంలో పెద్దగా బ్లాక్ టికెట్లు కొన్న గుర్తు లేదు. త్రివేణి టాకీస్‌లో మాత్రం బ్లాక్ నడిచేది. ఒకసారి రాజపుత్ర రహస్యం అనే సినిమాకి రెండు రూపాయల టికెట్‌ని నాలుగుకి కొన్నాను. ఆ సినిమాలో ఎన్టీఆర్ కాసేపు టార్జాన్‌గా కనిపిస్తాడు. దేవుడా, ఎన్నెన్ని విపత్తులు దాటుకుంటూ వచ్చామో!
1976లో బళ్లారికి వెళితే షోలే ఆడుతోందని తెలిసింది. అప్పటికి నేను చూడలేదు. సెకెండ్ రన్‌కి కూడా నటరాజ్ టాకీస్ నిండా జనం. బ్లాక్ టికెట్లు నడుస్తున్నాయి. రెండు రూపాయల టికెట్ ఏడు రూపాయలు. బాగా ఎక్కువని నేను బేరం ఆడుతుంటే ఇంకెవడో తన్నుకుపోయాడు. ఈ చిన్న తప్పు వల్ల షోలే చూడడం ఇంకో ఏడాది పట్టింది. బొంబాయిలో షోలే సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్మిన వాళ్లంతా షావుకార్లు అయిపోయి ఇళ్లు కొనేసుకున్నారని చెప్పుకునే వాళ్లు.
హైదరాబాద్‌లో బ్లాక్‌లో టికెట్లు కొనే అవసరం పెద్దగా రాలేదు. ఒకసారి రామకృష్ణలో “ఫనా”కి కొన్నాను. టికెట్ మీద 20 రూపాయలు ఇచ్చినట్టు గుర్తు. ఇంకోసారి గెలాక్సీలో కొన్నా.
ఇపుడైతే అన్ని సినిమాలు బ్లాక్‌లోనే చూస్తున్నాం. ఎందుకంటే నిర్మాతలే ఆ పాత్ర తీసుకుని టికెట్లు పెంచేస్తున్నారు. లేదంటే బుక్ మై షోకి టికెట్ మీద అదనపు డబ్బులిచ్చి తీసుకుంటున్నాం. థియేటర్లని నమ్ముకుని బ్లాక్‌లో జీవించే వాళ్లకి ఆ హక్కు లేకుండా పోయింది. పెద చేప చిన చేపని మింగడం అంటే ఇదే.
జీఆర్ మహర్షి